రేవంతే టీపీసీసీ చీఫ్‌

పార్లమెంటు ఎన్నికల తర్వాతే– పార్లమెంటు ఎన్నికల తర్వాతే
– కాంగ్రెస్‌కు నూతన సారథి

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కాంగ్రెస్‌ అధ్యక్షులు ఎనుముల రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక… టీపీసీసీ నూతన రథసారధి ఎవరవుతారనే చర్చ మొదలైంది. పార్లమెంటు ఎన్నికల తర్వాతే టీపీసీసీ అధ్యక్షున్ని అధిష్టానం నియమిస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. రేవంత్‌ సారధ్యంలోనే పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయని తెలిపాయి. ఏఐసీసీ అధిష్టానం కూడా పార్లమెంటు ఎన్నికల వరకు అధ్యక్షున్ని మార్చేది లేదని తేల్చి చెప్పినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి తర్వాత సమర్థవంతమైన నాయకుడెవరు? అనే చర్చలు సాగుతున్నాయి. ఏ సామాజిక తరగతికి ఇస్తారు? అనేది కూడా చర్చనీయాంశమవు తున్నది. గతంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆ పదవిలో ఉండగా, ఇప్పుడు రేవంత్‌రెడ్డి కొనసాగుతున్నారు.గతంలో ఆ పదవి ఆశించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కీలక నేతలంతా ప్రస్తుతం రాష్ట్ర మంత్రు లయ్యారు. కీలకమైన నేతలందరికీ మంత్రి పదవులు దక్కాయి. మరో ఆరుగురికి మంత్రు లయ్యే అవకాశం ఉన్నది. ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, రంగారెడ్డి, హైదరా బాద్‌ జిల్లాలకు ఇప్పటివరకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దక్కలేదు. అక్కడి నుంచి సీనియర్‌, జూనియర్‌ నేతలకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కీలకమైన నేతలు మంత్రి పదవుల్లో ఉంటే, మిగిలిన నేతలకు టీపీసీసీ పదవి దక్కే అవకాశం ఉన్నట్టు పార్గీ వర్గాలు చెప్పాయి. ఈసారి బీసీ సామాజిక తరగతికి పెద్ద పీట వేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంటు నియోజకవర్గానికి రెండు చొప్పున మొత్తం 34 సీట్లు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో మారిన పరిస్థితుల్లో బీసీలకు 24 సీట్లు మాత్రమే దక్కాయి. దీంతో పార్టీలో ఆ సామాజికతరగతికి చెందిన కీలకమైన నేతలు కొంత అసంతృప్తి చెందుతున్నారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్ష పదవిని ఆ తరగతికి చెందిన నేతలకు ఇచ్చే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతున్నది. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార ్‌గౌడ్‌, మధు యాష్కీగౌడ్‌, ఓబీసీ జాతీయ నేత కత్తి వెంకటస్వామిగౌడ్‌తోపాటు మరి కొంత మంది నేతలు ఈ పదవిని ఆశిస్తున్నారు. మధుయాస్కీగౌడ్‌ రెండుసార్లు ఎంపీగా, ఒక్కసారి ఎమ్మెల్యేగా ఓడిపోయారు. అయితే ఆయనకు జాతీయ నేతల మద్దతు ఉన్నది. ఎన్నికల సమీకరణాల రీత్యా మహేష్‌కుమార్‌, కత్తివెంకటస్వామికి ప్రతిసారీ టికెట్లు దక్కడం లేదు. పార్టీ బలంగా ఉంటేనే ప్రభుత్వ పథకాలు కూడా అంత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అందుకు పార్టీపై పూర్తి పట్టు కలిగి ఉండటం, పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్ట పరచడం చేయాల్సి వుంటుంది. టీపీసీసీ అధ్యక్షులుగా ఎన్నికయ్యే నేత అటు ప్రభుత్వాన్ని, ఇటు పార్టీని సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈపరిస్థితుల్లో ఎవరివైపు అధిష్టానం మొగ్గు చూపుతుందో వేచిచూడాల్సిందే.

Spread the love