పశ్చిమ, పశ్చిమేతరంగా చీలిన ప్రపంచం

అమెరికా దాని మిత్ర దేశాల ద్వంద్వ ప్రమాణాలు, కపటత్వం, ఆర్థిక ఆంక్షల బెదిరింపులకు చాలా దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. ప్రపంచం నేడు దాదాపుగా అమెరికా లేదా పాశ్చాత్య అనుకూల దేశాలు, మిగిలిన దేశాలుగా చీల్చబడింది. 2024 ఏప్రిల్‌ 18న పాలస్తీనాకు ఐక్యరాజ్యసమితి (ఐరాస) పూర్తి సభ్యత్వాన్ని మంజూరు చేస్తూ ఐరాస సర్వసభ్య సభ ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించింది. ఐరాస భద్రతామండలి సభ్య దేశాలు 2024 ఏప్రిల్‌ 25న న్యూయార్క్‌లో ఈ తీర్మానంపై ఓటేశాయి. కాని అమెరికా వీటోచేసింది.భద్రతా మండలిలో ఆ తీర్మానం విఫలమైంది. దీనితో అమెరికా ద్వంద్వ ప్రమాణం తేటతెల్లమైంది.
భద్రతా మండలి 15 సభ్య దేశాల్లో 12 తీర్మానానికి అనుకూలంగా ఓటేశాయి.అమెరికాకు మిత్రదేశాలైన జపాన్‌, దక్షిణ కొరియా, ఫ్రాన్స్‌లు వాటిలోఉన్నాయి. యునైటెడ్‌ కింగ్డం(యుకె), స్విట్జర్లాండ్‌లు గైర్హాజరయ్యాయి. అమెరికా ఈ ద్వంద్వ చర్య చాలా దిగ్భ్రాంతికి గురిచేసింది. ఏప్రిల్‌ 23కు 200 రోజులకు చేరిన ఇజ్రాయిల్‌-పాలస్తీనా యుద్ధంలో ఇజ్రాయిల్‌కు గుడ్డిగా మద్దతు ఇవ్వడం వల్ల అమెరికా ఏకాకి అయిందనడానికి ఇది ఒక సంకేతం మాత్రమే.ఇలాంటి పక్షపాతాలను దాచవ లసిన అవసరం కూడా ఇప్పుడు అమెరికాకు లేదన్నది మరీ అధ్వాన్నమైన అమెరికా బరితెగింపు విషయం.
ఏప్రిల్‌ 24న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇజ్రాయిల్‌కు 2,600కోట్ల డాలర్ల (రూ.2,17,022కోట్లు) అమెరికా సహా యాన్ని ఇచ్చే బిల్లుపై సంతకం చేశారు. గాజాలో పాలస్తీనా భూభాగం తీవ్ర మానవతా సంక్షోభంలో ఉంది. ఈ స్థితిలో అమెరికా ఇజ్రాయిల్‌కు అందిస్తున్న సాయంలో ఆధునిక ఆయుధాలు పెద్ద మొత్తంలో ఉన్నాయి. 2023 డిసెంబరులో, గాజాపై ఎడతెగని ఇజ్రాయిల్‌ బాంబు దాడులకు ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది.ఆ సమయంలో ఇజ్రాయిల్‌కు అమెరికా ఆయుధాల సరఫరాను అమెరికా పార్లమెంటు(కాంగ్రెస్‌) దాటవేసింది. ఇందులో అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్‌ కీలక పాత్ర పోషించారు.
మానవ హక్కుల ఆచరణలపై 2023 స్వదేశీ నివేదికలపై విలేకరుల సమావేశంలో ఏప్రిల్‌ 22న బ్లింకెన్‌ ఇలా అన్నారు. ”2023 అక్టోబర్‌ 7న ఇజ్రాయిల్‌పై హమాస్‌ భయంకర దాడులు చేసింది.అలాంటి దాడులు మరలా జరగకుండా చేయడానికి ఇజ్రాయిల్‌ గాజాలో విపరీత ప్రాణ నష్టానికి పాల్పడ్డంలో తన హక్కును వాడుకుంది. ఇవి మానవహక్కులపై తీవ్ర ఇబ్బందికర ఆందోళనలను కలిగించాయి.” 14 వేలకు పైగా పసిపిల్లలతో సహా 34 వేల పాలస్తీనియన్ల మరణాలకు హమస్‌ బాధ్యత వహించాలని అమెరికా రాజకీయ నాయకులు అంటున్నారు.ఈ నేపథ్యంలో బ్లింకెన్‌ వ్యాఖ్యానం కలవరపెడుతోంది. కాని ప్రపంచంలోని మిగిలినవారు ఈ విషయంలో తీవ్రంగా విభేదిస్తున్నారు.
ఇజ్రాయిల్‌ సిరియాలోని ఇరాన్‌ దౌత్య కార్యాలయంపై దాడిచేసి ఇద్దరు సీనియర్‌ ఇరాన్‌ సైన్యాధికారులను చంపింది. ఇందుకు ఇరాన్‌ ఇజ్రాయిల్‌పై ప్రతీకారం తీర్చుకుంది. తర్వాత అమెరికా, దాని మిత్రదేశాలు ద్వంద్వ ప్రమాణాన్ని రెట్టించాయి. అమెరికా, జి 7 సభ్యదేశాలు ఇరాన్‌ను తీవ్రంగా ఖండించాయి. ఇరాన్‌పై తాజా ఆంక్షలు విధిస్తామని బెదిరించాయి. దీనికి పూర్తి భిన్నంగా ఇజ్రాయిల్‌ హింసాత్మక చర్యలపై మౌనం వహించాయి. గాజాలోని భయానక పరిస్థితి ఆమోదయోగ్యం కాదని మాత్రమే అన్నాయి. అమెరికా ద్వారా సమావేశమైన 48 మంది సభ్యులు ఐరాసలో ఇరాన్‌ ప్రతీకార చర్యను ఖండించడాన్ని ఐరాసలో అమెరికా రాయబారి లిండా థామస్‌-గ్రీన్‌ఫీల్డ్‌ ప్రశంసించారు. 140 మందికి పైగా ఐరాస సభ్యులు ఈ అంశంపై అమెరికాతో విభేదించారని ఆమె అనుకోకుండా ఆ సమయంలో వెల్లడించారు.
ప్రస్తుత ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ‘పశ్చిమానికి ప్రతిగా పశ్చిమేతరం’ దిశలో పెరుగుతూ ఉంటే, ఐరోపా భవిష్యత్తు అంధకారమయ్యే ప్రమాదం ఉందని యూరోపియన్‌ యూనియన్‌ విదేశీ విధాన అధికారి జోసెప్‌ బోరెల్‌ ఫిబ్రవరిలో అన్నారు. అయితే అమెరికా దీన్ని”గుర్తించలేదు”. బ్లింకెన్‌ మానవ హక్కులను ఉల్లంఘిస్తున్న దేశాలను ఎత్తిచూపారు. కాని అమెరికాలో మానవ హక్కులపతనాన్ని ప్రస్తావించడం మర్చిపోయారు. గాజాలో ఇజ్రాయిల్‌ చేసిన అఘాయిత్యాల్లో అమెరికా భాగస్వామి. అమెరికా సుప్రీంకోర్టు నవంబర్‌ 2022లో గర్భస్రావ హక్కును రద్దుచేసి మహిళల హక్కును ఉల్లంఘించినపుడు అమెరికా మౌనంగా ఉంది. అంతేకాక ప్రబలిన తుపాకి హింస, పెరిగిన సంపద అంతరాలు, జాతి వివక్ష, నిరాశ్రయ ప్రజలు అమెరికా సమాజాన్ని రోగగ్రస్తం చేశాయి. ఐరాస మానవ హక్కుల కమిటీి నివేదిక కేవలం స్త్రీల పునరుత్పత్తి హక్కులనే గాక మహిళలపై హింస, చట్టాలను అమలుచేసే సంస్థలచే అధిక బలప్రయోగం, వలసదారులపై అనుసరిస్తున్న అమానవీయ పద్ధతులు మొదలగు అనేక అమెరికా విధానాలను విమర్శించింది.ఈ మతవాద సంస్కృతితో మన మోడీ ప్రభుత్వం పోటీ పడుతోంది.
ఐరాస సర్వ సభ్యసభ సభ్యులు 30 ఏండ్లకు పైగా ప్రతి ఏడాది క్యూబాపై అమెరికా విధించిన అనాగరిక ఆంక్షలను ఖండించారు. అయితే ఏ అమెరికా నాయకుడు అమెరికా విదేశీ విధానాన్ని సరిదిద్దే ధైర్యం చేయలేదు. మాటవినని అనేక దేశాలపై అమెరికా పరోక్ష యుద్ధాలు, ఆర్థిక ఆంక్షలతో తన ఆర్థిక ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తూనే ఉంది.ఇరాన్‌ను కలిపే గ్యాస్‌ గొట్టాల పనిని కొనసాగిస్తే పాకిస్తాన్‌పై ఆంక్షలు విధిస్తామన్న బెదిరింపు ఇందుకు తాజా ఉదాహరణ. అమెరికా ఉపయోగించే ఇటువంటి బెదిరింపులు, ద్వంద్వ ప్రమాణాలు, విభజన విద్వేషాల విత్తనాలను మాత్రమే విత్తుతాయి. ఈ పశ్చిమ దేశాధిపత్య చర్యలు అమెరికా, దాని మిత్రదేశాలలో కొన్నింటిని ప్రపంచంలోని ఇతర దేశాల నుండి వేరుచేస్తాయి. ఇది దేశాల మధ్య విభజన. మన దేశంలో మోడీ పాలనలో సంఖ్యాధిక్య మతస్తులు, ఇతరులు అన్న సామాజిక చీలిక జరిగింది.
(చైనా డైలి సంపాదకీయం ఆధారంగా)
– సంగిరెడ్డి హనుమంత రెడ్డి
9490204545

Spread the love