ఆర్నెల్లలో ప్రజలు కాంగ్రెస్‌పై తిరగబడతారు

– ప్రభుత్వంపై అనేక వర్గాల్లో అసంతృప్తి
– మనం గెలుపుబాట పట్టటం పెద్ద కష్టమేమీ కాదు
-మహబూబ్‌నగర్‌ పార్లమెంటు సన్నాహక సమావేశంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఇప్పటికే రాష్ట్రంలోని అనేక వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కేవలం ఆర్నెల్లలో ఆ పార్టీపై వారు తిరగబడటం ఖాయమని ఆయన హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ పార్లమెంటు సన్నాహక సమావేశాల్లో భాగంగా గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు, కార్యకర్తలనుద్దేశించి కేటీఆర్‌ ప్రసంగిస్తూ…కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ… మోడీ, అదానీ ఒక్కటే అంటూ విమర్శిస్తున్నారని గుర్తు చేశారు. కానీ రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం అదే అదానీ కంపెనీతో ఒప్పందాలు చేసుకుంటోందని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌ దావోస్‌ సాక్షిగా అదానీతో అలైబలై చేసుకుంటున్నారని విమర్శించారు. ఇది కాంగ్రెస్‌ అవకాశవాద, దిగజారుడు రాజకీయాలకు నిదర్శమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో లేనప్పుడు అదానీ దేశానికి శత్రువంటూ మాట్లాడిన కాంగ్రెస్‌ నేతలు… ఇప్పుడు అదే అదానీతో ఎందుకు కలిసి పని చేస్తున్నారో చెప్పాలంటూ ప్రశ్నించారు. బీజేపీ ఆదేశాల మేరకే రేవంత్‌ సర్కార్‌ ఈ రకంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన 420 హామీలను ఎప్పటికప్పుడు గుర్తు చేయాలంటూ బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు కేటీఆర్‌ ఈ సందర్భంగా సూచించారు. రైతు రుణమాఫీ గురించి పదే పదే ప్రస్తావించిన సీఎం రేవంత్‌, ఇప్పుడెందుకు దాని గురించి మాట్లాడటం లేదని నిలదీశారు. రైతుల ఖాతాల్లోకి ఇప్పటికీ రైతు బంధు డబ్బులేయలేదని గుర్తు చేశారు. గతంలో చెప్పిన దానికి భిన్నంగా దశలవారీగా రైతు రుణమాఫీ చేస్తామంటూ మంత్రులు చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రియాంకా గాంధీ ప్రకటించిన రూ.4 వేల నిరుద్యోగ భృతి ఎటుపోయిందని ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధిస్తామంటూ ఢిల్లీ విమానమెక్కిన సీఎం రేవంత్‌, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పుడు దాని గురించే ప్రస్తావించటం లేదన్నారు. ఆ అంశంపై వారు చేతులెత్తేశారనీ, ఈ విషయాన్ని మహబూబ్‌నగర్‌ ప్రజలు గుర్తించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటామనీ, అయితే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ ప్రతీ చోటా బలమైన నాయకత్వం బీఆర్‌ఎస్‌ సొంతమని అన్నారు. అందువల్ల గులాబీ జెండా తిరిగి గెలుపుబాట పట్టటం పెద్ద కష్టమేమీ కాదని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో మరింత సమిష్టిగా, కష్టపడి పని చేయటం ద్వారా అత్యధిక ఎంపీ స్థానాలను గెలుచుకోవాలని కేటీఆర్‌ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Spread the love