కృష్ణ జన్మభూమి వద్ద నిర్మాణాల తొలగింపునకు బ్రేక్‌

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఉన్న శ్రీకృష్ణ జన్మభూమి సమీపంలో నాయి బస్తీలో రైల్వేశాఖ తొలగిస్తున్న అక్రమ నిర్మాణాల ప్రక్రియను నిలిపేయాలని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. పది రోజులపాటు కూల్చివేత ప్రక్రియను నిలుపుదల చేయాలని కోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. 66 ఏళ్ల యాకుబ్‌ షా వేసిన పిటిషన్‌ ఆధారంగా కోర్టు ఈ తీర్పునిచ్చింది. నాయి బస్తీ ప్రాంతంలో తమ కుటుంబాలు 1,880 నుంచి నివసిస్తున్నట్లు పిటిషన్‌లో తెలిపారు. ఆగస్టు 9 నుంచి రైల్వేశాఖ తొలగింపు ప్రక్రియ చేపట్టింది. ఈ కేసులో వచ్చే వారం మళ్లీ వాదనలు కొనసాగనున్నాయి. షా తరపున సీనియర్‌ న్యాయవాది ప్రశాంతో చంద్ర సేన్‌ వాదిస్తున్నారు. కౌశిక్‌ చౌదరీ, రాధా తార్కర్‌, ఆరన్‌ షాలు న్యాయవాదులుగా ఉన్నారు.

Spread the love