సీనియర్‌ జర్నలిస్ట్‌ అంబటి ఆంజనేయులు మృతి

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
జర్నలిస్టు ఉద్యమనేత, ఐజేయూ స్టీరింగ్‌ కమిటీ సభ్యులు, ఏపీయూడబ్ల్యూజే గౌరవ సలహాదారులు అంబటి ఆంజనేయులు (78) ఆదివారం రాత్రి మరణించారు. హృద్రోగ సమస్యతో బాధపడుతున్న ఆయన మూడు రోజుల క్రితం విజయవాడలోని ఒక ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం సేవలు అందించారు. ప్రస్తుతం ఇండియన్‌ జర్నలిస్టు యూనియన్‌ స్టీరింగ్‌ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ఆంద్రప్రభ, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్లాంట్‌ లెవల్‌ యూనియన్‌ అభివద్ధికి కృషి చేశారు. ఆంధ్రప్రదేశ్‌ న్యూస్‌ పేపర్స్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ (ఏపీఎన్‌ఈఎఫ్‌) అధ్యక్షులుగా పనిచేశారు. అంబటి ఆంజనేయులు మృతికి తెలంగాణ ఫోటో జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ (టీఎస్‌పీజేఏ) అధ్యక్షులు గంగాధర్‌, ప్రధాన కార్యదర్శి కేఎన్‌ హరి, రామ్మూర్తి, అనిల్‌ కుమార్‌, గాంధీ, రవికాంత్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ ఫోటో జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ (ఏపీపీజేఏ) అధ్యక్షులు ఎన్‌ సాంబశివరావు, సీనియర్‌ ఫోటోగ్రాఫర్లు సీహెచ్‌ విజయ భాస్కర్‌, ఆనంద్‌, రూబిన్‌, జీవీ నారాయణ, మరిడయ్య, మహేష్‌, రాము, టీవీ రమణ, సుమన్‌రెడ్డి తదితరులు ప్రగాఢ సంతాపం తెలిపారు.

Spread the love