గంటల తరబడి విద్యుత్ కోతలపై టెంబి సర్పంచ్, గ్రామస్తుల ఆగ్రహం
నవతెలంగాణ – బజార్ హత్నూర్
గత నెల రోజులుగా తరచూ విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో విసిగిపోయిన టెంబి గ్రామ సర్పంచ్ రాంరెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు సోమవారం వేకువజామున దేగామ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. టెంబి, మంజారం తండా, ధర్మపురి, అనంతపూర్, చిన్నమీయా తండా గ్రామాలకు గంటల తరబడి విద్యుత్ నిలిపివేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ రాంరెడ్డి మాట్లాడుతూ ఉక్కపోత, దోమల బెడద కారణంగా ప్రజలు రాత్రిళ్లు నిద్రపోలేక అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. విద్యుత్ లేక తాగునీటి సరఫరా కూడా నిలిచిపోతుందని, సమస్యపై ఎన్నిసార్లు విద్యుత్ శాఖ అధికారులకు విన్నవించినా స్పందన లేదని ఆరోపించారు. గత రాత్రి 10 గంటల నుంచి నిలిపివేసిన విద్యుత్‌ను ఉదయం 4 గంటల వరకు కూడా పునరుద్ధరించలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పగలు, రాత్రి తేడా లేకుండా తరచూ విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని మండిపడ్డారు. సబ్‌స్టేషన్‌ను ముట్టడించేందుకు వెళ్లగా అక్కడ సిబ్బంది ఎవరూ లేకపోవడం పట్ల కూడా గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై విద్యుత్ శాఖ అధికారులు తమ తీరు మార్చుకోకపోతే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.



