– ఎప్పుడైనా జరగొచ్చు
– తిరిగి రాష్ట్ర ప్రతిపత్తి ఇవ్వటానికి సమయం పడుతుంది
– సుప్రీంకోర్టుకు కేంద్రం నివేదన
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఓటర్ల జాబితా తయారు చేసే ప్రక్రియ దాదాపు పూర్తయిందని, తేదీలను ప్రకటించాల్సింది ఎన్నికల కమిషనేనని తెలిపింది. జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుపై దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న ధర్మాసనం ఎదుట సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ ఆ రాష్ట్రానికి కేంద్ర పాలిత హోదా కేవలం తాత్కాలికం మాత్రమేనని, రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరించడానికి కొంత సమయం పడుతుందని విన్నవించారు. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో సంజరు కిషన్ కౌల్, సంజీవ్ ఖన్నా, బీఆర్ గవారు, సూర్యకాంత్ సభ్యులుగా ఉన్నారు. జమ్మూకాశ్మీర్‌లో మూడు దశలలో ఎన్నికలు నిర్వహిస్తామని, ముందుగా పంచాయతీలకు, తర్వాత మున్సిపాలిటీలకు, చివరిగా శాసనసభకు ఎన్నికలు జరుపతామని తుషార్ మెహతా తెలిపారు. ఏ ఎన్నికలు ఎప్పుడు జరిపేదీ నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలేనని చెప్పారు. జమ్మూకాశ్మీర్‌కు కేంద్ర పాలిత హోదా తాత్కాలికమేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో చెప్పారని కోర్టు దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో నెలకొన్న అసాధారణ పరిస్థితులను చక్కదిద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని అన్నారు. జమ్మూకాశ్మీర్‌కు ఎప్పుడు రాష్ట్ర హోదా కల్పించేదీ కచ్చితంగా చెప్పడం ఇప్పుడు సాధ్యంకాదని, దీనికి కొంత సమయం పడుతుందని అన్నారు. రాష్ట్ర హోదా కోసం పలు చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. రాష్ట్రంలో ఉగ్రవాద సంబంధమైన సంఘటనలు, చొరబాట్లు, హింస తగ్గుముఖం పట్టాయని గణాంకాలతో సహా వివరించారు. లఢక్‌కు సంబంధించి కొండ ప్రాంత అభివృద్ధి మండలి ఎన్నికలు పూర్తయ్యాయని, కార్గిల్‌లో వచ్చే నెలలో జరుగుతాయని మెహతా చెప్పారు.