జీతాలు, జీవితాల కోసం జీఓను అమలు చేయాలి..

– సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్
– నవీపేట్ లో సమ్మె విచ్చిన్నానికి అధికారులు, పోలీసుల యత్నం
– పోటీ కార్మికులతో పనులకు యత్నం
– అడ్డుకున్న కార్మికులు, సిఐటియు నాయకులు
– తోపులాట ఉద్రిక్త వాతావరణం
నవతెలంగాణ -నవీపేట్: మండల కేంద్రంలో పంచాయతీ సిబ్బంది 9వ రోజు సమ్మె శుక్రవారం ఉద్రిక్తంగా మారింది. శాంతియుతంగా జిపి కార్మికులు సమ్మె నిర్వహిస్తుంటే నవీపేట్ పంచాయతీ స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ లో ఎంపిక కావడం శనివారం కేంద్ర బృందం తనిఖీలకు రానున్నడంతో ప్రత్యేక అధికారి డి ఎల్ పి ఓ నాగరాజు పోటీ కార్మికులతో పారిశుద్ధ్య పనులు నిర్వహించేందుకు గ్రామపంచాయతీ ట్రాక్టర్ను సమ్మె శిబిరం ముందు నుండి తీసుకెళ్లే యత్నం చేయగా కార్మికులు, సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, జిల్లా ఉపాధ్యక్షులు నాయక్ వాడి శ్రీనివాస్ అడ్డుకున్నారు. దీంతో స్థానిక ఎంపీడీవో సాజిద్ అలీ, ఎం పి ఓ రామకృష్ణ ,ఎస్సై రాజారెడ్డి పోలీసు బందోబస్తుతో  కార్మికులు, నాయకులను అడ్డు తొలగించేందుకు ప్రయత్నించగా తోపులాట జరగడంతో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ కార్మికులు జీతాలు జీవితాల కోసం ప్రభుత్వ జీవో 60 అమలు చేయాలని చట్టబద్ధంగా సమ్మె చేస్తున్నారని పోలీసుల దౌర్జన్యంతో సమ్మెను విచ్చిన్నం చేసే ప్రయత్నం విరమించుకోవాలని అధికారులకు కోరారు. గ్రామాలలో కార్మికుల వెట్టి చాకిరి చేయించే జీవో 51 వెంటనే రద్దు చేయాలని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు సమ్మె విరమించబోమని తేల్చి చెప్పడంతో ఎస్సై రాజారెడ్డి సిఐటియు నాయకులు, కార్మికుల మధ్య గంటకు పైగా వాగ్వివాదం జరిగింది. నాయకులు, కార్మికులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తానని పోలీసులు బెదిరించి సమ్మెను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కేసులకు భయపడేది లేదని దళిత కార్మికులపై వివక్ష మానుకొని అధికారులు కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం కృషి చేయాలని నూర్జహాన్ అన్నారు. సమ్మెను అణిచివేయాలని చూస్తే మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. చివరకు కార్మికులు పట్టువీడకపోవడంతో పోలీసులు, అధికారులు వెనుదిరిగారు.

Spread the love