Friday, May 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎన్యూమరేటర్లకు ప్రజలు సహకరించాలి

ఎన్యూమరేటర్లకు ప్రజలు సహకరించాలి

- Advertisement -

– గేటెడ్ కమ్యూనిటీల్లో అనుమతించకపోవడం చట్టరీత్యా నేరం
– సందేహాల నివృత్తికి హెల్ప్‌లైన్ నంబర్లు
– జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్ విజ్ఞప్తి
నవతెలంగాణ- అమీన్‌పూర్ :
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న జనాభా లెక్కల సేకరణ (సెన్సెస్ ఆపరేషన్) ప్రక్రియకు ప్రజలందరూ పూర్తిస్థాయిలో సహకరించి, సరైన సమాచారాన్ని అందించాలని అమీన్‌పూర్ జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్, సెన్సెస్ ఛార్జ్ ఆఫీసర్ డి. ప్రదీప్ కుమార్ విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సెన్సెస్ పురోగతిపై వివరాలను వెల్లడించారు. అమీన్‌పూర్ సర్కిల్ పరిధిలోని అన్ని కాలనీలను కలుపుకొని ప్రభుత్వ నిబంధనల ప్రకారం 481 ఎన్యూమరేషన్ బ్లాక్‌లను ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ తెలిపారు.

ఈ ప్రక్రియ కోసం క్షేత్రస్థాయిలో 481 మంది ఎన్యూమరేటర్లు, వారి పనితీరును పర్యవేక్షించేందుకు 72 మంది సూపర్‌వైజర్లు నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. జనాభా లెక్కల సేకరణను వేగవంతం చేసేందుకు సిబ్బంది ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచే కాకుండా, సాయంత్రం 7 గంటల తర్వాత కూడా ఫీల్డ్‌లో తిరుగుతూ వివరాలు సేకరిస్తున్నారని వివరించారు. సిబ్బంది ఇంతగా శ్రమిస్తున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో ప్రజల నుండి ఆశించిన స్థాయిలో సహకారం లభించడం లేదని ప్రదీప్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని ప్రధాన గేటెడ్ కమ్యూనిటీలు, గ్రేటర్ కమ్యూనిటీల నిర్వాహకులు ఎన్యూమరేటర్లను లోపలికి రానివ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ విధుల్లో ఉన్న సిబ్బందిని అడ్డుకోవడం, సమాచారం ఇవ్వకపోవడం చట్టరీత్యా నేరమని ఆయన స్పష్టం చేశారు.

వివిధ కాలనీల అసోసియేషన్ సభ్యులు, కమ్యూనిటీ ప్రతినిధులు బాధ్యతగా వ్యవహరించి సిబ్బందికి సహకరించాలని కోరారు. ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా స్వయంగా వివరాలు నమోదు చేసుకున్న పౌరులు, తమ వద్దకు వచ్చే ఎన్యూమరేటర్లకు బాధ్యతగా ఆ ఐడీని చూపించాలని కోరారు. ఆన్‌లైన్ నమోదులో ఏవైనా పొరపాట్లు ఉంటే.. ఎన్యూమరేటర్లు వాటిని క్షేత్రస్థాయిలో సరిచేస్తారని తెలిపారు. జూన్ 9వ తేదీ వరకు మాత్రమే ఈ ప్రక్రియ అందుబాటులో ఉంటుందని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

జనాభా లెక్కల సేకరణపై ప్రజలకు ఎలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకునేందుకు నేరుగా కింది అధికారులను ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు. డి. ప్రదీప్ కుమార్ (డిప్యూటీ కమిషనర్ & ఛార్జ్ సెన్సెస్ ఆఫీసర్‌ను 87124 19180, నరసింహులు (అడిషనల్ సెన్సెస్ ఛార్జ్ ఆఫీసర్)ను 90638 39102 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. వీరితో పాటు అడిషనల్ మున్సిపల్ కమిషనర్, అడిషనల్ ఛార్జ్ ఆఫీసర్లు, ఏఎంసీలు, నోడల్ ఆఫీసర్లను కూడా సంప్రదించి సమాచారం తెలుసుకోవచ్చని డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -