రిటైర్డ్‌… బట్‌ నాట్‌ టైర్డ్‌

మా పట్టణంలోని ఓ కాలేజీ ప్రిన్స్‌పాల్‌గారు రిటైర్‌ అవుతున్న సందర్భంలో ఆ కాలేజీ డెవలప్‌మెంట్‌ కమిటీవారు ఓ సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఆ సభకు నన్ను విశిష్ట అతిథిగా రావాలని ఆహ్వానం పంపారు. మరుసటి రోజు జరిగే సభకు హాజరవడానికి వెళ్లాను. నన్ను చూసిన డెవలప్‌మెంట్‌ కమిటీ సభ్యుడు ప్రిన్స్‌పాల్‌ గదికి తోడ్కొని వెళ్లి అక్కడున్నవారికి పరిచయం చేశాడు.
ఇదివరకే ప్రిన్స్‌పాల్‌ గారిని చూడడంతో నమస్కారం పెట్టి అక్కడున్న కుర్చీలో కూర్చోబోయే ముందుగా అక్కడున్న వారిలో కొందరిని నేనెరుగుదును. అందరితో కరచాలనం చేశాను. వారిమాటల్లో పొల్గొని, సుమారు అరగంట గడిచాక ఒకరు మమ్మల్ని వేదిక ముందుకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. వేదిక మీద తెలుగులో పదవీ విరమణ చేస్తున్న ప్రిన్స్‌పాల్‌ గారి సన్మాన సభ అనే బ్యానర్‌ కూర్చీల వెనుక తెరపై కనిపించింది. కాలేజీ డెవలప్‌ కమిటీ చైర్మన్‌ను సభాధ్యక్షునిగా ఆహ్వానించి, మిగతా అతిథులను వేదిక పైకి పిలిచాడు. నన్ను పిలవగానే వెళ్లి కేటాయించిన సీట్లో కూర్చున్నాను.
అధ్యక్షుడు ఒక్కొక్కరిని ప్రసంగించవలసిందిగా పిలుస్తూ వుంటే వారు వెళ్లి ప్రిన్సిపాల్‌ గురించి చెప్పారు. నన్ను పిలిచారు. నేను మైకు ముందు నిలబడి ”వెంకట్రామయ్యగారు, గత నాలుగు సంవత్సరాల క్రితం ఈ కళాశాలకు ప్రిన్స్‌పాల్‌గా వచ్చారు. వచ్చీరాగానే ఆయన అడ్మినిస్ట్రేషన్‌ను వ్యవస్థీకరించి, అకడమిక్‌ వైపు దృష్టి సారించారు. ఎంజారుమెంట్‌ అనుకుని వచ్చే స్టూడెంట్స్‌ను అన్ని క్లాసులకు హాజరై క్రమశిక్షణగా పాఠాలు వినేటట్టు చక్కదిద్దారు. విద్యార్ధుల సర్వతోముఖాభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటూ, వారి భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా స్థాయిలో ఈ కళాశాలకు మంచి పేరు తెచ్చారు.
వెంకట్రామయ్యగారు తన రిటైర్‌మెంట్‌ జీవితాన్ని ఏదైనా నిర్మాణాత్మక పనిలో గడుపుతూ శేషజీవితాన్ని ఆనందమయంగా గడుపుతారని కోరుకుంటూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నా”నంటూ కూర్చున్నా.
నేనే చివరిగా మాట్లాడడంతో సభాధ్యక్షుడు ప్రిన్స్‌పాల్‌ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానించారు. ప్రిన్స్‌పాల్‌ గారు… ”మిత్రుడు చెప్పింది నిజమే! నేను ఈ కళాశాలకు ప్రిన్స్‌పాల్‌గా వచ్చేనాటికి కాలేజీ అంతా అదోవిధంగా వుంది. నేను అడ్మినిస్ట్రేషన్‌ సరిచేయడానికి ఆరు నెలలు పట్టింది. కాలేజీలోని ఏ డిపార్ట్‌మెంటూ సరిగా లేదు. వాటిని సరిచేయడానికి మరో ఆరు నెలలు పట్టింది. ఆ తరువాత లెక్చరర్స్‌, స్టూడెంట్స్‌పై దృష్టి పెట్టి సరిచేయడానికి సంవత్సరం పట్టింది. మిగతా సమయమంతా విద్యార్థుల భవిష్యత్తు కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాను. అందుకు కాలేజీ డెవలప్‌మెంట్‌ కమిటీ వారు తగు తోడ్పాటునందించారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను” అని చెప్పి ఆగి, ‘అయామ్‌ రిటైర్డ్‌. బట్‌ నాట్‌ టైర్డ్‌’ అంటూ ఆంగ్ల భాషలో స్పూర్తిదాయకంగా ఉపన్యసించమొదలు పెట్టారు. ఆయన ఉపన్యాసమే ఈ నా వ్యాసానికి ప్రేరణ అయింది.
పరవీవిరమణను సాధారణంగా విసుగు, నిస్సాహయతగా భావిస్తూ జీవితానికి ముగింపుగా చాలామంది భావిస్తుంటారు. ఇది అపోహ మాత్రమే! జీవితంలో పదవీ విరమణ జీవితాన్ని మరో దిశకు తిప్పడానికి నాంది అని అనుకోవాలి. రిటైర్‌మెంట్‌ తర్వాత సంతృప్తికరంగా శేష జీవితం గడపడానికి, ఎప్పట్నుండో చేయాలనుకునే పనులు ఎంపిక చేసుకోడానికి సరైన సమయంగా భావించి వ్యూహాత్మకంగా సమయాన్ని మలుచుకుని గడప ప్రయత్నిస్తే ఎవరూ పదవీ విరమణను విసుగూ నిస్సాహాయంగా భావించరు.
ఈ మధ్య సైకాలజిస్టులు, రిటైర్‌ అయిన వారి మీద అనేక పరిశోధనలు చేసి వాటి ఫలితాలను ఈ విధంగా ఉన్నట్లు తెలుపుతున్నారు… ప్రతి ముగ్గురు పదవీ విరమణ చేసినవారిలో ఒకరు నిరాశకు గురవుతున్నారు. రిటైర్‌ అయిన ప్రతి ఆరుగురిలో ఒకరిద్దరు పదవీ విరమణ తరువాత సమయం ఎలా గడపాలో తెలియక మళ్లీ ఉద్యోగం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు.
జీవితం అనే ఆటలో రిటైర్‌మెంట్‌ అనేది సెకండ్‌ ఇన్నింగ్‌ అంటారు. బి.కె.ట్రెహాన్‌, ఇందూ ట్రెహాన్‌ కలిసి రాసిన ‘రిటైర్డ్‌ బట్‌ నాట్‌ టైర్డ్‌’ అనే పుస్తకం చివరలో ‘మీరు ఉద్యోగంలో వుంటూ తీరిక సమయంలో ఆటవిడుపుగా ఏ అభిరుచి, హాబీతో ఆనందంగా గడిపేవారో దాన్నే పూర్తి సమయంగా గడప ప్రయత్నిస్తూ పదవీ విరమణ తరువాత కాలం అర్ధవంతంగా చివరి శ్వాస వరకు గడుపుతూ సంతృప్తికరంగా లోకానికి గుడ్‌బై చెప్పవచ్చు’ అంటారు. వారు చెప్పినదాన్ని సానుకూలంగా వుండే పనులు అని అర్ధం చేసుకోవాలి. కొందరికి పేకాట లేదా మద్యపానంతో ఉద్యోగ సమయంలో ఆనందం అనుభవించేవారు దాన్నే ఆచరించమని కాదు. కొందరు ఉద్యోగం చేసేటప్పుడు సంగీతం, చిత్రలేఖనం, కవితలు రాయడం, రచనలు చేయడం వంటి అభిరుచులతో తమ తీరిక సమయాన్ని అర్ధవంతంగా గడుపుతుంటారు. రిటైర్‌ అయిన తర్వాత వాటినే కొనసాగిస్తే శేష జీవితం ఆనందమయంగా సాగుతుందని ఆ రచయితల అభిప్రాయం.
నా స్నేహితుడొకాయన రిటైరైన ఆరు నెలల లోపు కన్ను మూశాడు. అతని మరణం గురించి మరో స్నేహితునితో వాకబు చేయగా… ”రిటైరైన ఆరు నెలల లోపే మరణించిన వ్యక్తి ఏమి చేయాలో తోయక భార్యతో, కొడుకుతో, కోడలితో ప్రతి చిన్నవిషయానికి అరుస్తూ, తగవులాడేవాడు. ఇరుగుపొరుగు వారితో కూడా అలాగే ప్రవర్తించేవాడు. తను చేయగలిగే పనిని కూడా కొడుకును చేయమని పట్టుబట్టేవాడు. ఎప్పుడూ పడకనే అంటిపెట్టుకుని వుండేవాడు. ఇంటి సభ్యులతో ఎప్పుడూ ప్రేమగా మాట్లాడేవాడు కాదని చెపుతూ, గుండెపోటు కారణంగా మరణించినట్లు చెప్పాడు. ఆయన చేసిన పనులన్నీ భావావేశంతో ఆందోళనలను, ఒత్తిడిని పెంచేవే. వీటి కారణంగా ఆయన హార్ట్‌ఎటాక్‌తో మరణించాడని అర్ధం చేసుకున్నాను.
అందుకే పదవీ విరమణ తరువాత కాలం ప్రశాంతంగా గడప ప్రయత్నించమంటారు సైకాలజిస్టులు. ప్రొఫెసర్‌ కల్లూరి సుబ్బారావు, ‘రిటైర్‌మెంట్‌ జీవితంలో ఒక మజిలీ మాత్రమే. ఇది తెలుసుకుని పరిస్థితులకనుగుణంగా ప్రవర్తించే అలవాటు పడితే అరవై ఏళ్ల వయసులో కూడా ఇరవై ఏళ్ల వయసువారిలా సంతోషంగా వుంటే ఏ రోగం, నొప్పి లేకుండా అబ్దుల్‌ కలాం గారిలా 80 ఏండ్లకు పైబడి జీవించవచ్చు. సహనం కలిగుండి, ప్రేమ, ఆప్యాయతలకు ప్రాధాన్యమిస్తుంటే ఎలాంటి ఒత్తిడి, డిప్రెషన్‌కు లోను కాకుండా వుండే వీలుంటుంది’ అంటారు.
‘ప్రాణం వున్నంత వరకు జీవితం పట్ల కాంక్ష ఉండాలి. ఈ అపురూపమైన జన్మలో ప్రతి క్షణం జీవం తొణికిసలాడాలి. ఆశలు, కోరికలు, ఊహలతో గడిచిన ప్రతిక్షణం కొత్త రెక్కలు తొడగాలి. అప్పుడే జీవిత చరమాంకం హాయిగా సాగిపోతుంటుంది’ అంటాడు ఓ అభ్యుదయ కవి.
రిటైర్‌మెంట్‌ అయినవారు కూడా ఓ లక్ష్యం ఏర్పరచుకుని ఆ దిశలో పయనించినట్లయితే ఎప్పుడూ నిరాశ, నిస్పృహకు లోను కారు.
సైకాలజిస్ట్‌ అబ్రహం మాస్లో కూడా స్వీయజ్ఞానంతో ఏర్పరచుకున్న లక్ష్య సాధనతో మనిషి ఎక్కడలేని ఆనందానుభూతులు పొందగలడు. వయసు మళ్లినవారు లక్ష్యం కోసం అదేపనిగా ఆలోచించడం వల్ల మనసు ఏకాగ్రత సాధిస్తుంది. ఏ వ్యాధీ వారిని దరిచేయ సాహసించదు అంటాడు.
అమెరికన్‌ కమెడియన్‌ బాబ్‌హేప్‌ అనే ఆయన వంద సంవత్సరాలకు పైబడి జీవించాడు. ఆయన బతికున్నప్పుడు పత్రికా విలేకరులు ఇంటర్వ్యూలో… ఆయన ‘రెండో ప్రపంచ యుద్ధం కాలంలో తనవంతుగా సైనికులకు ఏమైనా చేయాలని ఆలోచించి, వారిని సంతోషపెట్టడానికి హాస్యంగా మాట్లాడ్డం మొదలుపెట్టారట. అదే అలవాటుగా సైనికులను యుద్ధ వాతావరణం నుండి బయటకు తీసుకురావడానికి అభినయంతో నవ్వించడం మొదలుపెట్టాడట. ఇలా అనేక చోట్ల చేయడంతో ఆయనకు నటనా చాతుర్యం అలవాటై అనేక సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయట. ఆయన వందేళ్ల వయసు పూర్తి చేసుకుని 2003 సంవత్సరంలో తనువు చాలించాడు.
వింజమూరి అనసూయాదేవి (1920-2019) గారి గొంతు ఎనిమిదేళ్ల ప్రాయంలో మొదలై దాదాపు 90 ఏళ్ల వయసు వరకు అలసిపోకుండా మధుర స్వరాలను పలికించిందట.
జీవితంలో ఏర్పరచుకున్న లక్ష్యంలో ఎందరో మహానుభావులు జీవితాంతం వాటినే కొనసాగిస్తూ చరిత్ర సృష్టించారు.
చాలామంది ఉద్యోగ విరమణ తరువాత విశ్రాంతి అనే ఆలోచనలో వుంటారు. ఏ పని గురించి ఆలోచన చేయని మెదడు శక్తిహీనమవుతుందంటారు మనోవైజ్ఞానికులు. ఆలోచనల్లోకి దిగితే మెదడులోని న్యూరాన్లు చైనత్యమవుతాయి. అందుకే ఆరోగ్యం మీద స్పృహ వున్న రిటైరైన వారు ఇంట్లో గోళ్లు గిల్లుకుంటూ కూర్చోకుండా ఏదైనా కొత్త విషయం మీద శ్రద్ద చూపుతారు. వృద్ధాప్యంలో మెదడు తన పటుత్వం కోల్పోతుందని చాలామంది తప్పుడు అభిప్రాయం కలిగుంటారంటారు సైకాలజిస్టులు. నిజానికి మెదడుకు ఏ పని చెప్పనప్పుడే దాని వేగం తగ్గుతుందట.
డా||అబ్దుల్‌ కలాం గారు తను రిటైరైన తరువాత వీణ వాయించడం నేర్చుకుని అందులో కొంత ప్రావీణ్యం సంపాదించారని అయనతో ఎప్పుడూ వెంటవుండేవారు చెపుతారు.
ఎప్పుడూ నవ్వుతూ నవ్వించడం వల్ల అనేక వ్యాధులు దూరమవుతాయని అంటారు అనుభవజ్ఞులు. అందుకే నవ్వడం ఒక భోగం… నవ్వించడం ఒక యోగం.. నవ్వకపోవడం ఒక రోగంగా చెపుతుంటారు. నవ్వు నాలుగు విధాల చేటు అనే సామెత ఏ నేపధ్యంలో పుట్టిందో కాని జీవితంలో స్వయంగా నవ్వుతూ, ఇతరులను నవ్వించలేకపోతే అనేక మానసిక సమస్యలకు గురికావడం తధ్యం అంటాయి పరిశోధనలు. అందుకే రిటైరైనవారు ఒత్తిళ్లతో నలగకుండా సరదాగా సమయం గడపడం మానసిక ఉల్లాసానికి చాలా మంచిదని అనేక పరిశోధనలు చెబుతున్నాయి.
2006 వ సంవత్సరంలో మెదడు ప్రవర్తన, రోగనిరోధకత మధ్య పరస్పర చర్యను పరిశోధించిన పరిశోధకులు, ఆనందకరమైన నవ్వొచ్చే విషయాల్ని ఊహించుకోవడం ద్వారా కూడా ఆరోగ్యాన్ని రక్షించే హార్మోన్లను పెంచుకోవచ్చని కనుగొన్నారు.
రిటైరైన భమిడిపాటి రామగోపాలం అనేక కుటుంబ బాధలు అనుభవిస్తూ, ఏదో జబ్బు కారణంగా రెండు కాళ్లు పనిచేయకుండా పోయినప్పుడు కూడా మంచం మీద పడుకుని సైతం నవ్వించే రచనలు చేస్తూ కష్టాలన్నీ శరీరానికే కాని మనసుకు మాత్రం కాదని చెబుతూ ‘బొందిలో ప్రాణమున్నంత వరకు జీవితాన్ని జుర్రుకోవాల్సిందే’ అన్నారు. ఆయన విశాఖపట్నం ఓడరేవులో ఉద్యోగిగా రిటైరయ్యారు.
పదవీ విరమణ చేసిన ఆడైనా, మగైనా జీవించి వున్నంత వరకు సానుకూల ఆలోచనలతో నిర్మాణాత్మకంగా గడప ప్రయత్నించినప్పుడు ఎప్పుడూ నిరాశ, నిస్పృహలకు లోనుకారని మనోవైజ్ఞానికులు చెబుతారు.
ఉద్యోగంలో ఉన్నంత వరకు వృత్తిధర్మాన్ని ఆచరించి, రిటైరైన తర్వాత అలసట చెంది, కొంత సమయాన్ని వారి మతాలకనుగుణంగా ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొనడం, లేదా హాబీలను పూర్తిస్థాయిలో కొనసాగించడం వల్ల జీవితం ప్రశాంతంగా గడపవచ్చని కొందరి అభిప్రాయం.
సినీరంగంలో సాగింరాజు ముక్కురాజుగా ప్రసిద్దుడు. ఆయన ఎన్టీయార్‌ గారికి తొలి డాన్స్‌ మాస్టర్‌ అంటారు. ముక్కురాజు తన ఎనభైఏండ్ల వయసులో కూడా నడుంకు కండువా బిగించి మీసం తిప్పుగూ ఎర్ర సినిమాల్లో నృత్యం చేశాడు. అందుకే వయసనేది శరీరానికే కాని మనసుకు కాదనే భావన గలవారు రిటైరైనా ఐయామ్‌ నాట్‌ టైర్డ్‌ అంటారు.

– పరికిపండ్ల సారంగపాణి,
9849630290, కౌన్సిలింగ్‌ సైకాలజిస్ట్‌,

Spread the love