– ఎన్డీయే మిత్రపక్షాల నుంచీ అదే మాట
– ఓబీసీలపై ‘రోహిణి ప్యానెల్’ సిఫారసుల అమలుకు అవకాశం
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కుల గణన నిర్వహించాలని ప్రతిపక్ష పార్టీల నుంచి కేంద్రంపై ఒత్తిడి పెరుగుతున్నది. ఇప్పటికే బీహార్ రాష్ట్రం కులగణను నిర్వహించి మోడీ సర్కారుపై పరోక్షంగా ఒత్తిడిని పెంచింది. అయితే, దేశంలోని ఓబీసీలను ఏకీకృతం చేయడానికి కేంద్రం రోహిణి ప్యానెల్ సిఫారసులను అమలు చేసే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. కుల గణనపై మోడీ ప్రభుత్వం సందిగ్ధతతో ఉండటంతో ఎన్డీయే మిత్రపక్షాలు సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్‌బీఎస్‌పీ), అప్నా దళ్ (ఎస్), రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలు రోహిణి ప్యానెల్ నివేదికను వీలైనంత త్వరగా అమలు చేయాలని ఒత్తిడి చేస్తున్నాయి.
వర్గాల మధ్య రిజర్వేషన్లు, ఇతర ప్రయోజనాలను సమానమైన పునర్విభజనను నిర్ధారించడానికి ఓబీసీల ఉప-వర్గీకరణను జస్టిస్ జి రోహిణి నేతృత్వంలోని ప్యానెల్‌కు అప్పగించారు. ప్యానెల్ 2,600ఓబీసీ కమ్యూనిటీలను మూడు బ్యాండ్‌లుగా వర్గీకరించింది. ఎక్కువ కాలం రిజర్వేషన్ ప్రయోజనాలను పొందని సమూహాలకు 8 నుంచి 10 శాతం రిజర్వేషన్‌ను నిర్ణయించింది. 983 కులాలు ఎలాంటి ప్రయోజనాలనూ పొందలేదని ప్యానెల్ కనుగొన్నది.
రాష్ట్ర జనాభాలో మూడింట రెండు వంతుల మంది వెనుకబడిన వర్గాలకు చెందినవారని బీహార్ కులాల సర్వే వెల్లడించినప్పటి నుంచి బీజేపీపై ఒత్తిడి పెరిగిందని విశ్లేషకులు అంటున్నారు. ఎస్‌బీఎస్‌పీ చీఫ్ ఓం ప్రకాష్ రాజ్‌భర్ మాట్లాడుతూ.. రోహిణి ప్యానెల్ నివేదికను ఎన్నికల ముందు అమలు చేయవచ్చని అన్నారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు, కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే మాట్లాడుతూ.. కేంద్రం దేశవ్యాప్తంగా కుల గణన చేయాలనీ, రాష్ట్రాలు కుల సర్వేలు నిర్వహించడాన్ని తాను అంగీకరించనని అన్నారు. కుల ప్రాతిపదికన జనాభా గణనను తమ పార్టీ ఇప్పటికే డిమాండ్ చేసిందని అప్నాదళ్ (ఎస్) నేత, కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు.
ఓబీసీలను ఉప వర్గీకరించి 12 వారాల్లోగా నివేదిక సమర్పించేందుకు కేంద్రం 2017లో కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జి రోహిణి నేతృత్వంలోని కమిషన్ తన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఈ ఏడాది జులై 31న సమర్పించింది.