ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రేస్,బీజేపీ లకు ఎన్నికల్లో సురుకు పెడదాం: ప్రశాంత్ రెడ్డి

– రైతు బిడ్డను ఆశీర్వదించండి మీ తరపున పోరాటం చేస్తా: ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్
నవతెలంగాణ – ఏర్గట్ల
ఏర్గట్ల మండలకేంద్రంలోని స్థూపం వద్ద ఎంపీ ఎన్నికల ప్రచారాన్ని,బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్,బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కలిసి నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ..అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కాలేవని, ప్రజలు వారికి ఓట్లు వేసి మోసపోయారని అన్నారు.నేను రైతు బిడ్డను అని రైతు కష్టాలు తెలిసిన వాడినని అన్నారు.రైతులకు రైతు బంధు రాలేదని,పెళ్ళి చేసుకున్న ఆడపిల్లలకు తులం బంగారం రాలేదని,కొత్త పెన్షన్లు ప్రభుత్వం ఇవ్వలేదని ప్రజలను కాంగ్రేస్ పార్టీ  మోసం చేసిందని అన్నారు. కాంగ్రేస్ పార్టీ,బీజేపీ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయలేవని నన్ను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి హామీలు అమలయ్యే వరకు ప్రజల తరపున పోరాటం చేస్తానని అన్నారు.అలాగే బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ…ఎంపీగా అరవింద్ గెలిచి ఐదు సంవత్సరాలు అయిన పసుపు బోర్డు తేలేదని,ఏర్గట్ల వైపు కన్నెత్తి చూడలేదని,ఒక కోటి రూపాయల పని కూడా ఏర్గట్లకు చేయలేదని అన్నారు.కాంగ్రేస్ అభ్యర్థి జీవన్ రెడ్డి జగిత్యాల్ నుండి వచ్చి మీ సమస్యలు వినలేడని, బాజిరెడ్డిని గెలిపిస్తే ఇద్దరం కలిసి ప్రజల తరపున కొట్లాడుతాం అని అన్నారు.
డిసెంబర్ 9 వ తేదీన గెలవగానే ఆరు గ్యారంటీల మీద సంతకం పెడతామని,100 రోజుల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఇచ్చారని,అది చేయకపోగా… మళ్ళీ ఆగస్టు 15 లోగా రైతురుణమాఫీ అమలు చేస్తా అని  దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మరి అబద్దాలు ఆడుతున్నాడని,ఆగస్టు 15 వరకు ఎంపీ,సర్పంచ్,ఎంపిటీసీ,జడ్పీటీసీ ఎన్నికలు అయిపోతాయని,మళ్ళీ ఐదు సంవత్సరాల దాకా ఆయన ప్రజల మొఖం చూడడని,ప్రజలు మరొక సారి మోసపోయే ప్రమాదం ఉందని అన్నారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలైన,రైతు రుణమాఫీ కాలే,రైతు బంధు సక్కగా పడలే, కొత్త పింఛన్లు రాలే,పెండ్లి ఆయిన ఆడపిల్లలకు తులం బంగారం రాలే,చదవుకునే ఆడ పిల్లలకు స్కూటీలు రాలే అని ఎద్దేవా చేశారు.ఇచ్చిన హామీలు అమలు చేయని బీజేపీ కాంగ్రేస్ పార్టీలకు ప్రజలు ఈ ఎన్నికల్లో సురుకు పెట్టాలని అన్నారు.అలాగే మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను గ్రామాల్లోకి తెచ్చిన పనులను కాంగ్రేస్ పార్టీ వారు రద్దు చేయాలని చూస్తున్నారటని,ప్రజల కోసం ఇచ్చిన ఆర్డర్ కాపీలను నకిలీవి అంటున్నారటని,మరి ఆ ఆర్డర్ కాపీలను పట్టుకుని కలెక్టర్ దగ్గరకు పోదాం,నాతో పాటు నలుగురు కాంగ్రేస్ పార్టీ కార్యకర్తలు రండి.అవి నకీలివైతే నేను నా ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేస్తానని సవాల్ విసురుతున్నానన్నారు.ఈ నెల 13 జరిగే ఎంపీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటువేసి బాజిరెడ్డి గోవర్ధన్ ను గెలిపించాలని ప్రశాంత్ రెడ్డి కోరారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు పూర్ణానందం,ఎంపీపీ ఉపేంధర్ రెడ్డి,ఎంపిటీసీ జక్కని మధు సూధన్,ఏర్గట్ల పిఏసీఎస్ చైర్మన్ బర్మ చిన్న నర్సయ్య,మండల ప్రధాన కార్యదర్శి బద్దం శ్రీనివాస్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
Spread the love