అదే సీన్‌…

Same scene...

– మణిపూర్‌పై పార్లమెంట్‌లో కొనసాగిన ప్రతిపక్షాల ఆందోళన
– పట్టింపులేని ప్రభుత్వం
– వాయిదాల పర్వంలో ఉభయ సభలు
న్యూఢిల్లీ : మణిపూర్‌పై ప్రధాని మోడీ ప్రకటన చేయాలని, చర్చ జరపాలని డిమాండ్‌ చేస్తూ పార్లమెంట్‌లో ప్రతిపక్షాల ఆందోళన సోమవారమూ కొనసాగింది. గత ఏడు రోజులమాదిరిగానే సోమవారం కూడా ఉభయ సభలు వాయిదాల పర్వం తొక్కాయి. లోక్‌సభ ప్రారంభంకాగానే ప్రతిపక్షాలు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టాయి. ప్లకార్డులు చేబూని నినాదాలు హోరెత్తించాయి. దీంతో సభను స్పీకర్‌ ఓం బిర్లా మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ సినిమాటోగ్రఫీ బిల్లును ప్రవేశపెట్టారు. ఎటువంటి చర్చ లేకుండానే బిల్లును ఆమోదించుకున్నారు. అనంతరం సభను మంగళవారానికి వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభలో కూడా ఇదే సీను కొనసాగింది. రాజ్యసభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు తమ ఆందోళన కొనసాగించారు. చైర్మెన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ రూల్‌ 267 కింద 65 మంది ఎంపీలు నోటీసులు ఇచ్చారని తెలిపారు. 65 మంది ఎంపీల పేర్లను చైర్మెన్‌ ధన్‌ఖర్‌ చదవడంపై అధికార బీజేపీ అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈ గందరగోళం మధ్య సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలో చైర్మెన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. అయితే ప్రతిపక్షాలు నినాదాలతో సభ అట్టుడికింది. దీంతో నిమిషాల వ్యవధిలోనే సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో అధికార బీజేపీ కోరినట్టుగా, మణిపూర్‌పై ఎటువంటి సమాధానం, ఓటింగ్‌ లేని రూల్‌ 176 కింద చర్చను చైర్మెన్‌ ఆమోదించారు. అయితే, ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రతిపక్షాలు రూల్‌ 267 కింద (ప్రభుత్వం నుంచి సమాధానం, ఓటింగ్‌) చర్చ జరపాలని డిమాండ్‌ చేశాయి. ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే మణిపూర్‌ కాలిపోతోందనీ, రూల్‌ 267 ప్రకారం చర్చ జరగాలని అన్నారు. అయితే దానికి చైర్మెన్‌ అనుమతించలేదు. దీంతో ప్రతిపక్షాలు తమ ఆందోళనను కొనసాగించాయి. వెంటనే సభను మధ్యాహ్నం 2;30 గంటలకు వాయిదా వేశారు. తరువాత మధ్యాహ్నం 3;30 గంటలకు మరోసారి వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్షాలు, అధికార పక్షాల నినాదాలమధ్య సభను మంగళవారానికి వాయిదా వేశారు.
మణిపూర్‌పై చర్చకు ప్రభుత్వం దూరంగా ఉందని కాంగ్రెస్‌ ఎంపీ రణదీప్‌ సుర్జేవాలా విమర్శించారు. మణిపూర్‌పై చర్చకు 65 మంది పార్లమెంటు సభ్యులు నోటీసులు ఇచ్చారనీ, అయితే ప్రభుత్వం దాని నుంచి పారిపోతోందని విమర్శించారు. ‘ప్రభుత్వం చర్చను కోరుకుంటుంది. కానీ అది గంటకు మించి ఉండకూడదట. ప్రతిపక్షాలు మాట్లాడకుండా నిరోధించాలన్నది వారి ఉద్దేశం. అయితే, ప్రధాని సభకు వచ్చి ఈ అంశంపై మాట్లాడాలి’ అని ఆయన అన్నారు. ఆప్‌ రాజ్యసభ ఎంపి రాఘవ్‌ చద్దా మాట్లాడుతూ ‘మణిపూర్‌పై చర్చను ప్రభుత్వం కోరుకోవడం లేదు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభమయ్యాయి. గత 11 రోజుల్లో కనీసం ఒక్కసారైనా మణిపూర్‌పై చర్చ జరిగి ఉంటే, మిగిలిన రోజుల్లో సభా కార్యకలాపాలు జరిగేవి’ అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ, ‘మణిపూర్‌ అంశంపై చర్చలో ప్రతిపక్షాలు పాల్గొనడానికి ఇష్టపడటం లేదు. ఈ అంశం పార్లమెంట్‌లో చర్చకు రాగానే ప్రతిపక్షాలు చర్చకు దూరంగా వెళ్లిపోయాయి’ అన్నారు. టీఎంసీ ఎంపీ డెరెక్‌ ఓబ్రెయిన్‌ మాట్లాడుతూ పార్లమెంటులో మణిపూర్‌ సమస్యను ప్రస్తావించాలని ప్రధాని నరేంద్ర మోడీని డిమాండ్‌ చేశారు. ‘పండిట్‌ (జవహర్‌ లాల్‌) నెహ్రూ వచ్చి రాజ్యసభలో అనేక ముఖ్యమైన విషయాలపై మాట్లాడారు. చర్చలో పాల్గొన్నారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయి వచ్చి రాజ్యసభలో చర్చించారు. మన్మోహన్‌ సింగ్‌ కూడా పాల్గొన్నారు. రాజీవ్‌ గాంధీ కూడా వచ్చి రాజ్యసభలో బోఫోర్స్‌ గురించి చర్చించారు. మణిపూర్‌పై అత్యవసర రూల్‌ కింద పూర్తి స్థాయి చర్చ జరగాలని కోరుకుంటున్నాం’ అని అన్నారు.
పార్లమెంట్‌ ఉభయ సభలు ప్రారంభం కాకముందు ప్రతిపక్షాలు సమావేశం అయ్యాయి. మణిపూర్‌లో రెండు రోజులు పర్యటించిన ఎంపీలు తమ అనుభవాలు వివరించారు. మణిపూర్‌ సమస్యపై రాష్ట్రపతిని కలిసేందుకు ప్రతిపక్ష ఎంపీల ప్రతినిధి బృందం ప్రయత్నిస్తున్నది. ఈ మేరకు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌ కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గొగోరు మాట్లాడుతూ ప్రధాన మంత్రి మణిపూర్‌లో పర్యటించాలని డిమాండ్‌ చేశారు. లోక్‌సభ పక్షనేత అధిర్‌ రంజన్‌ చౌదరి మాట్లాడుతూ మణిపూర్‌పై చర్చించాలనే అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చామని, దానిపై వీలైనంత త్వరగా చర్చకు అనుమతించాలని కోరారు.

Spread the love