ఎన్నికలొస్తే రాజకీయ పార్టీల మధ్య పోటీ సహజం. కానీ ఆ పోటీ ఓటు కోసం జరగాలే తప్ప, ఓటర్‌ని తగ్గించే పోటీగా మారకూడదు. ఇప్పుడు దేశంలో ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) పేరుతో జరుగుతున్న పరిణామాలపై జరుగుతున్న చర్చ ఇదే ప్రశ్నను ముందుకు తెస్తోంది. ఒక్కసారి మన చుట్టూ చూసుకోండి. పల్లెల్లో కూలీకి వెళ్లే మనిషి దగ్గర అన్ని పత్రాలు ఉంటాయా? హైదరాబాద్‌లో అద్దె ఇంట్లో ఉండే వలస కార్మికుడికి చిరునామా రుజువు అంత సులభంగా దొరు కుతుందా? ఎనభై ఏళ్ల వృద్ధురాలు, ఒంటరిగా బతుకుతున్న మహిళ, గిరిజన తండాలో ఉండే కుటుంబం, వీళ్లందరూ కార్యాలయాల చుట్టూ తిరిగి తమ ఓటు హక్కును నిరూపించుకోవాల్సి వస్తే, అది ప్రజాస్వామ్యం బలపడుతున్న సంకే తమా? లేక ప్రజాస్వామ్యం సామాన్యుడికి దూరమవుతున్న సూచనా? ఓటరు జాబితాను సరి చేయడం తప్పు కాదు. చనిపోయిన వారి పేర్లు తొలగించాలి. ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు ఉంటే సరిచేయాలి. ఇందులో ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ ఆ పనిచేసే విధానం ప్రజల్లో భయం కలిగిస్తే అసలు సమస్య అక్కడే మొదలవుతుంది.
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం పౌరుడిని నమ్మాలి. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైనట్టుగా కనిపిస్తోంది. “నువ్వు నిజంగా ఓటరువేనా? ముందు రుజువు చేయి” అనే ధోరణి పెరుగుతోందనే విమర్శ వినిపిస్తోంది. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఇచ్చిన ఓటు హక్కు, ప్రభుత్వ కార్యాలయంలో ఫైలు కదిలిన తర్వాతే అమల్లోకి వచ్చే హక్కు కాదు. అది రాజ్యాంగం ఇచ్చిన ప్రజాస్వామ్య గౌరవం.వామపక్షాలు ఎప్పటి నుంచో ఒక మాట చెబుతున్నాయి. ‘‘ప్రజాస్వామ్యానికి అసలు బలం ఎన్నికల నిర్వహణలో కాదు, ప్రతి అర్హుడి ఓటు రక్షించబడ టంలో ఉంది’’ అని. ఒక్క నకిలీ ఓటు ఉండటం ఎంత తప్పో, ఒక్క నిజమైన ఓటు అన్యాయంగా పోవడం కూడా అంతే తప్పు. ఎందుకంటే ఆ ఒక్క ఓటు వెనుక ఒక కుటుంబం ఉంటుంది, ఒక జీవితం ఉంటుంది, ఒక ఆశ ఉంటుంది. మన దేశంలో ఎక్కువ మంది ప్రజలు ప్రభుత్వ కార్యాల యాలకు వెళ్లడానికే భయపడే పరిస్థితి ఇంకా పూర్తిగా మారలేదు. దరఖాస్తు అంటే భయం. ధ్రువపత్రం అంటే ఖర్చు. కార్యాలయం అంటే రోజువారీ కూలీ పోవడం. ఇలాంటి వాస్తవాలను పక్కనబెట్టి కేవలం నిబంధనల భాషలో మాట్లాడితే, చివరికి నష్టపోయేది బలహీన వర్గాలే. ప్రజాస్వామ్యం అంటే కేవలం చట్ట పుస్తకాల్లో ఉండే పదం కాదు. అది సాధారణ మనిషి ఓటు వేసి ఇంటికి తిరిగి వెళ్లేంత సులభంగా ఉండాలి.
ఎన్నికల సంఘం మీద ప్రజలకు ఉన్న విశ్వాసం ఎంతో విలువైనది. ఆ విశ్వాసాన్ని పెంచే ప్రతి చర్య స్వాగతించాలి. కానీ సందేహాలు పెంచే ప్రతి చర్యకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా అదే సంస్థపై ఉంటుంది.ఇక్కడ మరో విషయం గుర్తుంచుకోవాలి. ఎన్నికల సంఘం ఏ ప్రభుత్వా నికీ బానిస కాదు, రాజ్యాంగానికే జవాబుదారీ సంస్థ. అందుకే అది తీసుకునే ప్రతి నిర్ణయం రాజకీయ అనుమానాలకు అతీతంగా కనిపించాలి. ప్రక్రియ ఎంత నిష్పాక్షికంగా ఉంటే, ప్రజల నమ్మకం అంత బలపడుతుంది. చివరికి ప్రశ్న ఒక్కటే. మన లక్ష్యం ఓటరు జాబితాను చిన్నది చేయడమా? లేక ప్రజాస్వామ్యాన్ని పెద్దది చేయడమా? ప్రజాస్వామ్యం పేరుతో ప్రజలను అనుమానించడం కాదు, ప్రజలను భాగస్వా ములను చేయడం అవసరం. ఓటు హక్కు కోసం ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకోవాల్సిన రోజు రాకూడదు. ప్రభుత్వం ప్రతి అర్హుడి ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యతను గుర్తుంచుకోవాలి. ప్రజాస్వామ్యం బుల్లెట్‌తో చనిపోదు. చాలా సందర్భాల్లో అది నెమ్మదిగా బలహీనపడుతుంది. ప్రజల స్వరం ఒక్కొక్క టిగా వినిపించకుండా పోయినప్పుడు, ఓటు హక్కు ఒక్కొక్కరికి దూరమైనప్పుడు, వ్యవస్థపై నమ్మకం క్రమంగా కరిగి పోయినప్పుడు అది జరుగుతుంది. అందుకే ఓటు జాబితా సవరణ ఏదైనా కావచ్చు-అది ప్రజల హక్కులను విస్తరించే దిశలో ఉండాలి తప్ప, సంకుచ ితం చేసే దిశలో కాదు. అదే ప్రజాస్వామ్యానికి నిజమైన కొలమానం.]
కోట మురళీకృష్ణ
9182001044


