గ్రూప్‌-1 తీర్పును రద్దు చేయండి

Set aside the judgment of Group-I– డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌ దాఖలు చేసిన టీఎస్‌పీఎస్సీ
–  నేడు హైకోర్టులో విచారణ
– అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి వెలువరించిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ టీఎస్‌పీఎస్సీ డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌ పిటిషన్‌ను సోమవారం దాఖలు చేసింది. ప్రిలిమ్స్‌ను రద్దు చేస్తూ ఈనెల 23న సింగిల్‌ జడ్జి తీర్పును సవాల్‌ చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరింది. మంగళవారం విచారణ చేపడతామని ధర్మాసనం ప్రకటించింది. మంగళ వారం జరిగే విచారణకు ఇరుపక్షాలు వాదనలకు సిద్ధంగా ఉండాలని ఆదేశిం చింది. అత్యవసర విచారణ చేపట్టాలని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. జూన్‌ 11న నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను రద్దు చేస్తూ ఈనెల 23న హైకోర్టు సింగిల్‌ జడ్జి తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. సుమారు 11 ఏండ్ల తర్వాత టీఎస్‌పీఎస్సీ గతేడాది అక్టోబరు 16న తొలిసారి గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను నిర్వహించింది. ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా ఆ పరీక్షలను కమిషన్‌ రద్దు చేసింది. అదే నోటిఫికేషన్‌ మేరకు తిరిగి జూన్‌ 11న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను తిరిగి నిర్వహించింది. 2,33,506 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారనీ, కేవలం ముగ్గురు అభ్యర్థులు మాత్రమే పరీక్షలను రద్దు చేయాలంటూ కోర్టుకు వచ్చారని కమిషన్‌ కౌంటర్‌ పిటిషన్‌లో వివరించింది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రెండుసార్లు రద్దవడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని చెప్పింది. గ్రూప్‌-1 పరీక్షలు రాసేందుకు అభ్యర్థులు ఎన్నో వ్యయ ప్రయాసలు పడ్డారనీ, కష్టనష్టాలు ఓర్చి పరీక్ష రాశారనీ, తీరా పరీక్షను సింగిల్‌ జడ్జి రద్దు చేస్తూ తీర్పు ఇవ్వడంతో వారంతా తీవ్ర నిరాశకు లోనయ్యారని తెలిపింది. 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి జూన్‌ 11న 900లకుపైగా కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించినట్లు వివరించింది. ఈ పరీక్షలకు 2.33 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారనీ, కేవలం ముగ్గురు అభ్యర్థులు మాత్రమే పరీక్షను రద్దు చేయాలని పిటిషన్లు వేశారని వివరించింది. చిన్న చిన్న సాంకేతిక సమస్యల కారణంగా లక్షల మంది అభ్యర్థుల భవితవ్యాన్ని దెబ్బతీయకూడదని చెప్పింది. వెంటనే సింగిల్‌ జడ్జి తీర్పు అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరింది. డివిజన్‌ బెంచ్‌ తీర్పు ఎలా వస్తుందోనని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థిస్తుందా? లేదా నిలిపేస్తుందా? అన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

Spread the love