కులం ఆధారంగా రాజకీయాలు చేయలేను

గోదావరి జిల్లాల నుంచే రాష్ట్ర రాజకీయాల్లో మార్పు మొదలు కావాలి : పవన్‌ కల్యాణ్‌
రాజోలు : వైసిపి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసి రౌడీలు, గుండాలను వెనకేసుకొస్తోందని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా మలికిపురంలో ఆదివారం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. తాను వారాహీ యాత్ర ద్వారా ప్రజల ముందు నిజాలను చెప్పే ప్రయత్నం చేస్తుంటే తనపై దాడికి ప్రయత్నాలు జరిగాయని అన్నారు. నేరగాళ్ల బెదిరింపులకు మంచివాళ్లు కూడా లొంగిపోతారని వ్యాఖ్యానించారు.
వైసిపిలో చేసినట్లు తాను కులం ఆధారంగా రాజకీయాలు చేయలేమని స్పష్టం చేశారు. వైసిపి పాలన నుంచి ఉమ్మడి గోదావరి జిల్లాలను విముక్తి చేయాలని కోరారు. ఉమ్మడి గోదావరి జిల్లాలోని 34 నియోజకవర్గాలపై జనసేన దృష్టి సారించిందని వెల్లడించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పి.గన్నవరంలో జనసేన జెండా ఎగురవేయాలని కోరారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా సామాన్యులకు అండగా ఉండాలనే లక్ష్యంతో కామన్‌ మ్యాన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ స్థాపించానని పేర్కొన్నారు. 2014లో జనసేన పార్టీని స్థాపించినప్పుడు తాను చెప్పిన మాటలను పవన్‌ ప్రస్తావించారు. 2019లో జనసేన పార్టీని రాజోలు నియోజకవర్గంలో గెలిపించి మార్పు కోసం చిరుదీపం వెలిగించారన్నారు. అది భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా అఖండ జ్యోతిగా మారి ప్రజలందరికీ వెలుగునిస్తుందని పేర్కొన్నారు.
జనసేన నుంచి గెలిచి వైసిపిలో చేరిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు పేరు ప్రస్తావించకుండానే పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని వదిలి వెళ్లిపోయారని విమర్శించారు. ఆయన వెళ్లిపోయినా పార్టీని వీడకుండా ప్రజలంతా అండగా ఉన్నారన్నారు. గోదావరి జిల్లాల నుంచే వైసిపిపై యుద్ధం మొదలవ్వాలని పవన్‌ కల్యాణ్‌ ఆకాంక్షించారు. పాలించే నాయకుడు నిజాయితీపరుడైతే ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. జనసేన పార్టీలో గ్రూపులు ఉండడం తప్పులేదని.. అందరూ జనసేన అభివద్ధికి కషి చేయాలే తప్ప గ్రూపులపోరు పార్టీకి ఓటమి చేకూర్చకూడదని పవన్‌ అన్నారు. అంతకు ముందు మలికిపురం మండలంలోని దిండి రిసార్ట్స్‌లో నియోజకవర్గ నేతలు, ముఖ్య కార్యకర్తలతో పవన్‌ కల్యాణ్‌ సమావేశమయ్యారు. నేరగాళ్లు రాజకీయాలు చేస్తే రాష్ట్రం నాశనం అవుతుందని తెలిపారు. ప్రజల హక్కులకు భంగం కలిగితే పోరాడతా.. ఎదురు తిరుగుతా అని హెచ్చరించారు.

Spread the love