తూతూ మంత్రంగా ప్రజాభిప్రాయ సేకరణ

– 99 శాతం ప్రజలు వ్యతిరేకిస్తున్నా అనుమతులు ఇస్తున్న మైనింగ్‌, పొల్యూషన్‌ శాఖలు.
– ఈ మాత్రం దానికి ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకని ఆయా గ్రామ ప్రజల ఆగ్రహం
– ప్రజాభిప్రాయ సేకరణలో మాటకు విలువ ఏది..?
– గత ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలకు సమాధానం చెప్పలేక పారిపోయిన అధికారులు
నవతెలంగాణ-కొత్తూరు
పేరుకేమో ప్రజాభిప్రాయ సేకరణ. 99 శాతం ప్రజలు వ్యతిరేకించిన వారి అభిప్రాయం పరిగణలోకి రాదు. ప్రజలు వ్యతిరేకించిన మైనింగ్‌ మాఫియాకు అడ్డగోలుగా అనుమతులు ఇస్తున్నారు. ఇంత మాత్రాన ప్రజాభిప్రాయ సేకరణ చేయడం ఎందుకు ప్రజల సమయాన్ని డబ్బును వధా చేయడం ఎందుకని గ్రామానికి చెందిన పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సర నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరూ వ్యతిరేకించిన అధికారులు మైనింగ్‌కు అనుమతులు ఇచ్చారు. 44 మంది రైతులు మైనింగ్‌ అనుమతులు ఇవ్వద్దని అంటే ఒక్కరు మాత్రమే అనుకూలంగా చెప్పారు. అయినా అధికారులు మాత్రం యదేచ్చగా మైనింగ్‌ మాఫియాకు భూములు కట్టబెట్టి ప్రజాభిప్రాయ సేకరణ అర్ధాన్నే మార్చేశారు.
మండల పరిధిలోని సిద్దాపూర్‌ గ్రామంలోని సర్వే నంబర్‌ 361లో 10.117 హెక్టార్ల భూమిని మైనింగ్‌ కేటాయింపు కోసం అధికారులు గురువారం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. ఇందుకోసం నోటీసులు జారీ చేశారు. గత ఏడాది క్రితం ఓ కంపెనీ కోసం సిద్ధాపూర్‌లో చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ అపహాస్యం పాలైంది. ప్రజాబిప్రాయ సేకరణలో 99 శాతం మంది వ్యతిరేకించారు. అయినా ఆ కంపెనీకి లీజును పునరుద్ధరించారు. కొండలను పిండి చేస్తూ ఆ కాంట్రాక్టర్‌ దర్జాగా మైనింగ్‌ చేపడుతున్నాడు. పరిసర ప్రాంత రైతులు, ఆయా గ్రామాల ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు వ్యతిరేకించిన సదరు కంపెనీకి లీజు పునరుద్ధరించడం వెనుక మర్మమేమిటో ఇప్పటికీ ఎవరికీ అర్థం కావడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మైనింగ్‌, పొల్యూషన్‌ అధికారులు ప్రజలకు, మీడియా ప్రతినిధులకు ఎవరికి అందుబాటులో ఉండరు. నేడు జరిగే ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజల అభిప్రాయాలకు ఏ మాత్రం విలువ ఉంటుందా అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.
మైనింగ్‌ పొల్యూషన్‌ అధికారుల ప్రభావం శూన్యం
కొత్తూరు పరిసర ప్రాంతాల్లో యదేచ్చగా గుట్టలు తొవ్వుతున్న మైనింగ్‌ అధికారులు కనీసం ఇటువైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఎస్బి పల్లి, సిద్దాపూర్‌, పులిచెర్లకుంట తండా, ఏనుగుమడుగు తాండ, కొడిచెర్ల, కొడిచెర్ల తండా పరిసర ప్రాంతాల్లో ఉన్న గుట్టలు ఖాళీ అవుతున్న మైనింగ్‌ అధికారులు పట్టి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అలాగే కొత్తూరులోని స్పాంజ్‌ అండ్‌ ఐరన్‌, ప్లాస్టిక్‌ కంపెనీలలో పొల్యూషన్‌తో గాలి కాలుష్యం ఏర్పడుతున్న పొల్యూషన్‌ అధికారులు పట్టించుకోకపోవడం సరి కదా కనీసం ఒక్క పరిశ్రమను సైతం తనిఖీ చేసిన దాఖలాలు కూడా లేవు. కొత్తూరులోని వాతావరణ కాలుష్యాన్ని ఎవరికి చెప్పుకోవాలో అర్థం గాక ప్రజలు సతమతమవుతున్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి జరిగే మండల సర్వసభ్య సమావేశానికి సైతం పొల్యూషన్‌ అధికారులు హాజరైన దాఖలాలు ఎక్కడ లేవు. ఇప్పటికైనా కండ్లు తెరిచి కొత్తూరు పారిశ్రామిక ప్రాంతం మండలంలోని మైనింగ్‌, పొల్యూషన్‌ ఆపాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.

Spread the love