అధికారం కోసం జెండాలన్నీ ఒక్కటైనా కేసీఆర్‌తోనేే ప్రజలు

– మార్కెట్‌ చైర్మెన్‌ యాకూబ్‌ రెడ్డి
నవతెలంగాణ-మోత్కూరు
రాష్ట్రంలో ప్రతిపక్షాలు చేస్తున్న హడావుడి అంతా అధికారం కోసమేనని, అధికారం కోసం జెండాలన్నీ ఒక్కటైనా ప్రజలు మాత్రం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ పార్టీవైపే ఉన్నారని మోత్కూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ కొణతం యాకూబ్‌ రెడ్డి అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ తొమ్మిదేండ్ల పాలనలో ఎన్నో సంక్షేమ, అభివద్ధి కార్యక్రమాలు చేపట్టారని, ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని, అభివద్ధిని ప్రజల్లోకి మరింత తీసుకెళ్లడానికి దశాబ్ది ఉత్సవాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని, 20 రోజులుగా నిర్వహించిన ఉత్సవాల్లో ప్రజలు ఎంతో సంతోషంగా పాల్గొని విజయవంతం చేశారన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, ఏనాడూ ప్రజల గురించి ఆలోచించని పార్టీలు ఎన్నికలు రాగానే తామేదో చేస్తామంటూ హడావుడి చేస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ అభివద్ధి మోడల్‌ దేశమంతా అమలు చేయడానికి సీఎం కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ ను తెలంగాణకే కాకుండా దేశానికి భరోసా ఇచ్చే పార్టీగా రూపాంతరం చెందుతుందని తెలిపారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న నాయకులు పాలకులుగా కాకుండా సేవకులుగా పని చేస్తున్నారని, సేవకుల్లాగానే పని చేస్తున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్రజల నుంచి ఎంతో ఆదరణ ఉందని, మూడోసారి కూడా ప్రజలు బీఆర్‌ఎస్‌ నే ఆశీర్వదిస్తారన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను 20 రోజులుగా నిర్వహించి విజయవంతం చేసిన ప్రజలకు, అధికార యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు కతజ్ఞతలు తెలిపారు.ఆయన వెంట బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పొన్నెబోయిన రమేష్‌, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కొండా సోంమల్లు, మాజీ ఎంపీటీసీలు జంగ శ్రీను, పానుగుల విష్ణుమూర్తి, కూరెళ్ల దాస్‌ ఉన్నారు.

Spread the love