ప్రజాస్వామిక ప్రభుత్వాలకు పార్టీలే పునాదులు

– భారత నిర్మాతలుగా యువతను తీర్చిదిద్దుతాం : సీఎం కేసీఆర్‌
 – కోకాపేటలో భారత్‌ భవన్‌కు శంకుస్థాపన
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి, గండిపేట
ప్రజలతో ఎన్నికైన ప్రజాస్వామిక ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలే పునాదులని బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ అన్నారు. భావి భారత నిర్మాతలుగా యువతను తయారు చేసే దిశగా, దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరింత సమర్థవంతమైన నాయకత్వాన్ని తీర్చిదిద్దాల్సిన అవసర మున్నదన్నారు. ఇందుకోసం రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, సైద్దాంతిక రంగాల్లో భోధన, శిక్షణ అవసరం ఉందన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కోకాపేటలో భారత్‌ భవన్‌ (సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ అండ్‌ హూమన్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌)కు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజాభివృద్ధికి దోహదం చేసే దిశగా నాయకత్వాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఈ దిశగా ప్రపంచ వ్యాప్తంగా ఆయా రంగాల్లో అనుభవజ్జులైన గొప్ప గొప్ప మేధావులను, వివిధ రంగాల్లో అనుభవం ఉన్నవారిని పిలిచి నాయకత్వ శిక్షణనిప్పిస్తామన్నారు. ప్రజలకు సుపరిపాలన అందించే నాయకత్వాన్ని తయారు చేస్తామన్నారు. అందులో భాగంగానే ‘పొలిటికల్‌ ఎక్సలెన్స్‌ అండ్‌ హెచ్‌ ఆర్‌ డీ’ కేంద్రాన్ని తీర్చిదిద్దాలనే నిర్ణయం తీసుకున్నామని సీఎం వివరించారు. దేశం నలుమూలలనుంచి వచ్చే సామాజిక కార్యకర్తలకు, రాజకీయ వేత్తలకు, నాయకులకు భారత్‌ భవన్‌లో సమగ్రమైన సమస్త సమాచారం లభ్యమౌతుందని చెప్పారు. శిక్షణకు అనుగుణంగా.. తరగతి గదులు, ప్రొజెక్టర్‌తో కూడిన మినీహాల్స్‌, విశాలమైన సమావేశ మందిరాలు, అత్యాధునిక సాంకేతికత కలిగిన డిజిటల్‌ లైబ్రరీలు, వసతికోసం లగ్జరీ గదులు నిర్మితమౌతాయని అన్నారు. మీడియా రంగంలో రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న సాంకేతికను అందిపుచ్చుకునే దిశగా సీనియర్‌ టెక్నికల్‌ బృందాలు కూడా పనిచేస్తాయని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి రంగాల అధ్యయనం దిశగా, శిక్షణ సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ నిర్మాణ స్థలమంతా కలియ తిరిగారు. భవన నిర్మాణ సమయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి, ప్రభుత్వ నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్‌ తేజకు, అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. అంతకుముందు వేద పండితులు భూ వరాహ హౌమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌ రెడ్డి, మల్లారెడ్డి, బీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, నామా నాగేశ్వర్‌ రావు, ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌, బిబి పాటిల్‌, రంజిత్‌ రెడ్డి, దామోదర్‌ రావు, బడుగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, మధుసూదనాచారి, కవిత, శేరి సుభాష్‌ రెడ్డి, శంభీపూర్‌ రాజు, వెంకట్రామిరెడ్డి, మహేందర్‌ రెడ్డి, గోరెటి వెంకన్న, ఎగ్గె మల్లేశం,ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్‌, దానం నాగేందర్‌, కాలె యాదయ్య, నగర మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలచారి, చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్‌, రవీందర్‌ సింగ్‌, రాజీవ్‌ సాగర్‌, సతీష్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సుద్దాల సుధాకర్‌ తేజ, కార్తీక్‌రెడ్డి, సాయిచంద్‌, గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌, అనిల్‌ కూర్మాచలం, సోమ భరత్‌, జడ్పీ చైర్మన్‌ తీగల అనితారెడ్డి, గ్యాదరి బాలమల్లు, వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి, రావుల శ్రవణ్‌ కుమార్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Spread the love