కాలం గుట్టును విప్పి చెప్పిన పాట

కాలం మాయ చేస్తుంది. అపుడే మనల్ని పడదోస్తుంది. వెంటనే లేవదీస్తుంది. మన మీద మనకు భరోసా ఇచ్చినట్టే ఇచ్చి, మన మీద మనకే నమ్మకం లేకుండా చేస్తుంది. కాలం నాడిని పట్టుకుని మసలుకున్నవాడే, నడుచుకున్నవాడే చరిత్రలో నిలబడతాడు. లేకుంటే అడ్రస్‌ లేకుండా పోతాడు. అలాంటి కాలం గుట్టును పసిగట్టి జాగ్రత్తగా అడుగులు వేయమని, అనుకున్న లక్ష్యాన్ని చేరుకొమ్మని చెబుతూ సేనాపతి భరద్వాజ పాత్రుడు రాసిన పాటనిపుడు చూద్దాం.
అద్భుతమైన పాటలను వెండితెరపై వెలిగించిన సినీకవి సేనాపతి భరద్వాజ పాత్రుడు. ఎలాంటి పాటైనా అవలీలగా రాయగలడు. తన పదాలతో మనల్ని ఆకట్టుకోగలడు. 2020లో వినోద్‌ అనంతోజు దర్శకత్వంలో వచ్చిన ‘మిడిల్‌ క్లాస్‌ మెలోడిస్‌’ సినిమాలో ఓ గొప్ప పాటను రాశాడు. ఆ పాట విన్న ప్రతి మనిషి ఇది తన కోసమే రాశాడా అని అనుకోక తప్పదు. ఆ పాట ప్రతి మనిషిని తట్టిలేపేలా ఉంటుంది. ప్రతి మనిషి తన మనసును తాను ప్రశ్నించుకునేలా ఉంటుంది.
సినిమాకథ పరంగా చూస్తే.. హీరో తాను బొంబాయి చెట్నీ బాగా చేయగలనని, అందరినీ బాగా మెప్పించగలనని, కాబట్టి సొంతగా హోటల్‌ పెట్టుకోవాలని అనుకుంటాడు. తాను పనిలోకి దిగితే వ్యాపారం బాగా నడవగలదన్న నమ్మకం అతనికి ఉంటుంది. తాను సాధించి తీరగలనన్న అత్యుత్సాహమూ ఉంటుంది. తనమీద తనకు నమ్మకం ఉండడం వేరు. కాని అతను తనను తాను ఎంతో గొప్పగా ఊహించుకోవడంలో ఎంతో గర్వమూ కనబడుతుంది. అలా.. వ్యాపారాన్ని ప్రారంభించి తొలి అడుగులోనే దెబ్బ తింటాడు. అప్పుడు కాలం గారడిలో అతని జీవిత ప్రయాణం ఎలా మలుపు తిరిగిందో ఈ పాట ద్వారా చెప్పబడింది.
కాలం మంచిదో, చెడ్డదో తెలియదు. ఎప్పుడు ఎలా ఉంటుందో మనం ఊహించలేం. అప్పుడే మనకు అనుకూలంగా ఉంటుంది. ఆ తరువాత ప్రతికూలంగా మారిపోతుంది. కాలం ఎటువంటిదో అంతు చిక్కడం లేదు. మనతో స్నేహం చేస్తుందో, పగబట్టి యుద్ధానికి దారితీస్తుందో అర్థం కావడం లేదు. దాని అసలు పేరేంటో లెక్క తేలడం లేదన్న సందేహాన్ని స్పష్టపరుస్తాడు. ఏం చేయాలో తోచని సందిగ్ధావస్థలో హీరో ఉంటాడు. తానే గొప్పవాడనుకుంటాడు. కాని తనకంటే బాగా పనిచేయగల సమర్థులను చూశాక అతనిలోని అహంకారం సొమ్మసిల్లిపోతుంది. ఆత్మవిశ్వాసం సన్నగిల్లిపోతుంది.
కాలం ముళ్ళమార్గాన నడిపిస్తుంటుంది. ఓపికతో ఎదురు చూస్తుంటే రహదారి వైపు మనల్ని మళ్ళిస్తుంది. మంచి అవకాశాల్ని కూడా అందిస్తుంది. చిక్కు ప్రశ్నలతో మనల్ని ఉక్కిరి బిక్కిరి చేసే కాలం మనకు సమాధానమై కనబడే రోజూ వస్తుంది. వేచి ఉండే సహనం మనం అలవాటు చేసుకోవాలి. అసహనంతో పరుగులు తీస్తే పడిపోక తప్పదని చెబుతున్నాడు కవి.
మనసులో చిరునవ్వు పుట్టాలే గాని బాధ దానంతటదే వెనుదిరిగి వెళ్ళిపోతుంది. కాని కష్టాల్లో కూడా చిరునవ్వుతో నడుచుకోగల ధైర్యం మనకు ఉండాలన్నది కవి ఇచ్చిన సందేశం. అర్ధరాత్రి అలుముకున్న చీకటి నిన్ను భయపెట్టవచ్చు. నీపై కక్ష కట్టవచ్చు. కాని తొందరనే ఉదయం వస్తుంది. వెలుతురును తెస్తుంది. చీకటి అలిమినా ధైర్యంతో నిలబడగలగాలి. ఎదుర్కోగలగాలి. అదే మనిషి చేయాల్సిన పని. మన భవిష్యత్తు చేతిరేఖల్లో కనబడదు. మన ఆలోచనలు, మన దృష్టి గతాన్ని వదిలేసి వస్తే చాలు. మన భవిష్యత్‌ మనకు స్పష్టంగా కళ్ళముందు కనబడుతుంది. దారి లాగా మన కాళ్ళ ముందు నిలబడుతుంది. నేను కష్టాల్లో ఉన్నా.. నన్ను ఎవరూ ఓదార్చడం లేదన్న ఆలోచనే మనకు రావొద్దు. ఎవరి సహాయం కోసం ఎదురు చూడొద్దు.
బాధలన్ని మేఘాలవంటివి. వస్తుంటాయి. పోతుంటాయి. ఆకాశంలాగా చివరిదాకా అలాగే ఉండిపోవు. ఆకాశం జీవితమైతే కష్టాలు మేఘాలవంటివి. నీకు లెక్కలేనన్ని సమస్యలు ఉన్నా నీలోపల ఉన్న ధైర్యం మాత్రం అంతం కారాదు. అంటే.. ధైర్యాన్ని కోల్పోకుండా నువ్వుండగలిగితే చాలు. అదే మనకు ఆయుధం, కవచం. జీవితం సముద్రం లాంటిది. ఎదురీదే లక్షణం తెలిసి ఉండాలి. లేకపోతే మునిగిపోక తప్పదు. పడిపోవడం పొరపాటు కాదు. పడినా లేచే గుణం ఉండాలి. అలా ఉంటే పడిపోయినా తప్పేం కాదు.
సముద్రంలో అలలు ఆగేటి రోజు ఉండదు. అలలు ఆగాక నడుద్దామంటే కుదరదు. ఎటువంటి సమస్యవచ్చినా ఎదురీదాలి. మునుముందుకెళ్ళాలి. కాని ఆలోచించి జాగ్రత్తగా అడుగువెయ్యాలి. మనం చూసిందే నిజమని అనుకుంటే కుదరదు. ఏదో రోజున మన కళ్ళకున్న గంతల్ని తీసేసి అసలు వాస్తవాన్ని మనకు చూపిస్తుంది కాలం. అప్పటిదాకా మనమేంటో మనం ఎలా ఉన్నామో మనకు తెలుస్తుంది. ఇకపైన ఎలా ఉండాలో కూడా కాలం తెలియజేస్తుంది. దెబ్బతిన్న తరువాతైనా, కిందపడ్డ తరువాతైనా కమ్ముకున్న భ్రమలన్నీ మాయం కావాలి. నిజం తెలియాలి. సాధించి తీరాలని ఈ పాట ద్వారా గొప్ప సందేశాన్నిచ్చాడు సేనాపతి భరద్వాజ పాత్రుడు.

పాట:
మంచిదో చెడ్డదో రెంటికి మధ్యదో/
అంతు చిక్కలేదా కాలమెటువంటిదో/
కయ్యమో నెయ్యమో ఎప్పుడేం చెయ్యునో/
లెక్క తేలలేదా దాని పేరు ఏమిటో?/
ముళ్ళు ఉన్న మార్గాన నడిపేటి కాలం/
వేచియుంటే రాదారి చూపించదా?/
చిక్కుప్రశ్న వేసేటి తెలివైన కాలం/
తప్పకుండ బదులై రాదా?/
మదిలోని చిరునవ్వు జన్మించగా
కలతేపోదా కనుమూయదా!/
నడిరేయి దరిచేరి మసిపూయగా
వెలుగేరాదా చెరిపేయదా?/
అరచేతిరేఖల్లో లేదంట రేపు/
నిన్నల్ని వదిలేసి రావాలి చూపు/
చూడొద్దు ఏదంటూ ఓదారుపు/
వచ్చిపోయె మేఘాలే ఈ బాధలన్నీ/
ఉండిపోవు కడదాకా ఆ నింగిలా/
అంతమైతే కారాదు లోలోని ధైర్యం/
అంతులేని వెతలే ఉన్నా/
సంద్రాన్ని పోలింది ఈ జీవితం/
తెలిసే తీరాలి ఎదురీదడం/
పొరపాటు కాదంట పడిపోవడం/
ఉండాలోరు లేచే గుణం/
ఎటువంటి ఆటంకమెదురైన గాని/
మునుముందుకెళ్ళేటి అలవాటు మాని/
కెరటాలు ఆగేటి రోజేదని/
గంతలన్ని ఓనాడు తీసేసి కాలం/
వాస్తవాన్ని కళ్ళారా చూపించదా!/
కమ్ముకున్న భ్రమలన్ని కావాలి మాయం/
కిందపడ్డ తరువాతైనా..

– డా||తిరునగరి శరత్‌చంద్ర,
[email protected]

Spread the love