Sunday, June 28, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅద్దె భవనాల్లోని గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి

అద్దె భవనాల్లోని గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి

- Advertisement -

గురుకుల కార్యదర్శికి ఎస్‌ఎఫ్‌ఐ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాంఘీక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, మౌలిక వసతులు కల్పించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ కోరింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్ లో గురుకుల కార్యదర్శి శారదకు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.రజనీకాంత్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.కిరణ్, రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ ఎం. మమత వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్.రజినీకాంత్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అనేక గురుకులాలు ఇప్పటికీ అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తయినా గురుకులాలకు సొంత భవనాలు నిర్మించడంలో నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. “యంగ్ ఇండియా గురుకులాలు” పేరుతో ప్రకటనలు చేస్తున్నప్పటికీ, ఆచరణలో కొత్త భవనాల నిర్మాణం చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా గురుకులాల్లో తరగతి గదులు, వసతి గదులు సరిపడా లేకపోవడంతో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ విద్యార్థులకు కొత్త యూనిఫారాలు అందించకపోవడంతో గతేడాది యూనిఫాంలనే వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, ట్రాక్‌సూట్లు, ట్రాక్ ప్యాంట్లు, క్రీడా దుస్తులు సకాలంలో అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, లెక్చరర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ప్రతి నెలా కాస్మొటిక్ చార్జీలు సకాలంలో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మెస్ ఛార్జీలు పెంచామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా వాటి పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని తెలిపారు. దీంతో విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందడం లేదని చెప్పారు. అమ్మాయిలకు మెడికల్ కిట్లు అందించడంతో పాటు ప్రతి గురుకులంలో అవసరమైన మౌలిక వసతులు, క్రీడా సామగ్రి ఏర్పాటు చేయాలని కోరారు. జోనల్ అధికారులు ప్రతి నెలా గురుకులాలను సందర్శించి విద్యార్థులు, తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకుని పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో ఉన్న సమస్యలపై ప్రభుత్వం తక్షణమే సమీక్ష నిర్వహించి, గతేడాదిజరిగిన విద్యార్థుల మరణాల వంటి విషాదకర ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -