‘టిఫినీ’లు చేశారా..!

శరీరానికి అవసరమైన పిండి పదార్థాలు, మాంస కృత్తులు, కొవ్వు, ఖనిజలవణాలు, పీచు, పోషక విలువలు అందించేందుకు ఆహారం తీసుకోవాలి. మరణం వరకు వెంటాడే ఆకలిని తీర్చుకునేందుకు రకరకాల ఆహార పదార్థాలను మనిషి తీసుకుంటాడు. పూర్వీకులు మూడు పూటలా భోజనం అన్న పద్ధతి తీసుకువచ్చారు. నిర్ధిష్టమైన సమయాల్లో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అలవర్చుకున్నారు. పాశ్చాత్య ప్రభావంతో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి మరోసారి భోజనం అన్న విధానానికి పూర్తిగా స్వస్తి చెప్పే పరిస్థితులు వచ్చాయి. స్నాక్స్‌ పేరుతో ఎన్నో రకాల వంటకాలు వచ్చాయి. ఉరుకుల, పరుగుల ప్రపంచంలో మనిషి జీవనంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి.
యూరోపియన్లు అల్పాహారానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. బ్రేక్‌ ఫాస్ట్‌లో అధిక పరిమాణంలో ఆహారం తీసుకోవడం మంచిదని ఆనేక పరిశోధనల్లో వెల్లడైంది. రాత్రి భోజనం తర్వాత దాదాపు ఎనిమిది గంటలపాటు కడుపు ఖాళీగా ఉంటుంది కాబట్టి కడుపు నిండా అల్పాహారం తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. రాత్రి భోజనం తగ్గించుకుని, భారీగా అల్పాహారం తీసుకుంటే ఊబకాయం రాదని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
ఉదయాన్నే ఆలస్యంగా నిద్రలేవడం వల్ల లేదా వేరే ఇతర కారణాల వల్ల అల్పాహారం మానేస్తే డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు 33 శాతం ఉన్నాయి. అల్పాహారం తీసుకోకపోతే శరీరంలోని కేలరీలు, కొవ్వు కరిగి బరువు తగ్గుతారని, సన్నగా తయారవుతారని అనుకుంటుంటారు చాలామంది. టిఫిన్‌ అనేది రోజు మొత్తం మీద మనం తీసుకునే అతి ముఖ్యమైన ఆహారం. ప్రొటీన్లు ఎక్కువగా ఉండి, కార్బొహైడ్రేడ్లు, కొవ్వు తక్కువ శాతం ఉండే ఆహారాన్నే తీసుకోవాలి. అప్పుడే శరీరానికి అవసరమైన ప్రొటీన్లు సమకూరడం వల్ల మనం రోజంతా ఆరోగ్యవంతంగా, హుషారుగా ఉండగలం.
అల్పాహారం తీసుకోనివారిలో ఇన్సులిన్‌ ఉత్పత్తి స్థాయిలో మార్పులు చోటుచేసుకుంటాయి. దానివల్ల ఒత్తిడి పెరిగి, రోగ నిరోధక శక్తి తగ్గి వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 శాతం మంది ప్రతిరోజూ అల్పాహారాన్ని తీసుకోవడం లేదని పరిశోధనల్లో తేలింది. ఇండియాలో ఎక్కువ శాతం యువత అల్పాహారాన్ని సరిగా తీసుకోవట్లేదని తెలుస్తోంది. అన్ని పోషకాలూ ఉన్న అల్పాహారాన్ని తీసుకోవడం వల్ల డయాబెటిస్‌ అదుపులో ఉంటుందని వైద్యులు అంటున్నారు.
చాలామంది ఉదయం ఆహారం తీసుకోవడం తప్పిస్తారు. అల్పాహారం మానేయడం వల్ల త్వరగా బరువు తగ్గవచ్చని చాలా మంది నమ్ముతారు. కానీ అది తీరని నష్టం చేస్తుంది. అల్పాహారం మానేయడం మంచిది కాదు. ఓట్స్‌, రాగి మొదలైన అల్పాహారాలను తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. తేలికపాటి అల్పాహారం రోజంతా శక్తివంతంగా ఉంచుతుంది.
క్రమం తప్పకుండా ఉదయం వేళ టిఫిన్‌ తీసుకునే చిన్నారుల్లో మేధోవికాసం ఉంటుందని పరిశోధకులు తాజా అధ్యయనంలో కనుగొన్నారు. తొమ్మిది నుంచి పదకొండేళ్ల వయసు కలిగిన సుమారు అయిదువేల మంది విద్యార్థుల ఆహారపు అలవాట్లపై సర్వే చేసిన అనంతరం పరిశోధకులు ఈ మాట చెబుతున్నారు. యుకెలో ఇపుడు అనేక విద్యాసంస్థలు చిన్నారులకు ఉచితంగా అల్పాహారాన్ని అందజేస్తున్నాయి. ఎదిగే వయసులో పిల్లలకు తగిన పోషకాలు అందకపోతే శారీరకంగా, మేధోపరంగా మేలు జరగదని పిల్లలు శారీరకంగా శక్తిని పుంజుకున్నపుడు- తరగతులకు గైర్హాజరు కావడం, చదువులో వెనుకబడి పోవడం వంటి సమస్యలు ఉండవని పరిశోధకులు బలంగా వాదిస్తున్నారు.
అల్పాహారం తినే పిల్లల్లో మంచి ఆహారపు అలవాట్లు కూడా అలవడతాయి. కూరగాయలు, పండ్లు, స్వీట్లు, చిప్స్‌ వంటివి ఏ సమయంలో, ఏ మోతాదులో తీసుకోవాలో అనే విషయంపై వీరికి తగిన అవగాహన ఉంటుంది. మధ్యాహ్నం, రాత్రి వేళ తీసుకోవాల్సిన ఆహారంపైనా ఆసక్తి పెరుగుతుంది. అల్పాహారం అలవాటైతే పిల్లల ఆహార పద్ధతుల్లోనూ ఆరోగ్యకరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి.
బ్రేక్‌ ఫాస్ట్‌ మానేసే మహిళల్లో టైప్‌-2 డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. బ్రేక్‌ ఫాస్ట్‌ని సరైన సమయంలో తీసుకోవాలి. అల్పాహారం తినకపోవడం వల్ల క్యాన్సర్‌ సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. యువత బ్రేక్‌ ఫాస్ట్‌ తినకపోతే ఏకాగ్రత బాగా తగ్గిపోతుందట. అదేవిధంగా అల్పాహారం తీసుకోవడం మానేస్తే జుట్టు త్వరగా ఊడిపోతుంది. బట్టతల కూడా వస్తుంది.
బ్రేక్‌ఫాస్ట్‌ మానేయడం వల్ల బరువు కూడా పెరిగిపోయే అవకాశం ఉంది. అయితే చాలా మంది సన్నగా అవ్వాలంటే బ్రేక్‌ఫాస్ట్‌ మానేస్తారు కానీ తినకపోతే లావు అవుతారు. కొంతమంది బ్రేక్‌ఫాస్ట్‌ మానరు కానీ ఆలస్యంగా తీసుకుంటారు. ఆలస్యంగా తిన్నా కూడా ఇబ్బందులు వస్తాయి. ఆలస్యంగా బ్రేక్‌ఫాస్ట్‌ చేయడం వల్ల తలనొప్పి, మైగ్రేన్‌ వంటి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.
అల్పాహారం కడుపు నిండా తినేవారి ఆరోగ్యం అన్ని విధాలుగా బాగుంటుందని, చెడు కొలెస్ట్రాల్‌ పేరుకునే ప్రమాదం ఉండదని చెబుతున్నారు. స్ధూలకాయం ఉన్న 93 మంది మహిళల్లో కొందరికి అధిక అల్పాహారం, కొందరికి అధిక రాత్రి ఆహారం ఇచ్చి 12 వారాల పాటు పరిశీలించారు. అల్పాహారం ఎక్కువగా తీసుకున్న వారు బరువు తగ్గి ఆరోగ్యం పెంచుకున్నట్టు వెల్లడైంది.
బ్రేక్‌ఫాస్ట్‌ అనగానే చాలామంది ఏది పడితే అది తినేస్తారు. కానీ మాంసకృత్తులున్న పదార్థాలు తింటే చాలా ఆరోగ్యం.
ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి ఇవి చాలా అవసరం. వీటిని తినడం వల్ల త్వరగా ఆకలి వేయదు. వీటిని అల్పాహారంగా తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు. గుడ్లు, బీన్స్‌, డ్రైఫ్రూట్స్‌, కూరగాయల నుంచి మాంసకృత్తులు లభిస్తాయి. అల్పాహారం త్వరగా తయారైపోతుందనే ఉద్దేశ్యంతో కొంతమంది బ్రెడ్‌, మైదా పదార్థాలను ఎంచుకుంటారు. వీటి నుండి శరీరానికి పీచు అందదు. త్వరగా ఆకలేస్తుంది. కారణం వీటిలోని పిండిపదార్థాలు. ఉపయోగపడే సంక్లిష్ట పిండిపదార్థాలు తినాలి. అంటే గుడ్లు, ఓట్‌మీల్‌, పెరుగు, రాగిదోశ, గోధుమ రవ్వ ఉప్మా వంటివి ఉదయం అల్పాహారంగా ఎంచుకోవచ్చు.
చాలామంది ఇంట్లో తయారుచేసుకున్న తాజాపండ్లు, కూరగాయల రసాలను అల్పాహార సమయంలో తీసుకుంటూ ఉంటారు. వీటి నుంచి శరీరానికి కావలసిన పీచు పదార్థం లభించదు. కాబట్టి నేరుగా పండ్లు లేదా సలాడ్‌లను అల్పాహారంగా ఎంచుకోవచ్చు. అప్పుడే వాటిలోని పోషకాలు, పీచు అందుతాయి. కడుపు నిండిన భావన కలుగుతుంది.
అలాగే చాలామంది ఉదయం అల్పాహారం అస్సలు తీసుకోరు. కొంతమందైతే వారికి కుదిరినప్పుడు అల్పాహారం తింటారు. ఈ రెండూ శరీరానికి మంచిది కాదు. అంతేకాదు ఇలా చేయడం వల్ల మధ్యాహ్నం భోజనం ఎక్కువగా తినేస్తారు. దీంతో బరువు పెరిగే అవకాశం కూడా ఎక్కువ. కాబట్టి ఆలస్యం చేయకుండా, అసలు మానేయకుండా అల్పాహారం వేళకు తీసుకోవాలి. ఉదయం నిద్ర లేచిన గంట లోపలే ఆహారం తీసుకోవడం మంచిది.
అల్పాహారం అతి ముఖ్యమైనదన్న విషయం తమకు తెలియదని సర్వేలో పాల్గొన్న వారిలో 60 శాతం మంది పిల్లలు అంగీకరించారు. పన్నెండేళ్ల లోపు వయసు పిల్లల్లో దాదాపు 24 శాతం మంది తమకు అల్పాహారం తీసుకునే అలవాటు లేదని స్పష్టం చేశారు. టీనేజీ పిల్లల్లో 32 శాతం మంది అల్పాహారానికి దూరంగా ఉంటున్నట్లు, వీరిలో బాలికలే ఎక్కువగా ఉన్నట్లు సర్వేలో కనుగొన్నారు. చాలా ఇళ్లలో పిల్లలకు పెడుతున్న అల్పాహారంలో 72 శాతం వరకూ అంతగా పోషకాలు ఉండడం లేదని తేలింది. మధ్యాహ్నం, రాత్రి భోజనాల్లో కూడా పిల్లలకు తగినంతగా పోషకాలు అందడం లేదు. పిల్లలకు అల్పాహారంలో కాల్షియం తప్ప మిగతా పోషకాలు అంతగా అందడం లేదు. ఉదయం వేళ పాలు తాగడం అలవాటు కారణంగా కాల్షియం ఓ మోస్తరుగా పిల్లలకు లభిస్తోంది.
అన్ని వయసుల పిల్లలూ ఐరన్‌, పీచు పదార్థాలు, విటమిన్‌-బి, ప్రోటీన్లు, ఖనిజాలు వంటి పోషకాలకు అంతగా నోచుకోవడం లేదు. చాలామంది చిన్నారులకు 25 శాతానికి మించి ప్రోటీన్లు అందడం లేదు. పోషక విలువల సంగతి పక్కన పెడితే, ఆకలి తగ్గడానికి ఏదో ఒకటి టిఫిన్‌గా తినాలన్న ధోరణి మాత్రం ఎక్కువగా కనిపిస్తోంది.
మీకు తెలుసా… ప్రతిరోజూ బ్రేక్‌ఫాస్ట్‌ చేసే వారు, చేయని వారు తీసుకునే కేలరీలు దాదాపుగా సమానమేనని ఓ అధ్యయనంలో తేలింది’ట. అలాగే వారి బరువులో తేడా కూడా కేవలం 400 గ్రాములు మాత్రమేన’ట!
– తరిగొప్పుల విఎల్లెన్‌ మూర్తి, 8008 577 834

Spread the love