పులివెందుల టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ రవి అరెస్ట్..

నవతెలంగాణ- అమరావతి: కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి (మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి)ని పోలీసులు అరెస్టు చేశారు. బీటెక్‌ రవి వ్యక్తిగత పనుల నిమిత్తం మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు పులివెందుల నుంచి బయలుదేరి కడప బయల్దేరారు. ఈ క్రమంలో నంది మండలం వరకు ఫోన్‌లో అందుబాటులో ఉన్నారు.. ఆ తర్వాత ఆయనతోపాటు.. డ్రైవరు, గన్‌మెన్‌, ఇతర సహాయకుల ఫోన్లు సైతం పని చేయలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు పార్టీ కీలక నేతల దృష్టికి తీసుకెళ్లారు.  ఇంతలోనే యోగి వేమన విశ్వవిద్యాలయం ఎదుట మఫ్టీలో ఉన్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. దాదాపు గంట తర్వాత పోలీసుల అదుపులో ఉన్న గన్‌మెన్‌, డ్రైవర్‌, వ్యక్తిగత సహాయకులను వదిలిపెట్టి అందరి ఫోన్లను తిరిగిచ్చారు. దీంతో అదుపులోకి తీసుకున్నది పోలీసులేనని కుటుంబసభ్యులకు తెలిసింది. ఆ తర్వాత రవిని వల్లూరు పోలీసుస్టేషన్‌కు తరలించి అక్కడ నుంచి కడప ప్రభుత్వ సర్వజనాసుపత్రికి రాత్రి పది గంటలకు తరలించారు. వైద్యపరీక్షల అనంతరం కడప ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేటు ఎదుట హాజరుపరిచారు. మళ్లీ బుధవారం ఉదయం హాజరు పరచాలని ఆదేశించారు.  పది నెలల కిందట కడప ఎయిర్‌పోర్ట్ దగ్గర ఆందోళన చేసినందుకు బీటెక్‌ రవిని అరెస్టు చేసినట్లు కడప డీఎస్పీ తెలిపారు. ఎయిర్‌పోర్ట్ దగ్గర జరిగిన తోపులాటలో తమ ఏఎస్‌ఐకి గాయాలయ్యాయని.. దానిపై విచారణ చేపట్టి కేసు నమోదు చేసినట్లు వివరించారు. పది నెలలుగా బీటెక్‌ రవి అందుబాటులో లేకపోవడంతో ఇప్పుడు అరెస్టు చేశామన్నారు. రవిపై మరిన్ని కేసులు పెట్టే అవకాశముందని ఆయన కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. బీటెక్ రవి అరెస్ట్‌పై నారా లోకేష్ మండిపడ్డారు.

Spread the love