భద్రత-బాధ్యత

Kathaభద్రతా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆ ఆడిటోరియం నిండిపోయింది ప్రేక్షకులతో. కోలాహలంతో నిండిన ఆ పండుగ వాతావరణాన్ని చూస్తున్నాను. ఇంతలో ఒక ఆర్గనైజర్‌ వచ్చి నన్ను ఆహ్వానించాడు.
”రండి సందేశ్‌ సారు. మీరు ముందు వరుసలో కూర్చోండి. ఈ సాంస్కృతిక కార్యక్రమం అవగానే స్టేజ్‌ మీద జి.ఎం.గా మీ మొదటి ఉపన్యాసం ఉంటుంది”
నేను నాకు కేటాయించిన కుర్చీలో కూర్చుండిపోయాను. అప్రయత్నంగా కళ్ళు చమర్చాయి. ఆనందభాష్పాలు కావు అవి, నిజమైన బాధతో కూడిన కన్నీరు. భద్రతా లోపం వలన జీవితం నేర్పిన పాఠం. అలా కూర్చునే గతంలోకి వెళ్ళిపోయాను.
మార్నింగ్‌ షిఫ్ట్‌ మొదలైంది. ఐలయ్య అన్న వస్తున్నాడని కార్మికులు గుసగుసలాడుతున్నారు.
నమస్తే అన్నా అని దణ్ణాలు పెడుతున్నారు.
ఐలయ్య : ఏరా పోచం మంచిగా ఉన్నావా? ఎవరైనా పరేషాన్‌ చేస్తుండ్ర, చెప్పు నేను చూసుకుంటా.
పోచం : ఎవరేమంటారు అన్న. ఐలయ్య మా యూనియన్‌ లీడర్‌. అయినా అన్న… నాకు చిన్న పరేషాన్‌ వచ్చింది. నాకు 5000 రూపాయలు అడ్వాన్స్‌ ఇప్పిస్తావా, అవసరం ఉన్నది.
ఐలయ్య : సరే, రా… ఆ సార్‌కి పోయి నా పేరు చెప్పు, ఇవ్వనంటే నేను వస్తా. తీసుకున్నాక సరిపోదు. నాకు సాయంత్రం బిర్యానీ తినిపియ్యాలి రా. లేకుంటే బిడ్డ…..
పోచం : సరే అన్న
ప్యూన్‌ : ఐలయ్య మిమ్మల్ని జీఎం గారు ఒకసారి కలవమన్నారు.
ఐలయ్య : వస్తాలే నాకు పురుసత్‌ ఉన్నప్పుడు వస్తా, నాకు చాలా పనులు ఉంటాయి.
ఒక గంట తర్వాత, జి యం రూమ్‌ లోకి వెళ్ళాడు.
ఐలయ్య : ఏం సారు రమ్మన్నవట
జిఎం : ఈయన కొత్త సేఫ్టీ జిఎం. ఆయన పేరు సలీం నీతో మాట్లాడతారట.
ఐలయ్య : ఎవరైతే నాకేంటి? ఏం మాట్లాడుతాడు. నేను లీడర్‌ అని సారుకు తెల్వదా.
సలీం : ఐలయ్య నా పేరు సలీం. కొత్త సేఫ్టీ ఆఫీసర్‌ ని. నీ గురించి విన్నాను, నీ వత్తి ఏంటి?
ఐలయ్య : ఓ సారు నా గురించి అడుగుతున్నావు, ఏడ నుంచి వచ్చావు. నా 30 ఏళ్ల సర్వీస్‌లో ఎవరు ఈ ప్రశ్న అడగలే. ఒక నాలుగు నెలల్లో నేను రిటైర్‌ అవుతున్నాను, ఇంకా గట్టిగా ఉన్నా చూసినవా. నన్ను ఎవరూ అడిగే ధైర్యం చేయలేరు. అయినా నువు అడిగనవు కాబట్టి చెప్తున్నా, నేను మిషన్లకు ఆయిలింగ్‌ గ్రీసింగ్‌ చేసేటోణ్ణి.
సలీం: ఎంతవరకు చదువుకున్నావ్‌?
ఐలయ్య : నేను సదువుకోలేదు, అయితే ఏంది 30 ఏళ్లు చేసిన, లీడర్‌ నైన.
సలీం : చదువుకోలేదు కదా మరి జీతం తీసుకునేటప్పుడు సైన్‌ చేస్తావా?
ఐలయ్య : లేదు, ఏలిముద్ర పెడతా. అయినా ఏంది బాగా అడుగుతున్నావ్‌.
సలీం : నీకు ఎంతమంది పిల్లలు?
ఐలయ్య : ఒక్కడే కొడుకు. వాడు సేఫ్టీ కోర్సు చేసిండు పాస్‌ అయ్యిండు.
సలీం : మరి నీతో పాటు నలుగురిని తీసుకుని తిరుగుతున్నావు కదా.
ఐలయ్య : మరి నా పని ఎవరు చెయ్యాల? వారితో చేయిస్తా.
సలీం : ఒక్క పనిని ఐదుగురు చేయాలా?
ఐలయ్య : ఓ సారు నన్ను భయపెడుతున్నావా, నన్ను చూస్తే అందరికీ హడల్‌. ఎక్కడైనా లీడర్లు చేస్తారా, చేయిస్తారు గానీ.
ఒక నాలుగు రోజులు గడిచిపోయాయి. ఉదయాన్నే ప్యూను వచ్చాడు.
ప్యూన్‌ : ఐలయ్య నిన్ను సలీం సార్‌ రమ్మన్నారు.
ఐలయ్య: మళ్లీ ఏంది లొల్లి. వస్తాలే పో. నాతో వచ్చే నలుగురు రాలేదు. నాకు చెప్పకుండా ఎలా డుమ్మా కొట్టిన్రు. రేపు వాళ్లకి నా తడాఖా చూపిస్తా.
ఏంది సార్‌ రమ్మన్నావట నాతోపాటు వచ్చేవాళ్లు రాలేదు, అందుకే లేట్‌ అయింది.
సలీం : మాకు తెలుసు. వాళ్లు వేరే ప్లాంట్లో పనిచేస్తున్నారు. అవసరం ఉండి పంపాను.
ఐలయ్య : గట్ల కుదరదు కదా, నాకు ముందు చెప్పాలి.
సలీం : అందుకే కొత్తగా నీకు ఇద్దరినిస్తున్నాం. వాళ్ళకి నువ్వు ట్రైనింగ్‌ ఇవ్వాలి.
ఐలయ్య: నేను లీడర్‌ని. నాకే పని చెప్తారా మీరు.
సలీం : లీడర్‌ వి కాబట్టే ట్రైనింగ్‌ ఇమ్మంటున్నాం.
ఐలయ్య : సరే మరి వీళ్లకు ట్రైనింగ్‌ ఇచ్చి నా దగ్గరే ఉంచుకుంటాను.
ఐలయ్య ఆయిల్‌ బాటిల్‌, గ్రీస్‌ బాక్స్‌ తీసుకుని మెట్లు ఎక్కి మిషన్‌ దగ్గరికి వెళ్తున్నాడు. నిర్లక్ష్యంగా వెళుతున్న క్రమంలో ఆయిల్‌, గ్రీస్‌ మెట్ల మీద పడుతున్నాయి.
సలీం: ఐలయ్య మెట్ల మీద ఆయిల్‌, గ్రీస్‌ పడుతున్నాయి. కొంచెం ఆగి వాటిని శుభ్రం చెయ్యి. చేతికి గ్లౌస్‌ వేసుకోలేదు. భద్రతా నియమాలు పాటించడం లేదు. వెనక్కి రా. భద్రతా నియమాలు అతిక్రమించకు. అది నీకే ప్రమాదం.
ఐలయ్య : జిఎం సార్‌, నాకు 30 ఏళ్ల సర్వీస్‌ ఉంది. పని మొదలుపెడితే వెనుకకు రాను నేను లీడర్‌ ని. తిరిగి చూసేదేలే.
సలీం : నీ ఆలోచనలను గర్వం అనే పొర నీ మెదడును కప్పేసింది. అది నీకే ముప్పు రావచ్చు. వెనుకకు రా.
ఐలయ్య చెవికి ఎక్కలేదు, ‘నాకెవరు చెప్పేది?’ అని భావించాడు. ఈ క్రమంలో ఆయిలింగ్‌, గ్రీసింగ్‌ చేసి మెట్లు దిగుతున్న సమయంలో, ఆయిల్‌ ఒలికిన ప్రదేశంలో కాలు వేసి జారిపడ్డాడు. మెట్ల మించి పడే క్రమంలో చేతులు భూమి మీద ఆన్చాడు. అబ్బా….. అని అరిచి కింద పడిపోయాడు. దెబ్బలు గట్టిగా తగిలాయి. ఐలయ్యను ఆసుపత్రికి తీసుకెళ్లి చేర్పించారు.
అన్ని పరీక్షలు నిర్వహించిన మరుసటి రోజు రిపోర్టులో అతని రెండు చేతుల బొట్టిన వేళ్ళు విరిగాయని, షుగర్‌ లెవెల్స్‌ ఎక్కువగా ఉండటం వలన వేళ్ళు సెప్టిక్‌ అయ్యాయని అవి తీసేయాల్సి వస్తుందని వైద్యులు నిర్ణయించారు.
ఐలయ్య మరుసటి రోజు స్పృహలోకి వచ్చాక డాక్టర్లు ”ఐలయ్య నీ రెండు చేతుల బొటనవేలు విరిగి సెప్టిక్‌ అవడం వలన తీసేయాల్సి వచ్చింది” అని చెప్పారు.
మొదటిసారిగా ఐలయ్య మనసులోకీ భయం మొదలైంది. అయినా అందరికీ కనబరచక గర్వంగా చుట్టూ చూసాడు. నన్ను చూడడానికి రాలేదు… నేను లీడర్నని మర్చిపోయారా? అందరి సంగతి చెప్తా, అని అనుకున్నాడు.
నాలుగు రోజుల అనంతరం డాక్టర్లు ఐలయ్యకు ఆహారం ఇవ్వమని సలహా ఇచ్చారు. భోజనం టేబుల్‌ మీద పెట్టగానే లేచి కలుపుకుందాం అని అప్రయత్నంగా ప్రయత్నించాడు, అతనికి రాలేదు, కష్టపడుతున్నాడు. అప్పుడు అర్థమైంది తనకి బొటనవేళ్ళు లేవు కదా అని.
మొదటిసారిగా అతని గర్వాన్ని భయం అధిగమించింది. నేను ఇక జీవితంలో కలుపుకొని తినలేను అని గ్రహించాడు. కళ్ళనుండి అప్రయత్నంగా నీళ్లు వస్తున్నాయి. కృంగిపోయాడు. నేను కొంచెం భద్రత పాటించి ఉంటే ఇది జరిగేది కాదు. ఈరోజుకి లీడర్‌లాగే ఉండేవాడిని, జీరో అయిపోయాను. ఒకరి మీద ఆధారపడ్డాను అని వాపోయాడు.
ఇంకా కృంగిపోయాడు, షుగర్‌ లెవెల్స్‌ పెరిగాయి. ఇది ఇలా ఉండగా ఒకటో తారీకు వచ్చింది జీతం రావాలని అనుకున్నాడు ఆయన. జీతం అందించడానికి వాళ్లు వచ్చారు.
”ఐలయ్య, ఈ ఫాం మీద సంతకం చెరు”
”నేను చదువుకోలేదు నిశానీ ఏస్తా”
వెంటనే గుర్తుకు వచ్చింది బొటనవేళ్లు లేవని. ఒక్కసారిగా స్థానువయ్యాడు. విలపిస్తున్నాడు. వేలిముద్ర లేనిదే నాకు జీతం కూడా రాదు కదా, నేను చేసిన చిన్న నిర్లక్ష్యం వల్ల నా కుటుంబానికి జీతం అందించలేను, చదువుకోలేదు, అన్నం కలుపుకోలేను, టీ కప్పు పట్టుకోలేను. ఇలాంటి భావాలు అతని మనసును ఉక్కిరిబిక్కిరి చేశాయి.
నేను ఆరోజు భద్రత పాటించలేదు. సార్‌ చెప్పినట్టుగా నాకు గర్వం కమ్మేసింది. ఇది నేను జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు. నా వలన నా కుటుంబానికి ఇబ్బంది కలిగింది. నేను వాళ్ళ మీద ఆధార పడవలసి వచ్చింది. అభద్రత వలన కనువిప్పు కలిగినా ఆలస్యమైంది.
ఇలాంటి ఆలోచనలతో మంచానపడ్డాడు. మనోవ్యాధికి మందు లేదు కదా. అతని ఆలోచనలకు షుగర్‌ లెవెల్స్‌ పెరిగిపోయి, ప్రమాదపుటంచున పడేశాయి.
డాక్టర్లు ఐలయ్య కొడుకు సందేశ్‌ ని పిలిచి ”సారీ అన్ని విధాలా ప్రయత్నించాం మీ నాన్నగారిని రక్షించలేకపోయాం” అని చెప్పారు.
సందేశ్‌ బాగా బాధపడ్డాడు. ఒక్కసారిగా కుటుంబ బాధ్యతలు అతని మీద పడ్డాయి.
పలకరించడానికి వచ్చిన ఐలయ్య సహచరులు అతనికి అదే కంపెనీలో ఉద్యోగం కోసం ప్రయత్నించమని సలహా ఇచ్చారు.
”నేను ప్రయత్నించలేను. మా నాన్న చేసిన చిన్న భద్రతా నిర్లక్ష్యం వల్ల ఈ సంఘటన జరిగింది. నేను కూడా అడగలేను. నాకు సిగ్గుగా ఉంది వాళ్లు నన్ను పిలవరు. అందులో నేను చేసింది సేఫ్టీ కోర్స్‌, మా నాన్న నిర్లక్ష్యం వల్ల మూల్యాన్ని చెల్లించుకున్నాడు” అని వాపోయాడు.
సరిగ్గా 15 రోజుల తర్వాత ఐలయ్య ఇంటి తలుపు ఎవరో తట్టారు. తలుపు తెరిచి చూస్తే ఎదురుగుండా ఉన్న మనిషి ఇక్కడ సందేశ్‌ ఎవరు అని అడిగాడు.
”నేనే సందేశ్‌, మీకు ఎవరు కావాలి?”
”కంపెనీ యాజమాన్యం మీకు ఈ కవర్‌ని అందించి రమ్మన్నారు. ఈ కవర్‌ అందించడానికి వచ్చాను”
అందించి వెళ్ళిపోయాడు.
ఇది ఏమైనా అప్పుల వాళ్ళ కవరా? మా నాన్న ఎవరికైనా బాకీ ఉన్నారా, ఇలాంటి ఎన్నో ఆలోచనలు అతని మనసులో పరిగెడుతున్నాయి.
అప్రయత్నంగానే ఆ కవర్‌ తెరిచి చూశాడు, అపాయింట్మెంట్‌ లెటర్‌. అదే కంపెనీలో మరుసటి రోజు రమ్మని పిలుపు. ఒక్కసారిగా అతని కనుల వెంట ధారాపాతంగా నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఒక్కడే కుర్చీలో కూర్చుండిపోయాడు.
మరుసటి రోజు ఆఫీసులో…
”మే ఐ కమిన్‌ సర్‌”
”ఎస్‌, కమిన్‌”
”నా పేరు సందేశ్‌ సర్‌. ఐలయ్య కొడుకుని. మా నాన్న చేసిన నిర్లక్ష్యానికి, మీరు నాకు ఉద్యోగం ఇవ్వరనుకున్నాను సార్‌”
”చూడు సందేశ్‌… తప్పు చేయడం మానవ సహజం. కానీ రియలైజేషన్‌ అనేది ముఖ్యం. ఈ సంఘటన నీకు ఒక పెద్ద పాఠం. నువ్వు ఇంకా ఇలాంటి నిర్లక్ష్యం చేయనీయవని గట్టిగా నమ్ముతున్నాం. యు కెన్‌ జాయిన్‌ ది డ్యూటీ”
”సార్‌, మీ పేరుకు తగ్గట్టుగా మా కార్మికులకు మంచి సందేశం ఇవ్వాలి. మా సాంస్కృతిక కార్యక్రమం ముగుస్తుంది సార్‌” అని అనగానే స్పృహలోనికి వచ్చాను.
కొన్ని నిమిషాల తర్వాత…
”ఇప్పుడు మాకు కొత్తగా జాయిన్‌ అయిన సేఫ్టీ జిఎం సందేశ్‌ గారు మీకు వారి సందేశాన్ని వినిపిస్తారు” అని అనగానే కరతాళ ధ్వనుల మధ్య సందేశ్‌ స్టేజ్‌ మీదకు వెళ్లి మైక్‌ దగ్గర నులుచున్నాడు.
”వేదికనలంకరించిన పెద్దలకు నా వందనములు. ప్రతి మనిషికి జీవితంలో భద్రత అనేది చాలా ముఖ్యం. ఉదాహరణకు మానవ శరీరం తీసుకోండి, బోన్స్‌, స్కెలిటన్‌ స్ట్రక్చర్‌ లేకపోతే శరీరం ఒక ముద్దలా సంచిలో ఉండేది. ఈ శరీరాన్ని అందంగా ఉంచడానికి భగవంతుడే మన శరీరంలో స్కెలిటన్‌ స్ట్రక్చర్‌ అమర్చి నిలబెట్టాడు. ఇది భగవంతుడు మనకి ఇచ్చిన సేఫ్టీ. అలాగే కళ్ళలో ఏదైనా డస్ట్‌ గాని నలుసు గానీ పడితే, అప్రయత్నంగా కళ్ళలోకి నీరు వచ్చి ఆ నలుసును కంటి చివరి వరకు ప్రవహించేలా చేస్తాయి. ఇది భగవంతుడు సమకూర్చిన సేఫ్టీ.
అలాగే మన శరీరంలో ప్రధానమైన భాగం గుండె, అది రిబ్‌ కేజెస్‌, వెన్నెముక మధ్యలో చక్కగా అమర్చబడి, భద్రపరచబడి ఉంటుంది. దానికేమీ దెబ్బ తగలదు. ఇది భగవంతుడు మనకు చేసిన మరొక సేఫ్టీ. మన బ్రెయిన్‌ కూడా స్కల్‌ మధ్యలో పటిష్టంగా భద్రపరచబడి ఉంటుంది. ఇవన్నీ భగవంతుడు మనకు అమర్చిన సేఫ్టీ. కానీ ఎన్ని సమకూర్చినా నిత్యజీవితంలో మన భద్రతకు కావలసిన నియమాలు పాటించకుండా ప్రమాదాలకు లోనవుతున్నాం. మన పై అధికారులు చెప్పినా పాటించక ప్రమాదానికి లోనవుతున్నాం. మనకు ప్రమాదం జరిగితే మనతో పాటు మన కుటుంబ సభ్యులు కూడా జీవితాంతం బాధపడవలసి వస్తుంది. ఇది మనం గ్రహించాలి. భద్రతే భవిష్యత్తుకు బంగారు బాట”.
కరతాళ ధనులతో ఆ ప్రాంగణం మారుమోగి పోయింది. ”నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను సజీవంగా నిలబెట్టిన యాజమాన్యానికి నేను నా కతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సేఫ్టీ డే సందర్భంగా బెస్ట్‌ స్లోగన్‌ బహుమతి” అని ఒక కవర్‌ తెరిచి అందులో ఉండే స్లోగన్‌ను చదివాడు మైక్‌ లో ‘నీరు వధా చేస్తే మిగిలేది కన్నీరే
అది మన దాహాన్ని తీర్చలేదు’
”ఈ స్లోగన్‌ పంపిన రమణ కష్ణ గారిని వేదిక వైపుకి ఆహ్వానిస్తూ వారు బహుమతిని గ్రహించవలసిందిగా కోరుతున్నాను”
చక్కటి కరతాళ ధ్వనుల మధ్య ఈ కార్యక్రమం ముగిసింది. తనను జీవితంలో నిలబెట్టిన యాజమాన్యాన్ని తలుచుకుంటూ సంతోషంగా ఇంటికి చేరాడు సందేశ్‌.

– పెద్దాడ నాగరాజు, 98668 74367

Spread the love