శాస్త్రీయ ప్రగతికి మతతత్వ ముద్ర

– ‘శివశక్తి’ కేంద్రంగా విక్రమ్‌ అడుగిడిన ప్రాంతం
– ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటన
– బెంగళూరులో ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందన
బెంగళూరు: ఆరు దశాబ్దాలుగా రోదసీ రంగంలో శాస్త్రవేత్తలు సాగించిన అద్భుతమైన కృషి, విజయాలపై మనువాద మతతత్వ ముద్ర పడింది. చంద్రుని ఉపరితలంపై విక్రమ్‌ ల్యాండర్‌ అడుగుపెట్టిన ప్రదేశానికి ‘శివశక్తి’ పాయింట్‌గా పేరు పెడుతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. అలాగే చంద్రునిపై చంద్రయాన్‌-2 ల్యాండర్‌ క్రాష్‌ అయిన ప్రాంతాన్ని ‘తిరంగా పాయింట్‌’గా ఆయన ప్రకటించారు. జాబిల్లి దక్షిణ ధృవంపై తొలిసారిగా అడుగు పెట్టి చరిత్ర సృష్టించిన భారత దేశ శాస్త్రవేత్తల బృందాన్ని మోడీ అభినందనల్లో ముంచెత్తారు. దక్షిణాఫ్రికా, గ్రీస్‌ల్లో పర్యటన ముగించుకుని శనివారం ఉదయం నేరుగా బెంగళూరుకే చేరుకున్న ప్రధాని ఇస్రోకు వెళ్ళి శాస్త్రవేత్తలతో కాసేపు ముచ్చటించారు.
‘శివ శక్తి’లో నారీ శక్తి ఇమిడి వుందని మోడీ పేర్కొన్నారు. అనేకమంది మహిళలు చంద్రయాన్‌- 3 మిషన్‌లో అపారమైన, విలువైన సేవలందిం చారని కొనియాడారు. ”శివ భావనలో మానవతా దృక్పథం ఇమిడి వుంది. మన కర్తవ్యాలను అంకిత భావంతో నెరవేర్చే శక్తి సామర్థ్యాలు మనకు శక్తి నుండి సంక్రమిస్తాయి.
కన్యాకుమారి నుండి హిమా లయాల వరకు భారతదేశ ఐక్యతకు ప్రతిరూపమే చంద్రునిపై శివశక్తి పాయింట్‌’ అని ఆయన వ్యాఖ్యా నించారు. ‘నిబద్ధత, అంకితభావంతో విధులను నిర్వర్తించగలగడం, ఆలోచనలకు, విజ్ఞాన శాస్త్రానికి ఊపునివ్వవగలగడమే సంక్షేమం పట్ల నిబద్ధత అని రుషులు చెప్పారంటూ మోడీ గుర్తు చేశారు. అందరికీ లబ్ది చేకూర్చే కోరిక నెరవేరాలంటే అందుకు శక్తి ఆశీర్వాదం తప్పనిసరి అని అన్నారు. ‘ఆ శక్తే మన నారీ శక్తి. మన మాతృమూర్తులు, కుమార్తెలు. సృష్టి నుండి వినాశనం వరకు ప్రతి చోటా నారీ శక్తి వుం టుంది. చంద్రయాన్‌- 3 మిషన్‌లో మన మహిళా శాస్త్రవేత్తలు పోషించిన అద్భుతమైన పాత్రను మనం దరం చూశాం’ అని ఆయన అభినందనలు కురిపిం చారు. చంద్రుని దక్షిణ ఉపరితలానికి 70డిగ్రీల కోణానికి సమీపంలో బుధవారం సాయంత్రం 6.04గంటలకు ల్యాండర్‌ మాడ్యూల్‌ దిగింది. చంద్రునిపై ఒక రోజు అంటే భూమిపై మనకు 14 రోజులతో సమానం. చంద్రునిపై సూర్యోదయం సమయంలో ల్యాండ్‌ అయిన లాండర్‌, రోవర్‌లు పలు శాస్త్రీయ ప్రయోగాలు చేపట్టనున్నాయి.
ప్రయాణం ఆరంభించిన ప్రజ్ఞా
దక్షిణ ధృవం వద్ద చంద్రుని రహస్యాల అన్వేషణలో భాగంగా ప్రజ్ఞా రోవర్‌ జాబిల్లి ఉపరితలంపై 8మీటర్లు ప్రయాణించిన తాజా వీడియోను ఇస్రో శుక్రవారం విడుదల చేసింది. మొత్తంగా 500మీటర్లు దూరం ప్రయాణించే సామర్ధ్యం రోవర్‌ స్వంతం. బిలాలతో నిండి వున్న ఉపరితలంపై రోవర్‌ కదలడాన్ని 40సెకన్లు నిడివి వున్న ఈ వీడియోలో చూడవచ్చు. ఆ దారి పొడుగునా రోవర్‌ చక్రాల గుర్తులు కనిపిస్తున్నాయి. వెనుకవైపున్న విక్రమ్‌ ల్యాండర్‌ ఇదంతా వీడియో తీసి పంపింది. ల్యాండర్‌ నుండి రోవర్‌ కిందకు జారడం కూడా వీడియోలో కనిపిస్తోంది. రోవర్‌ నిర్వహించే రెండు సైన్స్‌ ప్రయోగాలు కూడా ఆరంభ మయ్యాయని ఇస్రో తెలిపింది. ”శివశక్తి పాయింట్‌ చుట్టూ ప్రజ్ఞా రోవర్‌ తిరుగుతూ చంద్రుని దక్షిణ ధృవంపై గల రహస్యాలను అన్వేషిస్తోంది.” అని ఇస్రో, ఎక్స్‌లో ట్వీట్‌ చేసింది.

Spread the love