కాంగ్రెస్ నాలుగు నెలల పాలనపై ప్రజల్లో వ్యతిరేకత మొదలయింది..

– సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్లపై ఒట్లు వేసి ఓట్ల రాజకీయం..
– మార్నింగ్ వాకర్స్ తో వినోద్ కుమార్ మాట ముచ్చట..
– కాంగ్రెస్ అబద్ధపు హామీలను ప్రజల్లోకి తీసుకెళ్తాం..
– బండి సంజయ్ వేములవాడ రాజన్న గుడికి ఐదు కొత్తలు తేలేదు..
– కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్..
నవతెలంగాణ – వేములవాడ
అధికారంలోకి ఎలాగైనా రామునోటికి ఏది వస్తే  అది చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అమలు చేయలేక సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు దేవుళ్లపై ఒట్లు వేసి ఓట్ల రాజకీయం చేస్తున్నారని, ఆరు గ్యారెంటీల పేరుతో అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పై నాలుగు నెలల్లోనే వ్యతిరేకత వచ్చిందని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. బుధవారం వేములవాడ పట్టణంలో మార్నింగ్ వాకర్స్ తో వినోద్ కుమార్ మాట ముచ్చట లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ..  ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాల పునాదులపై ఏర్పాటైందని  ఆరు గ్యారెంటీలలో అర గ్యారెంటీ కూడా అమలు చేయలేదని డిసెంబర్ 9 న రైతు రుణమాఫీ చేస్తామని ఇప్పుడు ఆగస్టు 15  వరకు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. రైతు భరోసా రూ.15000 రూపాయలు, రైతు కూలీలకు రూ.12000, రూపాయలు, మహిళలకు రూ.2500, రూపాయలు, పెన్షన్ పెంపు రూ.4000, రూపాయలు ఉచిత సిలిండర్, హామీలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని పేర్కొన్నారు.బీజేపీ కేంద్ర ప్రభుత్వం  నదుల అనుసంధానం చేసి తమిళనాడు కు నీళ్లను తరలించే కుట్రలు  చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చి గోదావరి బేసిన్ లో తెలంగాణ నీళ్ల వాటా ఎంతనో తేల్చాలని  అన్నారు.నదుల అనుసంధానంపై రాష్ట్ర ప్రభుత్వం నోరుమెదపడం లేదన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోకి చేరి ఎండకు ఎండి వానకు తడిసిపోతున్నాయని ప్రభుత్వం ధాన్యం  కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తోందని అసలు ఇప్పుడు ఉన్న ధాన్యమే కొంటలేరు ఇక క్వింటాలుకు రూ.500 రూపాయల భోనస్ ఎప్పుడిస్తారని రైతులు అంటున్నారని తెలిపారు. కరీంనగర్ లో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై ఇప్పటి వరకు ఎంపీ అభ్యర్థిని ప్రకటించలేదన్నారు.
బండి సంజయ్  రాజన్న గుడికి ఐదుకొత్తలు తేలేదు
బండి సంజయ్ మతరాజకీయాలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని కానీ ఐదేళ్ల కాలంలో బండి సంజయ్ వేములవాడ రాజన్న గుడికి ఐదు కొత్తలు కూడా తీసుకురాలేదని మండిపడ్డారు. నేను 2014 నుంచి 2019 వరకు ఎంపీగా ఉన్న సమయంలో కొత్తపల్లి -మనోహరబాద్ వరకు రైల్వేలైన్ తెచ్చానని మరో ఏడాదిలో వేములవాడ కు రైలు వస్తుందన్నారు. కొండగట్టు ఆలయం రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో 332 ఎకరాల ఫారెస్ట్ భూములను కొండగట్టు ఆలయానికి అప్పగించడం జరిగిందన్నారు. కరీంనగర్ 25 కోట్లతో తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకొచ్చానని తెలిపారు. ఐదేళ్లలో అభివృద్ధి కోసం ఐదు  కొత్తలు తీసుకురాని బండి సంజయ్ ఇప్పుడు ప్రజలను ఎలా ఓట్లు  అడుగుతున్నారని ప్రశ్నించారు. ఐదేళ్లలో బండి సంజయ్ ఒక్క నవోదయ పాఠశాల కూడా తీసుకురాలేదని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలపై తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల కోసం ప్రశ్నించే గొంతునవుతాను ప్రజలు ఆశీర్వదించి పార్లమెంట్ కు పంపాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి చల్మేడ లక్ష్మీ నర్సింహారావు, జడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఏనుగు మనోహర్ రెడ్డి, టెక్స్ టైల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, మాజీ జడ్పీ చైర్మన్ తీగల రవిందర్ గౌడ్, మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, కౌన్సిలర్లు గోలి మహేష్, నిమ్మశెట్టి విజయ్, రామచందర్, శంకర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, గజనందరావు, ఈర్లపల్లి రాజు, శ్రీకాంత్ గౌడ్,  రాంబాబు, కందుల క్రాంతి కుమార్, భాస్కర్ రావు, ప్రసాదరావు తో పాటు తదితరులు పాల్గొన్నారు.
Spread the love