అటవీ సంరక్షణ బిల్లు ఆమోదం

Passage of Forest Conservation Bill– ఖనిజాల తవ్వడానికి ప్రయివేట్‌కు అనుమతి ఇచ్చే బిల్లుకూ ఓకే
– రాజ్యసభలో ప్రతిపక్షాలు వాకౌట్‌
– లోక్‌సభలో గందరగోళం వాయిదా
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రాజ్యసభలో అటవీ సంరక్షణ బిల్లు ఆమోదం పొందింది. పార్లమెంట్‌ ఉభయ సభల్లో బుధవారం కూడా ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. దీంతో వాయిదా పర్వం కొనసాగింది. రాజ్యసభలో మాత్రం మూడు బిల్లులు ఆమోదం పొందాయి. రాజ్యసభలో ప్రతిపక్షాలు వాకౌట్‌ చేశాయి. ఈ సందర్భంలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ అటవీ సంరక్షణ బిల్లును చర్చకు ప్రవేశపెట్టారు. బీజేపీ, వైసీపీ, అన్నాడీఎంకే, బీజేడీ పార్టీల ఎంపీలు మాట్లాడిన తరువాత బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించుకున్నారు. అలాగే లిథియం, ఐదు ఇతర ఖనిజాలను తవ్వడానికి ప్రయివేట్‌ వ్యక్తులకు అనుమతించే గనులు, ఖనిజాల సవరణ బిల్లును, జన విశ్వాస్‌ సవరణ బిల్లులను కూడా ఆమోదించారు.
సభకు హాజరుకాను…స్పీకర్‌ ఓం బిర్లా
మరోవైపు లోక్‌సభలో అధికార, ప్రతిపక్ష సభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై స్పీకర్‌ ఓం బిర్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో మంగళవారం బిల్లులకు ఆమోదం తెలిపే సమయంలో ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎడతెగకుండా సభా కార్యకలాపాలకు అంతరాయం కల్పిస్తు ండటాన్ని తప్పుబట్టారు. సభా గౌరవానికి అనుగుణంగా సభ్యులు ప్రవర్తించే వరకు తాను సభకు హాజరుకాబోనని హెచ్చరించారు. ఈ హెచ్చరిక అనుగుణంగానే ఆయన బుధవారం సభాధ్యక్ష స్థానంలో కనిపించలేదు. మణిపూర్‌ సమస్యపై ప్రధాని మోడీ స్వయంగా పార్లమెంటులో ప్రకటన చేయాలని ప్రతిపక్ష సభ్యులు అవిశ్రాంతంగా పట్టుబట్టారు. దీంతో లోక్‌ సభ గురువారానికి వాయిదా పడింది. లోక్‌సభ కార్యకలాపాలను బుధవారం వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి, బీజేపీ ఎంపీ కిరీట్‌ సోలంకి నిర్వహించారు. సభ్యులు శాంతియుతంగా వ్యవహరించాలని కిరీట్‌ కోరినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆయన సభను వాయిదా వేశారు. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంత ప్రభుత్వ సవరణ బిల్లును బుధవారం లోక్‌ సభ పరిశీలించి, ఆమోదించాల్సి ఉంది. కానీ సభ వాయిదా పడటంతో అది సాధ్యం కాలేదు.

Spread the love