ఆర్‌ఎస్‌ఎస్‌ అంటే రాష్ట్రీయ సర్వనాశన సమితి

RSS stands for Rashtriya Sarvanasa Samithi– సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యులు బృందాకరత్‌
న్యూఢిల్లీ : ఆర్‌ఎస్‌ఎస్‌ అంటే ‘రాష్ట్రీయ సర్వనాశన సమితి’ అని సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు, పొలిట్‌ బ్యూరో సభ్యులు బృందాకరత్‌ విమర్శించారు. ఈ దేశంలో అన్ని వర్గాలను, విశ్వాసాలను గౌరవించే మతం, సంస్కృతి ఉందన్న ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలను బృందాకరత్‌ ఆదివారం తప్పుబట్టారు. అలాగే, ఆర్‌ఎస్‌ఎస్‌ అంటే ‘రాష్ట్రీయ సర్వనాశన సమితి’ అని వివరణ ఇచ్చారు. ఆదివారం ఎఎన్‌ఐతో మాట్లాడుతూ బృందకరత్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ తాను చెప్పిన సూత్రాన్ని తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. భారతదేశ యొక్క ‘మిశ్రమ సంస్కృతి’ విలువలు, సూత్రాలపై ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి వచ్చిన వారు దాడి చేస్తున్నారని ఆరోపించారు.
‘ప్రతిరోజూ, సంఫ్‌పరివార్‌ పేరుతో ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు, వారి కుటుంబ సభ్యులు ప్రజలను, ఇతర మతాలను దూషిస్తున్నారు. ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు విలువలు, సూత్రాలపై నమ్మకం ఉంటే సంస్థకు చెందిన ఇతరులు ఇతర మతాలకు చెందిన వ్యక్తులపై దాడి చేయడంపై మోహన్‌ భగవత్‌ సమాధానం చెప్పాలి’ అని బృందాకరత్‌ డిమాండ్‌ చేశారు.
ప్రస్తుతం జరుగుతున్న ఇజ్రాయిల్‌-హమాస్‌ యుద్ధంతో భారత్‌లోని హిందూయిజంను భగవత్‌ పోల్చారు. ‘హిందూయిజం అందర్ని గౌరవిస్తుంది. భారత్‌ ఎప్పుడూ ఇలాంటి యుద్దాన్ని చూడదు’ అని అన్నారు. మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహారాజ్‌ పట్టాభిషేకం జరిగి 350 ఏండ్లు పూర్తయిన సందర్భంగా శనివారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మోహన్‌ భగవత్‌ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఈ దేశంలో అన్ని మతాలను, విశ్వాసాలను గౌరవించే సంస్కృతి ఉంది. ఆ మతమే హిందూయిజం’ అని అన్నారు. అలాగే, భారతదేశం హిందువుల దేశమని, అంటే అన్ని ఇతర మతాలను మేం తిరస్కరిస్తామని అని అర్థం కాదని కూడా అన్నారు. హిందువులు ప్రతి మతాన్ని రక్షించారని, అనేక మతాల అనుచరులు స్వేచ్ఛగా జీవించగలిగే, ఆచరించే ఒక సమాజాన్ని ఏర్పాటు చేశారని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ అన్నారు.’భారతదేశం యొక్క భారీ జనాభా విభిన్నమైనది, భక్తిపరులు. ఇండియా అంటే ప్రపంచంలోని ఎక్కువ మంది హిందువులు, జైనులు సిక్కులు నివసించేదే మాత్రమే కాదు.
ఇది ప్రపంచంలోని ఎక్కువ ముస్లిం జనాభా నివసించే దేశాలో ఒకటి. మిలియన్ల మంది క్రైస్తవులు, బౌద్ధులకు నిలయం’ అని కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ చెప్పారు. ‘ఒక్కసారి నీవు హిందువు అని చెప్పుకుంటే చాలు. ముస్లింలు కూడా రక్షించబడ్డారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిందువులు మాత్రమే ఇలా చేస్తారు.. భారత్‌ మాత్రమే ఇలా చేస్తుంది. ఇతరులు ఎవ్వరూ కూడా ఇలా చేయలేరు’ అని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ చెప్పారు.

Spread the love