ప్రభుత్వ బడుల్లోనే మెరుగైన విద్య: పుష్పలతకిషన్ రెడ్డి

నవతెలంగాణ – దుబ్బాక రూరల్
సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చేకే తెలంగాణలో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారాయని , ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన, మెరుగైన విద్య అందుతుందని ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం దుబ్బాక మండల వనరుల కేంద్రంలో విద్యార్థులకు పంపిణీ చేసే ఉచిత పాఠ్యపుస్తకాలను ప్రభుత్వ పాఠశాలల సిబ్బందికి ఆమె అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దుబ్బాక మండలానికి 24 వేల పాఠ్య పుస్తకాలకు గాను 19 వేల పాఠ్యపుస్తకాలు వచ్చాయని అతి త్వరలోనే మిగిలిన 5వేల పాఠ్య పుస్తకాలు కూడా రాబోతున్నట్టు తెలిపారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు మన ఊరు-మనబడి పేరుతో ఎన్నో రకాల అధునాతన సౌకర్యాలను ఏర్పరచుకొని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో వేలకొలది రూపాయలు ఖర్చు చేసే బదులు ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాలతో మెరుగైన మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు చక్కని విద్యను అందించేందుకు ప్రభుత్వము చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, ప్రైవేటు పాఠశాలల బోధనకు దీటుగా మారిందని, ఈ సందర్భంగా ఉపాధ్యాయుల కృషిని అభినందించారు. జిల్లా మంత్రి హరీష్ రావు ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్రంలో ఈసారి పదవ తరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లా రెండవ స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ చింతల జ్యోతి, పిఎసిఎస్ చైర్మన్ షేర్ల కైలాష్, మండల విద్యాధికారి ప్రభుదాస్, ప్రధానోపాధ్యాయులు గాజుల రామచంద్రం, సత్యనారాయణరెడ్డి, ఇతర ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love