ఆర్టీసీ హైడ్రామా

– రాజ్‌భవన్‌ ముట్టడించిన కార్మికులు
– ప్రభుత్వమే కారణమన్న గవర్నర్‌
– కార్మిక సంఘాల జేఏసీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌
– తేలని పంచాయతీ…
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే విషయంలో హైడ్రామా చోటుచేసుకుంది. తాము పంపిన బిల్లును గవర్నర్‌ ఆమోదించలేదంటూ ప్రభుత్వం చేసిన ఆరోపణలకు గవర్నర్‌ కూడా ధీటుగానే సమాధానం చెప్పారు. అనేక నాటకీయ పరిణామాల మధ్య బిల్లుపై మరిన్ని సందేహాలను వ్యక్తంచేస్తూ గవర్నర్‌ ప్రభుత్వానికి మరో లేఖ రాసారు. అంతకుముందు విలీన బిల్లును తక్షణం ఆమోదించాలంటూ శనివారం ఆర్టీసీ కార్మికులు అంబేద్కర్‌ విగ్రహం నుంచి రాజ్‌భవన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. దీనికి టీఎమ్‌యూ (చీలికవర్గం) ప్రధాన కార్యదర్శి థామస్‌రెడ్డి నేతృత్వం వహించారు. గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, రాజ్‌భవన్‌ వద్ద బైఠాయించారు. అయితే గవర్నర్‌ పుదుచ్చేరిలో ఉండటంతో అక్కడి నుంచి టీఎస్‌ఆర్టీసీ జేఏసీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. జేఏసీ చైర్మెన్‌ అశ్వత్థామరెడ్డి, కన్వీనర్‌ కే హన్మంతు ముదిరాజ్‌, కో కన్వీనర్‌ పీ కమాల్‌రెడ్డి సహా ఆరుగురు ప్రతినిధులు గవర్నర్‌తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. థామస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ కేవీ రాష్ట్ర అధ్యక్షులు జి రాంబాబు సహా మరికొందరు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల గోసను అశ్వత్థామరెడ్డి గవర్నర్‌కు వినిపించారు. ప్రభుత్వం మరోసారి ఆర్టీసీ కార్మికుల భుజాలపై తుపాకీ పెట్టి గవర్నర్‌కు గురిపెట్టిస్తున్నదని చెప్పారు. దీనిపై గవర్నర్‌ స్పందించారు. తనకు బిల్లును ఆలస్యంగా పంపి, పరిశీలన చేయకముందే… సంతకం పెట్టలేదంటూ రాజ్‌భవన్‌ను ముట్టడించడం ఏంటని ప్రశ్నించారు. 2019 సమ్మె  కార్మికుల బాధను తాను స్వయంగా చూశాననీ, సమ్మె విరమింపచేయమని అప్పట్లో ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశానని గుర్తుచేసుకున్నారు. గవర్నర్‌ లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వివరణ ఇచ్చారు. అయితే జేఏసీ నేతలతో భేటీ అనంతరం మరికొన్ని అంశాలపై వివరణ కావాలంటూ ఆమె సీఎస్‌కు మరోసారి లేఖ రాసారు. ఓవైపు అసెంబ్లీ జరుగుతుండగానే ఆర్టీసీ కార్మికులు రాజభవన్‌ ముట్టడికి వెళ్లడం చర్చనీయాంశమైంది. పోలీసులే వారిని వెంటబెట్టుకొని రాజ్‌భవన్‌ వద్దకు తీసుకెళ్లారనే చర్చా జరిగింది. తాను కార్మికుల పక్షానే ఉన్నాననీ, న్యాయ సలహా తీసుకోకుండా బిల్లుపై సంతకం చేస్తే, ఎవరైనా కోర్టులో సవాలు చేస్తే మరోసారి ఆర్టీసీ కార్మికులు రోడ్డున పడతారనే తాను ప్రభుత్వం నుంచి వివరణలు కోరానని ఈ సందర్భంగా గవర్నర్‌ తెలిపారు.
ఇవీ గవర్నర్‌ ప్రశ్నలు
1958 నుంచి ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్‌లు, వాటాలు, లోన్లు, ఇతర సహాయం గురించి బిల్లులో ఎలాంటి వివరాలు లేవు.
రాష్ట్ర విభజన చట్టం 9వ షెడ్యూల్‌ ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై సమగ్ర వివరాలు లేవు.
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పరిగణిస్తామని చెబుతున్న ప్రభుత్వం… వారి సమస్యలకు ఇండిస్టియల్‌ డిస్ప్యూట్స్‌ చట్టం, కార్మిక చట్టాలు వర్తిస్తాయా, వారి ప్రయోజనాలు ఎలా కాపాడబడతాయో స్పష్టత ఇవ్వలేదు.
విలీనం డ్రాఫ్ట్‌ బిల్లులో ఆర్టీసీ ఉద్యోగులు అందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెన్షన్‌ ఇస్తారా?
ప్రభుత్వ ఉద్యోగుల్లో కండక్టర్‌, కంట్రోలర్‌ వంటి పోస్టులు లేనందున వారి ప్రమోషన్లు, క్యాడర్‌ నార్మలైజేషన్‌ ఇతర ప్రయోజనాలు ఏ విధంగా అందుతాయి?
సర్కారు సమాధానాలు
ఆర్టీసీ కార్మికులకు కార్పొరేషన్‌ కంటే మెరుగైన జీతాలు ఉంటాయి.
విలీనమైన తర్వాత రూపొందించే గైడ్‌లైన్స్‌లో అన్ని అంశాలు ఉంటాయి.
కేంద్ర ప్రభుత్వ వాటా, 9వ షెడ్యూల్‌ సమస్యలను ఆంధ్రప్రదేశ్‌ తరహాలోనే పరిష్కరిస్తాం.
ఈ వివరణలు వచ్చాక, కార్మిక సంఘాలతో భేటీ అనంతరం గవర్నర్‌
మరిన్ని సందేహాలను లేవనెత్తుతూ ప్రభుత్వానికి మరో లేఖ రాసారు.
ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వ వాటా 30 శాతం ఉంది. విలీనానికి కేంద్రం సమ్మతించిందా…సమ్మతిస్తే సదరు లేఖను ఇవ్వండి.
శాశ్వత, తాత్కాలిక ఉద్యోగుల సంఖ్య, డిపోల వారీగా వర్గీకరించబడిన కేటగిరీల వివరాలతో మొత్తం శాశ్వత ఉద్యోగుల సంఖ్య ఎంతో చెప్పాలి.
కాంట్రాక్ట్‌, క్యాజువల్‌, ఇతర ప్రాతిపదికలపై పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యనూ చెప్పాలి.
కార్పొరేషన్‌ ఆస్తుల నిర్వహణపై వివరణ ఇవ్వాలి. ఆస్తుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా? లేక కార్పొరేషన్‌లోనే కొనసాగుతాయా?
బస్సులు నడిపే అధికారానికి సంబంధించిన వివరాలు కావాలి.
ఉద్యోగులు ప్రభుత్వ సర్వీసులోకి ప్రవేశించాక డిప్యుటేషన్‌ లేదా ఇతర ఏర్పాట్లపై స్పష్టత ఇవ్వాలి.
ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానాలు ఇవ్వాల్సి ఉంది. ఆదివారం జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఈ అంశాలపై స్పందించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Spread the love