గుడ్‌ టచ్‌ బ్యాడ్‌ టచ్‌

ప్రస్తుత సమాజంలో అమ్మాయిలకు ఎటువైపు నుంచి, ఎప్పుడు, ఏ ఆపద వస్తుందో తెలియటం లేదు. ఇలాంటి వాతావరణంలో, తల్లిదండ్రులు తమ పిల్లలకు అనుచితమైన పరిచయం గురించి అవగాహన కల్పించాలి. నేటి ప్రపంచంలో హత్యలకు తోడు లైంగిక వేధింపులు, దాడులు వంటి నేరాలు పెరుగుతున్నాయి. కానీ చాలా తక్కువ సంఘటనలు నమోదు అవుతున్నాయి.

సాధారణంగా చాలామంది పిల్లలకు తాము లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు మొదట్లో తెలియదు. అందుకే పెద్దలే వివిధ రకాల పరిచయాల మధ్య వ్యత్యాసాల గురించి తెలియజేస్తే ఈ లైంగిక వేధింపుల హాని నుండి పిల్లలను రక్షించవచ్చు. ఈ వ్యత్యాసాన్ని పిల్లలకు ముందుగానే పరిచయం చేయడం చాలా ముఖ్యం.
గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌ అంటే ఏమిటి?
వ్యక్తి స్వభావం, పరిస్థితుల ఆధారంగా, గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌ మధ్య తేడాను గుర్తించవచ్చు. మంచి స్పర్శ (గుడ్‌టచ్‌) అనేది సానుకూల, సముచితమైన శారీరక సంబంధాన్ని సూచిస్తుంది. చెడు స్పర్శ (బ్యాడ్‌టచ్‌) అనుచితమైన అసౌకర్యమైన శారీరక సంబంధాన్ని కలిగి ఉంటుంది. స్పష్టమైన ఉదాహరణలతో చెప్తే పిల్లలు స్పర్శలోని బేధాన్ని అర్థం చేసుకోగలరు. కుటుంబ సభ్యులు, స్నేహితుల నుండి హై-ఫైవ్‌లు, కౌగిలింతలు, వైద్య పరీక్షల సమయంలో సున్నితమైన స్పర్శ భద్రతాభావాన్ని కలిగిస్తుంది. నమ్మకమైన వ్యక్తుల నుండి ఆప్యాయత మంచి స్పర్శకు ఉదాహరణ. పిల్లలకి అసౌకర్యంగా వున్నా, బలవంతంగా తాకినా అది చెడు స్పర్శకు ఉదాహరణ.
చెడు స్పర్శ గురించి అవగాహన కల్పిస్తే పిల్లలకు ఎవరితో ఎలా ఉండాలో తెలుస్తుంది. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో రెండింటి మధ్య తేడాలను పిల్లలు గుర్తించలేకపోవచ్చు. బ్యాడ్‌టచ్‌ ఎప్పుడూ అపరిచితుల నుండి మాత్రమే కాదు, కుటుంబ సభ్యులు, సన్నిహితులలో కూడా అలాంటి ప్రవర్తన ఉంటుంది. ఉదాహరణకు పేరెంట్స్‌ సోదరులు (కొంతమంది) కౌగిలించుకుంటే అది బ్యాడ్‌టచ్‌ కాదని అనిపించవచ్చు. అయితే, ఆ కౌగిలింత ఎక్కువసేపు ఉండి, వారు తమ చేతులను శరీరంపై ఎక్కడ పడితే అక్కడ వింతగా కదుపుతున్నట్లో, శరీరంలోని ప్రైవేట్‌ పార్ట్స్‌ని తాకినట్లు అనిపిస్తే అది చెడు స్పర్శ. బాగా తెలిసిన, నమ్మకమున్న వ్యక్తి లైంగికంగా వేధిస్తున్నారని గ్రహించడం, అంగీకరించడం కష్టంగా ఉండవచ్చు. అయితే గ్రహించగలగడం ముఖ్యం.
పిల్లలకు విద్యాబోధన: అవగాహన లేకపోతే చిన్నతనంలో నమ్మకమున్న వ్యక్తుల నుండి ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు గుర్తించడం కష్టం. పిల్లల్లో ఈ బ్యాడ్‌టచ్‌, గుడ్‌టచ్‌ల గురించి తెలిసినప్పుడు అనేక మార్గాల్లో రక్షణ పొందుతారు.
మంచి స్పర్శ, చెడు స్పర్శ గురించి పిల్లలకు బోధించడం ద్వారా అనుచితమైన శారీరక సంబంధాల మధ్య తేడాను గుర్తించడం నేర్చుకుంటారు. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటారు. హానికరమైన వ్యక్తుల నుండి, ప్రదేశాల నుండి వారిని వారు రక్షించుకునే అవకాశం ఉంది.
బ్యాడ్‌టచ్‌ చేసేవారు ఎవరైనా సరే, వారి చేష్టలకు ఒకసారి మౌనం వహిస్తే… వేరే వారు కూడా దాన్ని అవకాశంగా తీసుకునే శక్తి వస్తుంది. అందుకే చెప్పడం, మాట్లాడటం ముఖ్యం.
సమాజం తీర్పు కొన్నిసార్లు ధైర్యంగా మాట్లాడే వ్యక్తులను కూడా నిశ్శబ్దం చేయిస్తుంది. పరిణామాలతో సంబంధం లేకుండా ఏదైనా తప్పు జరిగిందనిపిస్తే తప్పనిసరిగా మాట్లాడాలని పిల్లలకు చిన్న వయస్సులోనే చెప్పాలి.
తల్లిదండ్రుల పాత్ర: పిల్లలకు గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌ గురించి అవగాహన కల్పించడంలో తల్లిదండ్రులదే కీలక పాత్ర. తల్లిదండ్రులు తమ పిల్లలతో ఓపెన్‌గా మాట్లాడే వాతావరణాన్ని కల్పించాలి. అది పిల్లల శరీరానికి సంబంధించినదైనా, భయాందోళలైనా సరే… స్వేచ్ఛగా వ్యక్తీకరించడం నేర్పించాలి. తల్లిదండ్రులు ఈ అంశంపై సున్నితమైన పద్ధతిలో చెప్తే పిల్లలు అర్థం చేసుకోగలరు. అనుచితమైన పరిచయం గురించి పిల్లలకు నేర్పడం నేటి సంస్కతిలో కీలకమైనది. వివిధ రకాల పరిచయాల మధ్య వ్యత్యాసాల గురించి అవగాహన ఉన్న పిల్లలు మరింత భద్రతగా ఉన్నట్లు భావిస్తారు.

– డా|| హిప్నో పద్మా కమలాకర్‌, 9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌, హిప్నో థెరపిస్ట్‌

Spread the love