Monday, July 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‘సీజనల్‌’ వార్‌..!

‘సీజనల్‌’ వార్‌..!

- Advertisement -

వ్యాధుల ప్రబలకుండా ర్యాపిడ్‌ రెస్పాన్స్ టీమ్‌ల ఏర్పాటు
180కి పైగా హై రిస్క్ ఏరియాలపై ప్రత్యేక దృష్టి
అప్రమత్తమైన జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ‌అధికారులు

నవతెలంగాణ-సిటీబ్యూరో
సీజనల్ వ్యాధుల కాలం ప్రారంభమైంది. అడపాదడపా కురుస్తున్న వర్షాలతో వ్యాధుల వ్యాప్తి పెరిగే అవకాశముంది. ప్రధానంగా డెంగ్యూతోపాటు విష జ్వరాలు, మలేరియా, చికున్‌‌గున్యా వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతాయనే ఆందోళన నెలకొంది. ప్రస్తుతం పెద్దగా ప్రభావం లేకున్నా గత అనుభవాల దృష్ట్యా సిటీకి డెంగ్యూ ప్రమాదం పొంచి ఉండటం, ఏటా వేలల్లో డెంగ్యూ కేసులు నమోదవుతుండటంతో హైదరాబాద్‌ ‌జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. సిటీజనులు వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

​​రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌‌ల ఏర్పాటు
హైదరాబాద్‌ ‌నగరంలో ఏటా సీజనల్ వ్యాధులు ప్రబలుతూ ప్రజలు ఆస్పత్రుల పాలవుతూనే ఉన్నారు. డెంగ్యూ కేసులు ఏటా 1500కు పైగా నమోదవుతూనే ఉన్నాయి. డయేరియా, విషజ్వరాల బారిన ప్రజలు పడుతూనే ఉన్నారు. ఈసారి జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా స్థానికంగా, జిల్లా రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. ప్రజల్లో అవగాహన పెంచడం, ప్రతి శుక్రవారం డ్రైడే పాటించడం, ఆరోగ్యంపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం, పారిశు ద్ధ్యాన్ని మెరుగుపరచడం లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. గతంలో ఎక్కువగా సీజనల్ వ్యాధులు ప్రబలిన ప్రాంతాలతోపాటు ఈసారి 180కి పైగా హై రిస్క్ ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో కంట్రోల్ రూంను సైతం త్వరలో ఏర్పాటు చేయనున్నారు.

​ఏటా తప్పని డెంగ్యూ బెంగ
​సిటీలో ఏటా డెంగ్యూ కేసులతో ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. పెద్దగా మరణాలు నమోదవకపోయినా.. రోగులు ఆస్పత్రుల పాలై ఆర్థికంగా నష్టపోతూనే ఉన్నారు. 10 మి.లీ. నీటిలో కూడా డెంగ్యూ జ్వరానికి కారకమైన ఏడిస్ ఈజిప్ట్ దోమ పెరుగుతుందని.. పగటి పూట మాత్రమే కుట్టే ఈ దోమ కారణంగా జిల్లాలో కేసులు నమోదవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం 2024లో 2,513 డెంగ్యూ కేసులు నమోదు కాగా, 2025లో 1,481 కేసులు, 2026లో గడిచిన ఆరు నెలల్లో 136 కేసులు నమోదయ్యాయి. డెంగ్యూ బారినపడకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇంటి ఆవరణలో పూల కుండీలు, రోళ్లు, టైర్లలోనే కాక కొబ్బరి బొండాలు, కూలర్లలో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. లేకపోతే అందులో లార్వా వృద్ధి చెంది డెంగ్యూ కారక దోమ పుడుతుంది. కిటికీలకు, తలుపులకు జాలి తలుపులు ఏర్పాటు చేసుకుంటే దోమల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. మూడు రోజులు దాటినా జ్వరం తగ్గకపోగా, ఒళ్లు నొప్పులు, నీరసం, రక్తస్రావం, కడుపునొప్పి, బీపీ వంటి లక్షణాలు ఉంటే ఆస్పత్రిలో సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.

​దోమల వృద్ధిని అరికట్టాల్సిందే
పారిశుద్ధ్య నిర్వహణ లోపం, కలుషిత నీరు తాగడం, దోమలు కుట్టడం ద్వారా సీజనల్ వ్యాధులు వస్తుండగా అధికారులు వీటిపైనే దృష్టి సారించారు. లోతట్టు ప్రాంతాలు, ఇంటి పరిసరాల్లో వర్షపునీరు, మురుగునీరు నిల్వకుండా చర్యలు చేపట్టేలా, ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. వర్షాలతో నీరు కలుషితమవుతుందని, ఈగలు వాలిన, నిల్వ చేసిన ఆహారం తీసుకుంటే ఫుడ్ పాయిజన్, ఇతర వ్యాధుల బారిన పడాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బయటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని, వేడిగా ఉండే ఆహారమే తీసుకోవాలని, కాచి చల్లార్చిన నీటినే తాగాలని సూచిస్తున్నారు.
సిటీలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించేందుకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కృషి చేస్తోంది. రక్త నమూనాలు సేకరించి నారాయణగూడలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ కు పంపిస్తున్నారు. పరీక్షా ఫలితాలను రోగి మొబైల్‌‌కు మెసేజ్ రూపంలో వెంటనే చేరవేస్తున్నారు. మలేరియా, డెంగీ, టైఫాయిడ్, చికున్‌‌గున్యా లాంటి సీజనల్ వ్యాధులను నిర్ధారించిన వెంటనే వైద్యులు అప్రమత్తమై వారికి వైద్యం అందించేలా ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను సైతం ఏర్పాటు చేశారు.

ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నాం
​జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ల ద్వారా సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న ఏరి యాలపై ప్రత్యేక దృష్టి సారించి వైద్య పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశాం. గతేడాది డెంగ్యూ కేసులు నమోదైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. వరద ముంపు ప్రాంతాల ప్రజలకు ముందస్తు అవగాహన కల్పించేలా ఏర్పాటు చేశాం. ప్రతి శుక్రవారం డ్రైడే నిర్వహించేలా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. జిల్లాలో 180కి పైగా హై రిస్క్‌ ఏరియాలను గుర్తించాం. వీటిపై ప్రత్యేక దృష్టి సారించాం.
డాక్టర్‌ ‌పుట్ల శ్రీనివాస్‌, డీఎంఅండ్‌‌హెచ్‌ఓ, హైదరాబాద్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -