ఈ-కుబేర్‌లో పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించాలి

– లేదంటే..వచ్చేనెలరర ఒకటి నుంచి అల్పాహారం బంద్‌ : తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్‌ (సీఐటీయూ)
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఈ-కుబేర్‌లో పెండింగ్‌లో ఉన్న అల్పాహారం, ఇతర బిల్లులను వెంటనే చెల్లించాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌వీ రమ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం హైదరాబాద్‌లోని సీఐటీయూ కార్యాలయంలో ఆ సంఘం రాష్ట్ర స్థాయి సమావేశాన్ని రాష్ట్ర అధ్యక్షులు వై. స్వప్న అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రమ మాట్లాడుతూ రాష్ట్రంలోని మధ్యాహ్న భోజన కార్మికులకిచ్చే గౌరవ వేతనం, అల్పాహారం బిల్లులు 2023 నవంబర్‌ నుంచి పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. నెలల తరబడి బిల్లులు రాకపోవటంతో కార్మికులు అప్పులు చేసి విద్యార్థులకు వంట చేసి పెడుతున్నారన్నారని చెప్పారు. తెచ్చిన అప్పులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించేందుకు తిరిగి అప్పులు చేయాల్సిన దుస్థితిని కార్మికులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీంతో వారు ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతున్నారని చెప్పారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని పెండింగ్‌ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఆందోళన కరంగా ఉందనే పేరుతో కార్మికులు చేసిన కష్టానికి రావాల్సిన వేతనం ఇవ్వక పోతే.. ఆ కుటుంబాలు ఎలా జీవనం సాగిస్తాయని ప్రశ్నించారు. మూడు నెల్లుగా వారికి రావాల్సిన వేతనం ఇవ్వటానికి డబ్బులు లేవా? అని నిలదీశారు. అత్యంత ప్రతిష్టాకమైన ఈ పథకం నిర్వహణలో కార్మికుల పాత్ర ముఖ్యమైందిగా సర్కారు గుర్తించాలన్నారు. ఆ కార్మికులనే నిర్లక్ష్యం చేస్తే ఆ పథకం ముందుకు సాగేదెలా? అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు వారికి నెలకు రూ.10వేలు వేతనం ఇస్తామన్న వాగ్దానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ నెల 31 లోపు పెండింగ్‌ బిల్లులన్నీ చెల్లించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే వచ్చే నెల ఒకటి నుంచి అల్పాహారం బంద్‌ పెట్టక తప్పదని హెచ్చరించారు. సమావేశంలో యూనియన్‌ ఆఫీస్‌ బేరర్లు జి. పద్మ, సుల్తాన్‌, వి కృష్ణమాచారి, మాయ, రాష్ట్ర కమిటీ సభ్యులు శారద, గీత, చామంతి లక్ష్మి, విజయేందర్‌, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Spread the love