– అశ్వారావుపేట మండలానికి 13 కొత్త కేంద్రాలు
– మొత్తం 16 పాఠశాలల్లో అందుబాటులో ప్రీ-ప్రైమరీ విద్య
నవతెలంగాణ – అశ్వారావుపేట : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచడంతో పాటు చిన్నారులకు నాణ్యమైన ప్రారంభ విద్య అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రీ – ప్రైమరీ కేంద్రాల ఏర్పాటు కార్యక్రమం ఆశాజనకంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గుచూపుతున్న తల్లిదండ్రులను ప్రభుత్వ విద్యా వ్యవస్థ వైపు ఆకర్షించడంలో ఈ నిర్ణయం కీలకంగా మారనుంది. చిన్నారులు ఎల్‌కేజీ, యూకేజీ దశ నుంచే ప్రభుత్వ పాఠశాలలతో అనుబంధం ఏర్పరచుకోవడం వల్ల భవిష్యత్తులో అదే పాఠశాలలో ప్రాథమిక విద్య కొనసాగించే అవకాశాలు పెరుగుతాయి.దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెరగడమే కాకుండా, గ్రామీణ ప్రాంతాల పేద కుటుంబాలకు నాణ్యమైన విద్య అందుబాటులోకి రానుంది.
అశ్వారావుపేట మండలంలో ఇప్పటికే మూడు పాఠశాలల్లో కొనసాగుతున్న ప్రీ-ప్రైమరీ విద్యకు అదనంగా మరో 13 పాఠశాలలు ఎంపిక కావడం విశేషం. ప్రతి పాఠశాలకు మౌలిక వసతుల మెరుగుదల కోసం రూ.1 లక్ష చొప్పున నిధులు కేటాయించడం, ప్రత్యేకంగా ఇన్‌స్ట్రక్టర్ మరియు ఆయా నియామకాలు చేపట్టడం ద్వారా చిన్నారులకు అనుకూలమైన విద్యా వాతావరణం కల్పించే అవకాశం ఉంది. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలంటే కేవలం భవనాలు, సౌకర్యాలు మాత్రమే కాకుండా చిన్నారులను ఆకర్షించే విద్యా విధానాలు కూడా అవసరం. ఆ దిశగా ప్రీ – ప్రైమరీ కేంద్రాల ఏర్పాటు ఒక కీలక ముందడుగుగా విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.



