సీట్ల కోసం కుమ్ములాటలు

– బీజేపీ నేతల మధ్య పెరుగుతున్న తగాదాలు
– ఆ పార్టీని వీడే ఆలోచనలో పలువురు నేతలు
– జారిపోకుండా పదవుల గాలం
– బీజేపీ జాతీయ కౌన్సిల్‌ మెంబర్లుగా 18 మంది నియామకం
– పక్క పార్టీల అసంతృప్తి నేతలపైనే ఆశలు
– అమిత్‌షా పర్యటన తర్వాతనే తొలి జాబితా!
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ పార్టీ తొలి జాబితా ప్రకటించి దూకుడు ప్రదర్శిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ ఢ అంటే ఢ అంటూ తనదైన శైలిలో ముందుకెళ్తున్నది. మరో వైపు తాము అధికారంలోకి రాబోతున్నామంటూ ఊకదంపుడు ప్రచారం చేసుకున్న బీజేపీ మాత్రం ఎన్నికల వేళ ఢలాీ పడిపోయింది. నేతల మధ్య సీట్ల కోసం కుమ్ములాటలతో అల్లాడిపోతున్నది. పాత, కొత్త నేతల పంచాయతీలతో తల్లడిల్లుతున్నది. మొన్నటిదాకా రాష్ట్ర కేంద్రానికే పరిమితమైన గ్రూపుల పోరు నియోజకవర్గ కేంద్రాలకూ పాకింది. దీంతో ఉన్న నేతల్ని ఎలా కాపాడుకోవాలో అర్థం కాక అధిష్టానం తల పట్టుకుంటూనే మరోవైపు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నది. కమలం గూటిని వీడకుండా జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియమిస్తూ పదవుల గాలం వేస్తున్నది. అందులో భాగంగానే 18 మందిని జాతీయ కౌన్సిల్‌ మెంబర్లుగా నియమించింది. అయినా, రాష్ట్రంలో ఆ పార్టీ గ్రాఫ్‌ పడిపోయిన నేపథ్యంలో మునుముందు వలసలు మరింత పెరిగే అవకాశముంది. అయితే, ఇతర పార్టీల్లో టికెట్‌ దక్కక అసంతృప్తితో ఉన్న నేతలకు గాలం వేసి తమ అభ్యర్థులుగా ప్రకటించుకోవాలనే కొండంత ఆశతో బీజేపీ ఉంది. ఆచరణలో అదీ సాధ్యమయ్యేటట్టు కనిపించడం లేదు.
ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఎంపీ ధర్మపురి అర్వింద్‌, పలువురు ముఖ్య నేతల మధ్య తగాదాలు తారాస్థాయికి చేరాయి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ధర్నాకు దిగే దాకా పరిస్థితి వచ్చింది. బండి సంజరు అధ్యక్ష పదవి నుంచి దిగిపోయాక అర్వింద్‌ తమను టార్గెట్‌ చేసి మరీ వేధిస్తున్నారని ఆ జిల్లాలోని పలువురు నేతలు వాపోతున్నారు. ఈ పంచాయతీలో కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే కప్పకు కోపం అన్న చందంలా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పరిస్థితి తయారైంది. ఈ గొడవకు కారణం ఆర్మూర్‌ నుంచి అర్వింద్‌ ఎమ్మెల్యేగా పోటీచేయాలనే నిర్ణయానికి రావడమే. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో బీజేపీ నాయకులు రమేశ్‌ రాథోడ్‌, సోయం బాపూరావు గ్రూపులుగా విడిపోయి ఆధిపత్యం కోసం వెంపర్లాడుతున్న పరిస్థితి నెలకొంది. మహేశ్వర్‌రెడ్డి చేరికను బాపూరావు గ్రూపు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నది. బీజేపీ సృష్టించిన వాట్సాప్‌ యూనివర్సిటీ బృందాలే రెండుగా చీలిపోయి ఆ ఇద్దరు నేతలపై విద్వేష పోస్టులు పెట్టేదాకా పరిస్థితి వెళ్లింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో జితేందర్‌రెడ్డి, డీకే అరుణ మధ్య ఆధిపత్యపోరు రగులుతున్నది. వేములవాడ టికెట్‌ తుల ఉమకు ఇవ్వాలని ఈటల పట్టుబడుతుండగా…అక్కడ పోటీ చేసేందుకు బండి వేగంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ విషయంలో ఈటల, బండి మధ్య మొదలైన వైరం ఇంకా కొనసాగుతున్న విషయం విదితమే. వరంగల్‌ జిల్లాలోనూ నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్నది. ఇలా అన్ని జిల్లాల్లో అంతర్గత పంచాయతీలు తీవ్ర స్థాయికి చేరుకున్నట్టు తెలుస్తున్నది.
పట్నంలోనూ పంచాయితీ
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో బీజేపీ కాస్త బలంగా ఉన్నట్టు కనిపించింది. కానీ, ఆ తర్వాత అంతా ఉల్టాపల్టా అయింది. ఆ పార్టీలో ‘పట్నం’ రాజకీయమంతా మూడు గ్రూపులు..ఆరు తగాదాలన్నట్టు తయారైంది. గత ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి రాజాసింగ్‌ మాత్రమే గెలిచారు. ఆ తర్వాత పార్టీ సీనియర్లతో ఆయనకు అస్సలే పడకపోవడం, తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, నియోజకవర్గంలో గ్రూపు తగాదాలు రచ్చకెక్కిన విషయం విదితమే. ఇప్పుడు ఆయనకే టికెట్‌ నిరాకరించే పరిస్థితి తలెత్తింది. ఆ నియోజకవర్గంలో రాజాసింగ్‌-విక్రమ్‌గౌడ్‌ గ్రూపుల మధ్య ఆధిపత్యపోరు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. దీంతో రాజాసింగ్‌ బీజేపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతున్నది. ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలో కార్పొరేషన్‌ ఎన్నికల్లో అన్ని స్థానాలనూ గెలిచిన బీజేపీ ఇప్పుడు అక్కడ ముఠా తగాదాలతో అల్లాడిపోతున్నది. అక్కడ గతంలో పోటీ చేసిన పార్టీ సీనియర్‌ నేత పేరాల శేఖర్‌రావు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి, కార్పొరేటర్లు వంగా మధుసూదన్‌రెడ్డి, కొప్పుల నర్సింహారెడ్డి ఎవరికి వారే టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పార్టీ శ్రేణులు ఎవరివెనకాల వెళ్లాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నాయి. మల్కాజిగిరి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. టికెట్‌ను ఆశిస్తున్న వారిలో మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్‌, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, బీజేవైఎమ్‌ జాతీయ నాయకుడు సాయిప్రసాద్‌ ఉన్నారు. అక్కడా ఆధిపత్య పోరు నడుస్తున్నది. ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో ఆగస్టు 15 సాక్షిగా బీజేపీ కార్యకర్తలు రెండు గ్రూపులుగా విడిపోయి బాహాబాహికి దిగారు. రామచంద్రారెడ్డి అభ్యర్థిత్వాన్ని స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముషీరాబాద్‌ నియోజకవర్గంలో లక్ష్మణ్‌ బరిలోకి దిగకుంటే… గుండగోని భరత్‌గౌడ్‌, పార్థసారధి, దత్తాత్రేయ కూతురు విజయతో పాటు ఇద్దరు కార్పొరేటర్లు కూడా టికెట్‌ను ఆశిస్తున్నారు. వీరంతా ఎవరికివారే హైలెట్‌ కావడానికి ప్రయత్నిస్తూ గ్రూపుల పోరుకు మరింత ఆజ్యం పోస్తున్నారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాడాలని బీజేపీలో చేరిన నేతలంతా ఇప్పుడు ఆ పార్టీలోని పరిస్థితులను చూసి ఇక్కడ తమ లక్ష్యం నెరవేరదనే భావనకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే పలువురు కీలక నేతలు కమలం గూటిని వీడేందుకు కాంగ్రెస్‌, తదితర పార్టీలతో చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. వారిని బుజ్జగించేందుకు జాతీయ నాయకత్వం శతవిధాలా ప్రయత్నిస్తున్నది.
బీజేపీ జాతీయ కౌన్సిల్‌ సభ్యులు వీరే
18 మంది నేతలను బీజేపీ జాతీయ కౌన్సిల్‌ మెంబర్లుగా నియమించినట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జి. కిషన్‌రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆ పార్టీ కార్యాలయం ఆఫీస్‌ సెక్రటరీ బి.ఉమాశంకర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ 18 మందిలో మాజీ మంత్రులు పి.చంద్రశేఖర్‌, మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ ఎంపీలు రవీంద్రనాయక్‌, బూర నర్సయ్యగౌడ్‌, కొండా విశ్వేశ్వరరెడ్డి, రమేశ్‌ రాథోడ్‌, చాడా సురేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు టి.రాజేశ్వర రావు, వి.జైపాల్‌, వి.శ్రీరాములు, జి.రామకృష్ణారెడ్డి, బొడిగె శోభ, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎ.మహేశ్వర్‌రెడ్డి, జయసుధ, ఆకుల రాజేందర్‌, మాజీ ఎమ్మెల్సీ కె.దిలీప్‌కుమార్‌ ఉన్నారు.

 

Spread the love