ఆరెస్పీయే కాబోయే సీఎం

ఆరెస్పీయే కాబోయే సీఎం– రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలు
– ఆ మూడు పార్టీలు సంపన్న వర్గాల కోసమే..
– తెలంగాణలో అధికారంలోకి వచ్చేది మేమే..: సూర్యాపేట సభలో బీఎస్పీ జాతీయ అధ్యక్షులు మాయావతి
నవతెలంగాణ-సూర్యాపేట
తెలంగాణలో రాబోయేది బీఎస్పీ సర్కారేనని బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) జాతీయ అధ్యక్షులు మాయావతి ధీమా వ్యక్తం చేశారు. ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమారే కాబోయే ముఖ్యమంత్రి అని తెలిపారు. సూర్యాపేటలోని గాంధీనగర్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఎస్పీ అభ్యర్థి వట్టెజానయ్య యాదవ్‌ విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం జరిగిన బహిరంగసభను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. దేశంలో కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ సంపన్న వర్గాల కోసం పనిచేస్తున్నాయని, కానీ బీఎస్పీ మాత్రం బహుజన వర్గాల కోసం ప్రజల విరాళాలతో నడుపబడుతున్న ఏకైక పార్టీ అని తెలిపారు. తెలంగాణలో అత్యంత అవినీతి ప్రభుత్వం ఉందని, శాంతి భద్రతలు క్షీణించా యని, ఈ ప్రభుత్వానికి ప్రజల సమస్యలు పట్టవని.. భ్రష్టాచార్‌ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించాలన్నారు. ఉత్తరప్రదేశ్‌ మాదిరి తెలంగాణలో కూడా బహుజన సమాజ్‌ పార్టీని ఆదరించాలని కోరారు. అంబేద్కర్‌కు భారతరత్న ఇవ్వకుండా కాంగ్రెస్‌ అవమానించిందన్నారు. మహిళా కోటాలో ఎస్సీ, ఎస్టీ కోటా ఉండాలని.. మొదటి నుంచి బీఎస్పీ ఈ విషయం చెప్తోం దన్నారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఐపీఎస్‌ను వదిలి.. ప్రజల సేవ కోసం వచ్చారని తెలిపారు. పార్టీని గెలిపించి ఆయనను ముఖ్యమంత్రిని చేయాలని సూచించారు. తమ పార్టీ అభ్యర్థి వట్టెజానయ్య యాదవ్‌పై జరిగిన దాడి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ జరిపించిన దాడులని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఎన్నికల్లో బీఎస్పీ.. గతంలో కంటే ఎక్కువ స్థానాలను గెలవబోతోందని అన్నారు. బీసీ వాదం ఎత్తుకున్నందుకు జానయ్యపై మంత్రి జగదీశ్‌రెడ్డి 70కి పైగా కేసులు పెట్టించారని విమర్శించారు. అభ్యర్థి వట్టెజానయ్య యాదవ్‌ మాట్లాడుతూ.. చావు నోట్లోకి వెళ్లి ప్రజల ఆశీర్వాదంతో తిరిగి వచ్చానని చెప్పారు.

Spread the love