మతాలు విభజిస్తాయే తప్ప, సంఘటిత పరచవు

మనువాదమనే విష వృక్షానికి వేళ్లు భూమిలో ఉంటాయి. ఆ వేళ్లు ఆరెస్సెస్‌ అయితే పైకి కనిపించే మొక్క బీజేపీ. ఈ మనువాద విష వృక్షానికి నీరుపోసి పెంచేది బ్రాహ్మణవాదం. ఇది ఎంతోకాలంగా కొనసాగుతున్న దురాగతం. చంపడం, చంపించడం, కుట్రలు పన్నడం బ్రాహ్మణ వాదపు సహజ లక్షణం. అసంఖ్యాకంగా ఉన్న ఉదంతాల్లోంచి మచ్చుకి కొన్ని చూద్దాం! మను వాదాన్ని నెత్తిన మోస్తున్న నేటి కేంద్ర ప్రభుత్వం దేశ పౌరుల్ని ఎలా సంఘటిత పరచగలదూ? గుజరాత్‌, మణిపూర్‌ మారణకాండలు వారి పరిపాలనకు అద్దం పడుతున్నాయి. మతాన్ని ఆసరాగా చేసుకుని పాలించడ మంటే నిర్దాక్షిణ్యంగా దేశ సమైక్యతకు విఘాతం కలిగించడమే. ఆనాడు మను వాదులు రాసుకున్న పురాణాల్లోని విషయాలకు, ఆధునిక చరిత్ర కారులు నమోదు చేసిన అంశాలకు దగ్గర పోలికలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఒకే విధంగా ఉన్నాయి.
1. పురాణాల ప్రకారం గురువు భార్యను అపహరించిన ఘనుడు ఇంద్రుడు-ఒక బ్రాహ్మణుడు
2. మరో కల్పిత గాథలో స్వంత తల్లిని చంపిన ధీరోదాత్తుడు పరుశురాముడు-ఒక బ్రాహ్మణుడు
3. మరొక కల్పిత గాథ ప్రకారం బలి చక్రవర్తిని మోసపూరితంగా చంపిన వామనుడు- ఒక బ్రాహ్మణుడు, ఇలా కల్పిత గాథలు రాసి, వారి ఆధిపత్యాన్ని చాటుకున్నది మనువాదులే! ఇతరులను భయభ్రాంతులను చేసింది కూడా వారే.
4. విలు విద్యలో ఏకలవ్వుని ప్రతిభను ఓర్వలేక అతని బొటనవేలును గురుదక్షిణగా అడిగిన వాడు- బ్రాహ్మణుడు ఇలా కావ్యాలలోని సంఘటనలే కాదు, చారిత్రక ఘటనలు చూసినా మనకు అదే విషయం కనిపిస్తుంది. చరిత్ర గ్రంథాలు మనువాదుల రచనలు కావు. దేశ విదేశీయులైన చరిత్ర కారులు రాసినవి. వారి పరిశీలనలు, పరిశోధనలు కూడా అదే విషయం చెపుతున్నాయి. ఉదాహరణకు మౌర్యకాలంలోకి తొంగి చూద్దాం!
5. మౌర్య చక్రవర్తి బృహద్రత్‌ను నమ్మించి, కుట్ర పూరితంగా చంపిన పుష్యమిత్ర శృంగుడు-ఒక బ్రాహ్మణుడు, మౌర్య సామ్రాజ్యాన్ని నాశనం చేసిన ఘనత ఆయనదే.
6. ఛత్రపతి శివాజీపై కత్తివేటు వేసిన భాస్కర కులకర్ణి- బ్రాహ్మణుడు
7. శివాజీ రాజ్యాన్ని కబళించిన బాలాజీ విశ్వనాథ్‌ పీష్వా-బ్రాహ్మణుడు
8. ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీని ఔరంగజేబుకు పట్టి ఇచ్చినవాడు రంగనాథస్వామి బ్రాహ్మణుడు వీటన్నిటికీ చారిత్రక ఆధారాలున్నాయి. ఇకపోతే
9. దౌలతాబాద్‌ (దేవగిరి) యాదవ సామ్రాజ్యంలో తిరుగుబాటు చేసి ఖిల్జీలతో చేతులు కలిపిన హేమాద్రి పండిత్‌-బ్రాహ్మణుడు చరిత్ర చెపుతున్న ఇలాంటి విషయాల్ని కాదని అందామా?
10.కొందరు సాధువులు, సంత్‌ల జీవిత చరిత్రలు చూసినా ఇలాంటి విషయాలు మరికొన్ని బయట పడుతున్నాయి. సంత్‌ జ్ఞానేశ్వర్‌ తల్లిదండ్రుల్ని కులం నుండి వెలివేసి, వారి ఆత్మహత్యకు కారకుడైన వాడు- బ్రాహ్మణుడు.
11.సంత్‌ తుకారాం రాసిన ‘గాథ’ను నీటిపాలు చేసి ఆయనను హత్యచేసి,-రథం ఎక్కి దైవ సన్నిధికి వెళ్లిపోయాడని దుష్ప్రచారం చేసింది-బ్రాహ్మణుడు.
12. సంత్‌ నామ్‌దేవ్‌ని హత్య చేసింది-బ్రాహ్మణుడు.
13. జ్యోతిరావు పూలేను చంపడానికి మనుషుల్ని పంపింది కేశవభట్‌-బ్రాహ్మణుడు.
14. ఇక జాతిపిత గాంధీజీని కాల్చి చంపినవాడు మరెవరో కాదు-గాడ్సే అని అందరికీ తెలిసిన విషయమే-అతడు ఒక బ్రాహ్మణుడు. చివరకు దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఏ మాత్రం పాలు పంచుకోని బ్రాహ్మణవాదం, జాతిపిత హత్యకు కూడా వెనుకాడలేదు, ఆ విషయం గుర్తుంచుకోవాలి!
ఈ విషయాలు అర్థం చేసుకోవడానికి మాత్రమే! సమకాలీనంలో ఉన్న బ్రాహ్మణుల్ని ద్వేషించమని చెప్పడానికి కాదు. ఎవరో వీరి పూర్వీకుల పూర్వీకులు తప్పు చేస్తే వీరిని ఎలా ద్వేషిస్తాం? మనుషులుగా అందరినీ గౌరవిస్తాం! ప్రేవిస్తాం! కులాల పట్టింపులే వద్దంటున్న వాళ్లం. కానీ, విషయం అర్థం చేసుకోవడానికి మాత్రమే కులాల ప్రసక్తి తేవాల్సివస్తోంది. మరో ముఖ్య విషయమేమంటే – ప్రస్తుతం బ్రాహ్మణిజాన్ని బ్రాహ్మ ణుల కన్నా బ్రాహ్మణేతరులే ఎక్కువగా మోస్తున్నారు. అస్తిత్వ పోరాటాల పేరుతో కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రేపడం-ఎవరు చేసినా అది చెడ్డ పనే, నిరసించదగ్గదే. ఆధునిక సమాజానికి అది అవసరం లేనిదే. మనుషులంతా ఒక్కటి-ఆ మహా మానవ మిశ్రమంలోంచి మనమంతా వచ్చామన్న సత్యాన్ని గ్రహించాలి. అందుకు అనుగుణంగానే మన ఆలోచనా విధానం ఉండాలి.
ఇదే విషయం మీద ఒక భక్తుడికీ దేవుడికీ మధ్య జరిగిన సంభాషణ ఎలా ఉంటుందో చూడండి- స్వర్గాధిపత్యాన్ని కైవసం చేసుకోవడానికి పూర్వం జంబూద్వీపంలో ఒక పర్వతం మీద ఒక భక్తుడు ఘోరతపస్సు చేశాడట. – ఫలితంగా బ్రహ్మ ప్రత్యక్షం కావాలి కాబట్టి – అయ్యాడు.
”వత్సా! నేను నీ తపస్సును మెచ్చి వచ్చితిని. చెప్పు నీ మనోరధమేమిటో”-అని అన్నాడు బ్రహ్మ.
”భక్తుడు నమ్మలేక ”దేవా!ఇది కలా? నిజమా?” అని ఆశ్చర్యపోయి నోరు తెరిచాడు.
”ఏమిటీ దైవాన్నే శంకిస్తున్నావా? నీ తపోఫలాన్ని వృధా చేసుకోక చెప్పు నీ కోరిక”- అన్నాడు బ్రహ్మ.
”దేవాది దేవా? నీ కరుణ నాపై కురిసింది సంతోషం! నాకు స్వర్గం మీద సంపూర్ణ అధికారం కావాలి- అనుగ్రహించండి-” అన్నాడు భక్తుడు.
సరే-నీ కులం, గోత్రం, వర్ణం- అన్నీ చెప్పు నీమనోరధం తీరుస్తా” అని అన్నాడు బ్రహ్మ.
”క్షమించాలి స్వామీ- గోత్రం వగైరా ఏవీ తెలియదు. ఈ శూద్రుణ్ణి కనికరించి వరమియ్యి తండ్రీ”- అన్నాడు భక్తుడు. ఆ మాట వినడంతో బ్రహ్మ బుసలు కొట్టడం ప్రారంభించాడు.
”ఛీ! నీచుడా!! ఆ మాత్రం జ్ఞానం లేదా? శుద్రుడికి తపస్సు చేసే అర్హతే లేదు. నువ్వు తులసీదాసు-రామ చరిత మానస్‌ చదవలేదా? అందులో రాసి ఉంది కదా? ఆ మాత్రం కూడా తెలుసుకోని అజ్ఞానివి ఇంత ఘోర తపస్సెలా చేశావ్‌? పైగా నేను నీ కోర్కె తీరుస్తానని ఎలా అనుకున్నావ్‌?
శూద్ర్‌ కరహీ జప్‌తప్‌ బ్రత్‌ నావా!!
బైఠీ బరాసన్‌ కహహీ పురానా!
సబ్‌ నర్‌ కల్నిత్‌ కరహీ అచారా!!
జాయీ ప బర్‌ నీ అనితీ అపారా!! (5) అని చెపుతూ బ్రహ్మ అంతర్థానమయ్యాడు. భక్తుడు నెత్తి గోక్కుని ఇంటిదారి పట్టాడు.
ఇది సరదాగా రాసిన సంభాషణ మాత్రం కాదు. నూటికి నూరు పాళ్లు వాస్తవాన్ని కండ్లకు కట్టించే దృశ్యం. జనాన్ని విభజించి కొందరిని శూద్రులుగా అవమానపరచి, మరికొందరిని అస్పృశ్యులుగా వెలివేసిన మనువాదం రూపొందించిన నిబంధనలు-ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి! ఇవి రూపొందించిన వారిని మనుషులనే అందామా?
మనువాదం/బ్రాహ్మణిజం రూపొదించిన నియమావళి ఇలా ఉంది. ఉల్లంఘించిన శూద్రులకు అస్పృశ్యులకు కఠినమైన శిక్షలు ఉండేవి. 1.అస్పృశ్యులు హిందువుల నివాసాలకు దూరంగా ఊరి వెలుపల తమకు కేటాయించిన స్థలంలోనే నివసించాలి. 2.వారు ఊరికి దక్షిణం లోనే ఉండాలి. ఎందుకంటే అన్ని దిక్కులకెల్లా దక్షి ణం చాలా అశుభమైంది గనక! 3. అస్పృశ్యులు మిగిలిన వారికి దూ రంగా మసలుకోవాలి. తమ నీడ కూడా సవర్ణులపై (స్పృశ్యులపై) సోకకుండా జాగ్రత్తపడాలి. 4.అస్పృశ్యులు పాడి, భూమి వంటి సంపదలు సంపాదించుకోగూడదు. 5. అస్పృశ్యులు పెంకుటిళ్లు కట్టుకోవడం నేరం. 6.అస్పృశ్యులు కాళ్ళకు చెప్పులు వేసుకోగూడ దు. శుభ్రమైన బట్టలు ధరించ గూడదు. గడియారం, బంగారు ఆభరణాలు వంటివి ధరించగూడదు. 7. అస్పృశ్యులు తమ సంతా నానికి గొప్పగా వినిపించే పేర్లు పెట్టుకోగూడదు. వారి పేర్లు నీచత్వాన్ని, దీనత్వాన్ని సూచించే విధంగా ఉండాలి. 8. అగ్రవర్గాల సమక్షంలో అస్పృశ్యులు కుర్చీపై గానీ, ఇతర ఉన్నతాసనాలపై గానీ కూర్చో గూడదు. 9. అస్పృశ్యులు గుర్రపు స్వారీ చేయగూడదు. పల్లకీ ఎక్కగూడదు. బాజాభజంత్రీలతో వైభవంగా పెండ్లి చేసుకో గూడదు. 10.అస్పృశ్యులు ఎక్కడ బడితే అక్కడ ఉమ్మివేయగూ డదు. అందుకోసం వారు తమ మెడకు ముంత కట్టుకుని తిర గాలి. అందులో మాత్రమే ఉమ్ము వేసుకోవాలి. 11. వారి అడుగు లు కూడా ఊళ్లో పడగూడదు. నడుముకు వెనక వైపు చీపురు కట్టు కుని తిరగాలి. అంటే వారి అడుగుల్ని ఆ చీపురు ఊడుస్తూ ఉండాలి!
వెరసి, మనం అర్థం చేసుకోవాల్సిందేమంటే-అస్పృశ్యులకు మనిషికి ఉండే స్థాయి ఇవ్వ లేదు. ఆకారం మనిషిదే అయినా, వారు మనిషి స్థాయి కన్నా తక్కువవారు. ప్రపంచంలో జాతుల మధ్య, మతాల మధ్య విభేదాలున్నాయి. వాటి వల్ల ఎన్నో అనర్థాలు జరిగాయి. నిజమే! కానీ, ఇలాంటి నీచమైన విభజన, వివక్ష ఎక్కడా లేదు. దీన్నే మనువాదులు తమ ‘సనాతన ధర్మమని’ గొప్పగా చెప్పుకుని రొమ్ములు విరుచుకుంటారు. అవును-ఇంత గొప్ప నియమావళి ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేదు. మేరా భారత్‌ మహాన్‌! ఇలాంటి సనాతన ధర్మమే వర్ధిల్లాలని నేటి ఆరెస్సెస్‌-బీజేపీ ప్రభుత్వం కోరుకుంటోంది. ఈ సనాతన ధర్మంతోనే ‘విశ్వగురువు’ అయిపొయ్యానని కలలు కంటోంది!
ఇటీవల జరిగిన ఒక సంఘటన గూర్చి ఆలోచించండి. తనకు తాను ఒక దళిత నాయకుడినని అనుకునేవాడు తన జాతి ప్రజల ప్రయోజనాల కోసం, హక్కుల కోసం పోరాడాలి. అంతేగాని ఒక బీజేపీ అగ్ర నాయకుడి భుజాన పడి భోరున ఏడుస్తాడా? అసలే వాళ్లు సనాతన ధర్మాన్ని కమలం పువ్వులా వికసింపజేయాలని నానా తంటాలు పడుతూ ఉంటే – ఇతను వెళ్లి అతని దగ్గర ఏడిస్తే ఏం లాభం? తననూ, తన వర్గీయులను బలితీసుకొమ్మని – సనాతన ధర్మానికి దాసోహమనడమే కదా? ఆ ఇద్దరిలో ఒకడు శూద్రుడు, మరొకడు దళితుడు, సనాతన ధర్మం-వీరికి ఉన్నతమైన స్థానం ఎలా ఇస్తుందీ? ఇద్దరూ కలిసి, మనువాదం మీద పోరాడటం కదా చేయా ల్సిందీ? 22 జనవరి 2024న అయోధ్యలో పూర్తికాని రామాల యంలో రాముడి ప్రాణప్రతిష్ట చేయడమంటే దేశంలోని ప్రజల్ని బహిరంగంగా విభజించినట్టే !! సమైక్యత సాధించినట్టు కాదు.
– సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్ర వేత్త
(మెల్బోర్న్‌ నుంచి)
– డాక్టర్‌ దేవరాజు మహారాజు

Spread the love