స్వేచ్ఛ ఉంటేనే ఆత్మగౌరవం

Self-respect only comes with freedom– లక్షలాది కార్మికుల జీవితాలపై దెబ్బకొట్టిన జీవో
– ఆటోలు, ఫ్రీ బస్సులకు పంచాయతీ పెట్టొద్దు : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఎన్ని ఉన్నప్పటికీ..స్వేచ్ఛ ఉంటేనే ఆత్మగౌరవమని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. గవర్నర్‌ ప్రసంగానికి దన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా శుక్రవారం శాసనసభలో ఆయన మాట్లాడారు. లక్షలాది మంది కార్మికుల జీవితాలపై దెబ్బకొట్టే విధంగా ప్రభుత్వం ఒక జీవోను విడుదల చేసిందనీ, దాన్ని తక్షణమే ఉపసంహారించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆ జీవో ప్రకారం.. రూ.17వేల వేతనమున్న కార్మికులకు రూ.11వేలు తగ్గుతుందని గుర్తు చేశారు. రకరకాల పేర్లతో పనిచేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌, క్యాజువల్‌, స్కీం వర్కర్లకు ఆ జీవో తీరని అన్యాయం చేసిందని చెప్పారు. పని రూపం ఒకే విధంగా ఉన్నా.. వేతనాల్లో తేడాలున్నాయని తెలిపారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే ఆటోలకు, ఫ్రీ బస్సు ప్రయాణానికి లంకె పెట్టి పంచాయతీ సృష్టిస్తున్నారని చెప్పారు. ఆటో కార్మికులపై కొత్తకొత్త ప్రేమలు ఒలకబోస్తున్నారని తెలిపారు. చిన్న తరహా పరిశ్రమలను నగరాలకే పరిమితం చేయకుండా వెనుకబడ్డ ప్రాంతాలకు విస్తరించాలని కోరారు.విద్య, వైద్యం తదితర అంశాలపై గవర్నర్‌ ప్రసంగంలో ప్రస్తావించలేదని గుర్తు చేశారు. రైతాంగ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.చిన్ననీటి తరహా ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అవినీతి అనకొండల భరతం పట్టాలని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రత్యేకంగా కోరారు.ఎన్‌ఐఏ దాడులను ఆపాలనీ, జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కూనంనేని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Spread the love