మళ్లీ అవే వరాలు

The heat is on...
తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు
– ములుగులో రూ.900కోట్లతో గిరిజన విశ్వవిద్యాలయం : మహబూబ్‌నగర్‌ సభలో ప్రధాని మోడీ
– బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లపై విమర్శలు
– పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు
నవ తెలంగాణ- మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని, అందుకే పసుపు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. కరోనా తర్వాత పసుపు గొప్పతనం ప్రపంచానికి తెలిసిందని, పరిశోధనలూ పెరిగాయని, రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటుతో ఇక్కడ రైతులకు ఎంతో ప్రమోజనం చేకూరుతుందని అన్నారు. ఆదివారం బీజేపీ నిర్వహించిన పాలమూరు(మహబూబ్‌నగర్‌) ప్రజాగర్జనలో భాగంగా భూత్పూర్‌ దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. పలు జాతీయ రహదారులు, రైల్వేతదితర పనులకు పర్చువల్‌ పద్ధతిలో ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో సగభాగం ఉన్న మహిళలకు న్యాయం చేయడానికి మహిళా బిల్లును తీసుకొచ్చామన్నారు. చేతివృత్తిదారులకు చేయూత ఇవ్వడానికే విశ్వకర్మ యోజన పథకం తెచ్చామన్నారు. ఆదివాసీలకు ములుగు ప్రాంతంలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేశామని, ఆ ప్రాంత ఆరాధ్య దైవమైన సమ్మక్క సారక్క పేరుతో రూ.900కోట్లతో విశ్వవిద్యాలయ్యాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో తెలంగాణలో పండుగ వాతావరణం ఏర్పడిందన్నారు. 13,500 కోట్లతో రహదారులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం ఆనందాన్ని కలిగించిందన్నారు. ఎకానమిక్‌ కారిడారితో తెలంగాణ రూపురేఖలు మారనున్నాయని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రహదారుల విధానంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాలకు ప్రయాణం సులభతరమౌతుందన్నారు. గత పాలకులు ఏడు దశాబ్దాల కాలంలో ఖర్చు చేయని నిధులు రహదారుల కోసం 2500 కిలోమీటర్లకు లక్ష కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. రైతుల కోసంఅనేక రాయితీలు కల్పిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్‌ ఏలుబడిలో 8500 కోట్లు పెట్టి 70 సంవత్సరాలు ధాన్యాన్ని కొనుగోలు చేస్తే… సంవత్సర కాలంలోనే 27 వేల కోట్లు ఖర్చు చేశామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌పార్టీలపై విమర్శలు గుప్పించారు. అవినీతి ఆరోపణలు చేశారు. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో బీఆర్‌ఎస్‌ లక్షల కోట్లు దండుకుంటుందని ఆయన ఆరోపించారు. గత ఎన్నికల్లో రుణమాఫీ పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం వల్ల రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో కొనసాగుతున్న కుటుంబ పాలనను అంతమొందించి బీజేపీకి అధికారం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మెన్‌ ఈటల రాజేందర్‌, జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ, ఎంపీలు లక్ష్మణ్‌, సంజరు, వీర బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.

Spread the love