ఏకో టూరిజానికి ప్రణాళికలు

ఏకో టూరిజానికి ప్రణాళికలు– పర్యావరణానికి హాని కలగకుండా అభివృద్థి : అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ వ్యాప్తంగా ఎకో టూరిజం (ప్రకృతి పర్యాటకం) అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నదని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఎకో టూరిజంపై సంబంధిత అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణానికి, వన్య ప్రాణులకు హాని కలగకుండా, వాటి సహజ ఆవాసాలను పరిరక్షిస్తూ, స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తూ ఎకో టూరిజం పాలసీని తీసుకు రానున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని 12 సర్క్యూట్లలో 40 స్పాట్లను గుర్తించినట్టు తెలిపారు. అడ్వెంచర్‌, రీక్రియేషన్‌, ఆధ్యాత్మిక, వారసత్వ, సినీ, వెడ్డింగ్‌, నేచర్‌ అండ్‌ వైల్డ్‌ లైఫ్‌, హెరిటేజ్‌ అండ్‌ కల్చర్‌ తదితర అంశాల ఆధారంగా మరిన్ని ప్రాంతాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అటవీ, దేవాదాయ, రెవెన్యూ, పర్యాటక శాఖలు సమన్వయం చేసుకుని ఆ పాలసీని రూపొందించాలని సూచించారు. ఒడిశా, కర్నాటక రాష్ట్రాల్లో అమలవుతున్న ఎకో టూరిజం విధానాలను అధికా రులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. ఆ రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో అధికారులు గమనించిన పరిస్థితులను ఇక్కడి పరిస్థితులతో బేరీజు వేసుకుని అత్యుత్తమ పాలసీల రూపకల్పనకు కృషి చేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. టూరిజం స్పాట్లను అభివృద్ధి చేసేందుకు పీపీపీ పద్ధతిలో నిధులను సమీకరించాలని సూచించారు రాష్ట్రంలో ప్రధాన నది అయిన గోదావరి పరీవాహక ప్రాంతంతో పాటు జలపాతాలు, నీటివనరులన్న చోట ఎకో టూరిజం స్పాట్లకు ప్రాధాన్యతని వ్వాలన్నారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా స్పాట్లకు సంబంధించిన సమాచారాన్ని వెబ్‌ సైట్లలో పొందుపర్చాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం లో అటవీశాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్‌, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, పీపీసీఎఫ్‌ ఆర్‌ఎమ్‌ డోబ్రియాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love