ప్రజల ఆకాంక్షల మేరకు ఆర్టీసీ ఆధునీకరణ మంత్రి పువ్వాడ అజరుకుమార్‌

– ఎంజీబీఎస్‌లో రక్తదాన శిబిరం ప్రారంభం
నవతెలంగాణ -సుల్తాన్‌ బజార్‌
ప్రజల ఆకాంక్షల మేరకు ఆర్టీసీని ఆధునీకరిస్తున్నామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్‌ అన్నారు. హైదరాబాద్‌లోని మహాత్మా గాంధీ బస్‌ స్టేషన్‌లో మంగళవారం రక్తదాన శిబిరాన్ని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం బస్టాండ్‌లోని మూత్రశాలలు, స్టాల్స్‌, ప్లాట్‌ఫాÛంలను పరిశీలించారు. బస్టాండ్‌ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 101 కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశామని, దీని ద్వారా సుమారు 8వేల మంది రక్తదానం చేస్తారని అన్నారు. తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీని సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో లాభాల బాట పట్టిస్తున్నామని, ఆర్టీసీలో పని చేసే ప్రతి ఒక్కరికీ అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ప్రజలను ఆర్టీసీ వైపు తిప్పేందుకు ఎన్నో ప్రయోగాత్మక నిర్ణయాలు తీసుకుంటూ కొత్త కొత్త పథకాలు తీసుకొస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ కార్గో సర్వీసులు, మహిళలకు, వయోవృద్ధులకు డిస్కౌంట్‌ టికెట్‌, ఉచిత మూత్రశాలలు, జీవా మంచినీటి బాటిళ్లతోపాటు బస్టాండు ప్రాంగణాలను ఆధునీకరిస్తున్నా దున్నారు. ఎలక్ట్రిక్‌, ఏసీ, వోల్వో బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చా మన్నారు. ఎండీ వీసీ సజ్జనార్‌ మాట్లాడుతూ.. రెండేండ్లుగా ఆర్టీసీని ప్రజలు బాగా ఆదరిస్తున్నారని, రాబోయే రోజుల్లో మరింత ఆదరిస్తారనే నమ్మకం ఉందని అన్నారు. త్వరలోనే శ్రీశైలానికి టూర్‌ ప్యాకేజీ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ఆర్టీసీ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సంగ్రామ్‌ సింగ్‌ టీ పాటిల్‌, ఈడీలు పురుషోత్తం, మునిశేఖర్‌, కృష్ణకాంత్‌, రంగారెడ్డి ఆర్‌ఎం శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love