బడులు బాగుపడేనా!

– నేటి నుంచి పాఠశాలలు…
– సమస్యలు యథాతథం..
– ప్రారంభం రోజు పుస్తకాలు, యూనిఫామ్స్‌ కష్టమే..!
– నత్తనడకన మన ఊరు మన బడి పనులు
– భారీగా ఉపాధ్యాయ ఖాళీలు..
– వాలంటీర్ల నియామకానికి డిమాండ్‌
– బడుల్లో నీటి సమస్య
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2, 400 ప్రభుత్వ పాఠశాలలుండగా 80% మౌలిక వసతుల లేమితో ఉన్నాయి. మిషన్‌ భగీరథతో ప్రతి ప్రభుత్వ పాఠశాలకు తాగునీటి సౌకర్యం కల్పిస్తామని ప్రభుత్వం చెప్పినా నేటికీ కనెక్షన్లు ఇవ్వలేదు. రంగారెడ్డి జిల్లాలోని శివరాంపల్లి ప్రభుత్వ పాఠశాలలో 1600 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. వాటర్‌ తాగితే యూరిన్‌కి వెళ్లాలని నీళ్ళు కూడా సరిపడా తాగట్లేదు. ‘మన ఊరు-మన బడి’ కింద ఎంపికైన పాఠశాలల్లో కొంత మేర మౌలిక వసతులు కల్పించారు. నిధుల లేమితో నూతన భవనాలు పూర్తి కాలేదు.
నవతెలంగాణ – మొఫిసిల్‌ యంత్రాగం
    వేసవి సెలవుల అనంతరం రాష్ట్రంలో సోమవారం నుంచి పాఠశాలలు పున:ప్రారంభం అవుతున్నాయి. ఈ విద్యాసంవత్సరం ప్రభుత్వం అనేక ప్రణాళికలు రూపొందించుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభం రోజే పుస్తకాలు, నోట్‌ బుక్స్‌, యూనిఫామ్స్‌తో పాటు టై, బెల్ట్‌, షూస్‌ విద్యార్థులకు ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. సమస్యలు లేకుండా స్కూళ్లను ప్రారంభించాలని, విద్యార్థులకు అనువైన వాతావరణాన్ని కల్పించాలని సూచించింది. కానీ ఎప్పటిలాగే ఈ ఏడాదీ అరకొర వసతులతోనే ప్రభుత్వ బడులు ప్రారంభం కాబోతున్నాయి. మౌలిక వసతులు కల్పించి కార్పొరేట్‌ విద్యా వ్యవస్థకు దీటుగా తీర్చిదిద్దేందుకు మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినా పనులు నత్తనడకన నడుస్తున్నాయి. పనులు పూర్తయిన చోట స్కూల్స్‌ మెరుగుపడ్డాయి. టీచర్ల ఖాళీలు షరామామూలే.. స్కూల్స్‌ ప్రారంభం నాటికే ఖాళీ పోస్టుల్లో విద్యావాలంటీర్లను నియమిస్తామని చెప్పినా ఇప్పటివరకు ఏర్పాట్లు జరగలేదు. బడిబాట ఈ నెల 17 వరకు కొనసాగనుంది. అన్ని పాఠశాలల్లో కంప్యూటర్‌ విద్య నేటికీ హామీగానే మిగిలి ఉంది. మరోవైపు ప్రయివేటు, కార్పొరేట్‌ స్కూల్స్‌లో ఈ ఏడాది ఫీజులమోత మరింత భారీగా మోగుతోంది.
కనిపించని ‘స్వచ్ఛ’త..
రాష్ట్రంలో 26,065 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. అందులో 1.06 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. రాష్ట్రంలో 60 లక్షల మంది విద్యార్థులుంటే.. ప్రభుత్వ స్కూళ్లలోనే సుమారు 26 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. కాగా, గతంలో రాష్ట్రంలో 16 వేల మంది దాకా ఉన్న స్వచ్ఛ కార్మికులు ప్రస్తుతం లేరు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గ్రామపంచాయతీలు, మున్సిపాల్టీలు, కార్పొరేషన్‌ కార్మికులు పాఠశాల పరిసరాలను మాత్రమే శుభ్రం చేస్తున్నారు. తరగతి గదులు, స్టాఫ్‌రూమ్‌లు, మరుగుదొడ్లను మాత్రం శుభ్రం చేయడం లేదు. ఉదాహరణకు జీహెచ్‌ఎంసీ పరిధిలో 690 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. పాఠశాలలో 40మందిలోపు విద్యార్థులు ఉంటే ఒకరిని రూ.2వేలు, అంతకంటే ఎక్కువ విద్యార్థులుంటే ఇద్దరు కార్మికులకు రూ.2,500 చొప్పున వేతనంతో నియమించారు. ఉన్నత పాఠశాలల్లో వందలాది మంది విద్యార్థులకు వీరి సేవలు కీలకంగా మారాయి. కానీ రెండేండ్ల క్రితం ప్రభుత్వం సర్కారు బడుల్లో స్కావెంజర్లను తొలగించడంతో సుమారు 821 మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. స్కావెంజర్ల వ్యవస్థ పునరుద్ధరణ అంశం ప్రభుత్వ పరిధిలో ఉందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఉపాధ్యాయులు సొంత డబ్బులతో కార్మికులను నియమించుకుని పారిశుధ్య పనులను చేయిస్తున్నారు. బాలికల పరిస్థితి వర్ణనాతీతం. ఈ విద్యాసంవత్సరమైనా స్వచ్ఛ కార్మికులను నియమిస్తారా? అన్నది తేలలేదు.
‘మనబడి’కి నిధుల లేమి..?
మన ఊరు- మనబడి, మనబస్తీ-మనబడి పథకాన్ని ప్రభుత్వం గతేడాది జనవరిలో ప్రారంభించింది. రూ.7వేల కోట్లతో 26 వేల బడుల్లో 12 రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నట్టు ప్రకటించింది. మొదటి విడతలో రూ.3,497 కోట్లతో 9,123 బడుల్లో చేపట్టింది. బడుల ప్రాంగణం, తరగతి గదులకు రంగులు, కిచెన్‌షెడ్ల నిర్వహణ, డిజిటల్‌ తరగతి గదుల నిర్మాణం, తాగునీరు, నిరంతర నీటితో కూడిన టారులెట్ల నిర్మాణం వంటి వసతులు కల్పించడం ఈ పథకంలో ప్రధాన విధి. మొదటి విడతలో సగం స్కూళ్లలోనే పనులు పూర్తి అయ్యాయి. మిగతా వాటిని షెడ్యూల్‌ ప్రకారం చేస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ గడువు పెట్టుకోలేదు. నిధుల లేమితో పనులు జరగడం లేదని తెలుస్తోంది.
భారీగా ఖాళీలు..
అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 21 వేలకు పైగా టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదనపు పోస్టులు, రిటైర్‌మెంటు, ప్రమోషన్లు, బదిలీలు, తదితర కారణాలతో మొత్తంగా 28 వేల పోస్టులు ఖాళీ ఉన్నట్లు ఉపాధ్యాయసంఘాలు వెల్లడిస్తున్నాయి. స్కూల్‌ అసిస్టెంట్‌లు 7,111, ఎస్‌జీటీ 6,975 పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. 484 ఎంఇఓ పోస్టులకు గాను 467 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనైతే ఏ ఒక్క మండలానికి ఎంఈవో లేరు. పీజీ హెచ్‌ఎం గ్రేడ్‌-2 1947, గ్రేడ్‌-1 పోస్టులు 16కు గాను 15 , ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం పోస్టులు 2,043 ఖాళీగా ఉన్నాయి. డిప్యూటీ డీఈవో పోస్టులు 62కు గాను 58, పీఈటీ పోస్టులు 99 ఖాళీగా ఉన్నాయి. సంస్కృతంలో 23 పోస్టులుంటే మొత్తంగా ఖాళీనే. ఆర్ట్‌ డ్రాయింగ్‌ 331, క్రాప్ట్‌ ఇన్‌స్ట్రక్టర్‌ 443 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది.
జిల్లాల వారీ ఖాళీలు..
జిల్లాల వారీగా చూస్తే ఖమ్మం జిల్లాలో 5,759 ఉపాధ్యాయులకు గాను 4,702 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఇంకా 1,057 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. అత్యధికంగా ఎస్జీటీ తెలుగు 342 ఖాళీ ఉన్నాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 2,372 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఎస్‌జీటీలే 816 భర్తీ చేయాల్సి ఉంది. హైదరాబాద్‌ జిల్లాలో మొత్తం 803 ఖాళీలకు గాను స్కూల్‌ అసిస్టెంట్‌ 187, ఎస్జీటీలు 616 వరకు, ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 1,499 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కరీంనగర్‌ జిల్లాలో మొత్తం ఉపాధ్యాయుల పోస్టులు 3,174 ఉంటే ప్రస్తుతం పని చేస్తున్న వారు 2,689. పెద్దపల్లిలో 168 పోస్టులు, జగిత్యాలలో 666, రాజన్నసిరిసిల్లలో 338 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 11,484 మంది ఉపాధ్యాయులు ఉండగా 991ఖాళీలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.కామారెడ్డిలో 1,119 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
స్కూళ్లకు చేరని పుస్తకాలు, యూనిఫామ్స్‌
ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 3,582 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. సిద్దిపేటలో తొలి విడత మన ఊరు..మన బడిి కింద 343 స్కూల్స్‌ ఎంపిక చేయగా 100 బళ్లలోనే పనులు పూర్తయ్యాయి. సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లల్లో 1,07,885 విద్యార్థులకు 5.19 లక్షల పాఠ్యపుస్తకాలు అవసరముండగా 5.13 లక్షల పుస్తకాలు వచ్చాయి. దుస్తులు మాత్రం ఇంకా రాలేదు. ఇప్పటి వరకు బడిబాట కింద జిల్లాలో 5,612 మందిని నమోదు చేయించారు. మెదక్‌లో 97 స్కూల్స్‌లోనే పనులు వంద శాతం పూర్తయ్యాయి. మిగతా స్కూల్స్‌లో పనులు పెండింగ్‌లో ఉన్నాయి. 4.60 లక్షల పాఠ్యపుస్తకాలు అవసరముండగా ఇప్పటికే 3.75 లక్షల పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. సంగారెడ్డిలో 158 స్కూల్స్‌లో పనులు పూర్తయ్యాయి. జిల్లాకు 10.38 లక్షల పాఠ్యపుస్తకాలు అవసరముండగా ఇప్పటికి 4.32 లక్షల పుస్తకాలు మాత్రమే మండలాలకు చేరాయి. స్కూల్స్‌ ప్రారంభంలోనే పుస్తకాలు, యూనిఫామ్స్‌ అందిస్తామని అధికారులు చెప్పినా వరంగల్‌ జిల్లాలో ఆ ఏర్పాట్లు జరగడం లేదు.
మరమ్మతులకు నోచని పాఠశాలలు
కనీస మరమ్మతులకు నోచని పాఠశాలలూ చాలానే ఉన్నాయి. జిల్లా, పట్టణ కేంద్రాల్లోనూ ఇలాంటి సమస్యలున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని గెజిటెడ్‌ నెంబర్‌ 1పాఠశాలలో సుమారు 500పైగా విద్యార్థులు ఉన్నారు. బడిలో మౌళిక సదుపాయాలు మాత్రం లేవు. ప్రస్తుతం ఈ పాఠశాలలో కిటికీలు ఊడిపోవడం, బేెస్మెంట్‌ పగుళ్ళు తేలి ప్రమాదకరంగా మారాయి. ఇలా అనేక పాఠశాలలు సమస్యల్లో కొట్టుమిట్టాడుతుండగా నేటి నుంచి పున:ప్రారంభం కానున్నాయి.

Spread the love