ఎయిడెడ్‌ టీచర్ల జీతాలు చెల్లించాలి

– 24న జిల్లా ట్రెజరీల వద్ద నిరసన ప్రదర్శనలు
– 28న హైదరాబాద్‌లో మహాధర్నా : యుఎస్పీసీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఎయిడెడ్‌ టీచర్లకు వెంటనే పెండింగ్‌ జీతాలు, ఇతర బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 24న జిల్లాల్లో ట్రెజరీ కార్యాలయాల వద్ద నిరసన ప్రదర్శనలు చేస్తామనీ, 28న హైదరాబాద్‌లో మహాధర్నా చేపడుతామని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుఎస్పీసీ) ప్రకటించింది. వాటిని జయప్రదం చేయాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి యుఎస్పీసీ రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ సభ్యులు కె.జంగయ్య, చావ రవి, వై.అశోక్‌ కుమార్‌, ఎం.రవీందర్‌, ఎం.సోమయ్య, టి.లింగారెడ్డి, రోహిత్‌ నాయక్‌ నోటీసులు అందజేశారు. మూడు నెలలుగా ఎయిడెడ్‌ టీచర్లకు వేతనాలు చెల్లించడంలేదనీ, సప్లిమెంటరీ వేతనాలు, సెలవు జీతాలు, టీఎస్జీఎల్‌ఐ, జీపీఎఫ్‌ క్లైములు, పీఆర్సీ బకాయిలు, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌, పెన్షన్‌, తదితర బకాయిలు, బిల్లులన్నింటినీ పెండింగ్‌లో పెట్టారని వాపోయారు. ఉపాధ్యాయ సంఘాలు పదే పదే ప్రాతినిధ్యం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. మూడు రోజుల్లో ఎయిడెడ్‌ జీతాలు, పెండింగ్‌ బిల్లులన్నీ విడుదల చేయకుంటే 24న జిల్లా ట్రెజరీ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామనీ, అప్పటికీ బిల్లుల మంజూరులో పురోగతి లేకుంటే 28న హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి మహాధర్నా చేస్తామని హెచ్చరించారు. ఆ కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Spread the love