బిల్డర్లకు ‘రెరా’ షోకాజ్‌లు

'RERA' showcases for builders– నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు :’రెరా’ కార్యదర్శి పీ యాదిరెడ్డి హెచ్చరిక
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) రిజిస్ట్రేషన్‌ లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రకటనలు జారీ చేస్తూ, మార్కెటింగ్‌ కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఆ సంస్థ కార్యదర్శి పీ యాదిరెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘రెరా’ నిబంధనలు ఉల్లంఘించిన పలు సంస్థలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశామనీ, 15 రోజుల్లో సంజాయిషీ ఇవ్వకుంటే చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఈ మేరకు హఫీజ్‌పేటలో ప్రీ-లాంచ్‌ కార్యక్రమాలకు పాల్పడుతున్న బిల్డాక్స్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీకి ఇప్పటికే షోకాజ్‌ నోటీసు జారిచేశామనీ, అయితే వారు ఇచ్చిన సంజాయిషీ సంతృప్తికరంగా లేదన్నారు. దీనితో తగిన ఆధారాలతో కొనుగోలుదారు నుండి డబ్బు తీసుకుని రశీదు ఇచ్చినట్లు ఆధారాలు లభించాయనీ, అందువల్ల మరోసారి సంజాయిషీ నోటీసు ఇచ్చామని తెలిపారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం జింకల తండాలో జీఆర్‌ఆర్‌ విశ్రాంతి రిసార్ట్స్‌ కూడా ‘రెరా’ రిజిస్ట్రేషన్‌ లేకుండా వ్యాపార ప్రకటనలు జారీ చేసి, మార్కెటింగ్‌ కార్యక్రమాలు నిర్వహించడంతో షోకాజ్‌ నోటీస్‌ జారీ చేశామన్నారు. అదే జిల్లా కూసుమంచి మండలం జీలచెరువు గ్రామంలోనూ జీఆర్‌ఆర్‌ హై వే కౌంటీ ప్రాజెక్ట్‌ కూడా ఇదే తరహా ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందనీ, వారికి కూడా నోటీసు ఇచ్చామన్నారు. కూసుమంచి మండలం మునిగేపల్లి గ్రామంలో వెంచర్‌ వేసిన ఇండో ఖతార్‌ ప్రాజెక్ట్‌, అబ్దుల్లాపూర్‌ మండలం అంబర పేట మున్సిపాలిటీ పరిధిలోని తట్టిఅన్నారంలోని అనంత వనస్థలి హిల్స్‌ ప్రాజెక్ట్‌, హైదరాబాద్‌లో పలు ప్రాజెక్టులు చేపట్టేందుకు వ్యాపార ప్రకటనలు జారీ చేస్తున్న గో గ్రీన్‌ గ్రూప్‌ ప్రాజెక్టుకు కూడా నోటీసులు జారీ చేశామన్నారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎమ్‌డీఏ, డీటీసీపీ, యూడీఏతో పాటు స్ధానిక సంస్థల నుండి అన్ని అనుమతులు పొంది, ఆ తర్వాత ‘రెరా’లో రిజిస్టర్‌ కావాలని, ఆయా సంస్థల వ్యాపార ప్రకటనలు, మార్కెటింగ్‌ సమయంలో తప్పనిసరిగా ఆ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ను ప్రదర్శించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Spread the love