Friday, July 10, 2026
E-PAPER
Homeఎడిట్ పేజివిద్వేష కాలంలో విస్మృత న్యాయం

విద్వేష కాలంలో విస్మృత న్యాయం

- Advertisement -

శాసన కార్యనిర్వాహక న్యాయ విభాగాలనే మూడు వ్యవస్థల మధ్య సమతుల్యత సాధించే లక్ష్యంతో రాజ్యాంగం రూపొందించబడింది. వలస పాలనా వ్యవస్థ విచ్ఛిన్నం ప్రారంభమైంది. ప్రస్తుతం దేశంలో విద్వేష వ్యాప్తి వాతావరణం ప్రధానంగా హిందూత్వ ద్వారా జరుగుతున్నది. ఇతరులను పరాయివారుగా చూపించడంపై ఇది ఆధారపడి వుంటుంది. కేవలం ఒక్క మతపరమైన గుర్తింపుపైనే గాక అనేక ఇతర గుర్తింపులను కూడా ఇది ఆధారం చేసుకుంటుంది. వాస్తవానికి భారత్‌ వంటి వైవిధ్యభరితమైన సమాజంలో ఇవన్నీ వుండటం సహజం. ఇది కచ్చితంగా రాజ్యాంగంలో పొందుపర్చుకున్న సమాన పౌరసత్వ సూత్రం నుంచి వైదొలగడమే అవుతుంది. కనుక హిందూత్వ ఎప్పుడైతే దేశ శాసన వ్యవస్థల విధాన నిర్ణయాలను నిర్దేశించే ప్రధాన భావజాలంగా మారిందో పాలనా న్యాయ వ్యవస్థలు అనివార్యంగా ఆ ప్రభావానికి గురవడం తప్పనిసరి. రాజ్యాంగ ఏర్పాటు ప్రకారం న్యాయ వ్యవస్థ రాజ్యంగ బద్దతను కాపాడే పాత్ర నిర్వహించాలి. ఏమైనా పరిపాలనను శాసించే భావజాలం క్రమేణా ఈ సువ్యవస్థిత సూత్రాన్ని కూడా కూలదోస్తున్నది. కనుక ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా వ్యవస్థ లోపలి నుంచి, బయిట నుంచి ఈ న్యాయ సూత్రాన్ని దెబ్బతీయడం అనేది అత్యంత తీవ్రమైన విషయం. అన్ని స్థాయిలలోనూ రిపబ్లిక్‌ రాజ్యాంగానికి కట్టుబడిన న్యాయ వ్యవస్థే లేకుండా పోవడం.

శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ చర్యల ద్వారా వ్యక్తమవుతున్న భావజాల ప్రాబల్యం తెస్తున్న ఒత్తిళ్లకు లోబడిపోవడం. వీటి వల్ల రాజ్యాంగం నిర్దేశించిన ఏర్పాటుకే ప్రమాదం వాటిల్లుతున్నది. న్యాయపరమైన నియంత్రణ కుప్పకూలిన దానికి అతి పెద్ద ఉదాహరణ తక్కిన రెండు వ్యవస్థలలో కాదు, సాక్షాత్తూ న్యాయ వ్యవస్థలోనే మనకు కనిపిస్తున్నది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నిరుద్యోగ యువతనూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం కోసం వాదిస్తున్న న్యాయవాదులనూ బొద్దింకలతో పోల్చారు. ఇక్కడ కాస్త సంతోషం కలిగించే విషయం ఒక్కటే. ఈ తరహా దిగజారు‌డుకు విరుగుడుగా ఈ రాజ్యాంగావరణాన్ని తిరిగి పొందేందుకోసం ప్రజానీకం ప్రయత్నించడం, ప్రజల మద్దతు లభించడం. బొద్దింకలంటూ ఈసడించిన ఈ వ్యాఖ్య నిరసన హక్కును రక్షించు కోనేలా పురికొల్పింది. పాలనా వ్యవస్థను జవాబుదారీగా నిల్పింది. ప్రభుత్వ పరీక్షల సక్రమ నిర్వహణకూ విశ్వసనీయతకూ సంబంధించిన అంశంపై ఈ ఉద్యమం తీసుకున్న ఉన్నత నైతిక ప్రమాణం పాలకుల పంటి కింద రాయిలా తయారైంది.

ప్రత్యక్షంగా సిజెఐలే…
న్యాయ వ్యవస్థలో ప్రధాన న్యాయమూర్తి వ్యక్తిగతంగా భాగం పంచుకున్న మరో కీలక నిర్ణయం ప్రజల ఓటు హక్కు హరించడానికి సంబంధించినది. ఓటు వేసేందుకు రాజ్యాంగం తమకు ఇచ్చిన హక్కును కోల్పోయేలా చేసింది. ఎన్నికల కమిషన్‌ నిరంకుశంగా తీసుకున్న నిర్ణయం స్వతంత్రతకు సంబంధించిన సమస్యగా చూడటా నికే న్యాయ వ్యవస్థ మొగ్గు చూపింది. భారీ సంఖ్యలో ఓటర్లకు రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కు లేకుండా పోతున్న అంశం కంటే కమిషన్‌ స్వతంత్రతే ముఖ్యంగా న్యాయ వ్యవస్థ భావించడం కూడా రాజ్యంగ ఉద్దేశాలను దెబ్బతీసింది. కమిషన్‌ జవాబుదారీ తనం అనే సమస్య పూర్తిగా తప్పిపోయింది. అది లేకుండా కమిషన్‌ స్వతంత్రత గురించి మాత్రమే చెప్పడమంటే వ్యవస్థ రాజకీయ ప్రయోజనా లను నిరంకుశంగా కాపాడటంగా మారుతుంది. దీనికంటే ముందు స్వయంగా సిజెఐ చంద్రచూడ్‌ – అయోధ్య తీర్పు కచ్చితంగా మసీదును కూల్చివేసిన మూకల విశ్వాసంపై ఆధారపడి ఇచ్చిందేనని ఒక ఇంటర్వ్యూలో బహిరంగంగా చెప్పారు. మరో విధంగా చెప్పాలంటే ఉత్తర్వులు న్నాయి కానీ వాటివల్ల న్యాయం జరగలేదు. స్వయంగా న్యాయ వ్యవస్థనే ఈ వాదనకు ఆమోద ముద్ర వేశాక ఇక రాజ్యాంగ సూత్రాలటుంచి చట్టబద్ద పాలన ఎలా బతికి బట్టకడుతుంది?

దిగువ స్థాయినే సాహసోపేతం
కానీ ఒకింత సంతోషం కలిగించే విషయమేమంటే న్యాయ వ్యవస్థ దిగువ స్థాయిలో న్యాయాధికారులు సాహసోపేతమైన తీర్పులు ఇవ్వడం. 2020లో మధ్యప్రదేశ్‌లో జరిగిన ఒక మూక హత్యాకాండ నేరంలో జడ్జి తబుస్సుం ఖాన్‌ ఏడుగురికి యావజ్జీవ శిక్ష విధించడంపైన ఆన్‌లైన్‌లో విద్వేష దాడి మొదలైంది. తీర్పును వదలిపెట్టి ఆమె మత విధేయత పైకి చర్చ మళ్లించబడింది. ఈ దాడి, మతపరమైన దుర్భాషలు, చంపేస్తామనే బెదిరింపుల కారణంగా పోలీసులు ఆమెకు రక్షణ ఇవ్వాల్సి వచ్చింది. ఇందుకోసం హైకోర్టు ఉన్నఫళాన జోక్యం చేసుకోవలసి వచ్చింది. న్యాయవాద వర్గాలు కూడా ఈ బెదిరింపులను ఖండించడం అభినందనీయం. ఇలాంటి ఘటనల వల్ల న్యాయవస్థ స్వతంత్రత దెబ్బ తింటుందనీ, చట్టబద్ధ పాలనపై నమ్మకం లేకుండా చేస్తుందని వారు హెచ్చరించారు. బాగా జాగ్రత్తగా అధ్యయనం చేశాకనే, చట్టబద్దమైన ప్రక్రియ పూర్తయ్యాకనే ఆ ఉత్తర్వు ఇవ్వబడింది. చెప్పుకోదగిన విషయమేమంటే ఈ దుర్భాషల పోస్టులకు గానీ కోర్టు విచారణ క్రమంతోగాని ఎలాంటి సంబంధం లేదు. ఈ కారణంగానే సీనియర్‌ న్యాయవాదులు, బార్‌ అసోసియేషన్లు, రాజకీయవేత్తలు, పౌర సమాజం మొత్తంగా దీన్ని తీవ్ర విషయంగా పరిగణించి జడ్జికి సంఘీభావం తెలిపేందుకు ముందుకొచ్చారు.

ఇలాంటి బెదరింపులు సూటిగా న్యాయ వ్యవస్థ స్వతం త్రతను దెబ్బగొడతాయని, న్యాయాధికారులు ధైర్యంగా వ్యవహరించకుండా చేస్తాయని మధ్యప్రదేశ్‌ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ బెదిరింపులకు పాల్పడిన వారిని అరెస్టు చేయాలని డిజిపిని, అదనపు ప్రధాన కార్యదర్శినీ హోం శాఖను ఆదేశించింది. జడ్జికి రక్షణ కొనసాగించాలని చెప్పింది. జడ్జి ఖాన్‌ పని చేసే చోట బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడుగా వున్న వ్యక్తి దీనిపై వ్యవస్థాగతంగా గట్టి చర్య ఏమీ లేకపోవడమేమిటని ప్రశ్నించారు. గో రక్షక్‌ అనబడే వారి మూక హత్యా కాండ వల్లనే వాస్తవంగా వ్యక్తి చనిపోవడం ఇక్కడ చెప్పుకోవలసిన విషయం.

నిరసనలు నిషేధమా?
రాజ్యాంగ సూత్రాన్ని అద్భుతంగా అమలు చేసిన మరో ఉదాహరణ జస్టిస్‌ మాధవ్ జామ్దార్ ది. తమను సవాలు చేసిన ఒక పిటిషనర్‌ను నగర బహిష్కారం విధించిన ముంబై పోలీసులను మీ చర్యకు ప్రాతిపదిక ఏమిటని ఆయన తీవ్రంగా మందలించారు. ఆ పిటిషనర్‌ ‘బీజేపీ సర్కార్‌ ముర్దాబాద్‌, అమిత్‌ షా ముర్దాబాద్‌’ అని నినాదాలిచ్చారంతే. పౌరులు అలాంటి నినాదాలు ఇవ్వకూడదా? అని ఆయన నిలదీశారు. ఆయన ఇంకా ఇలా వ్యాఖ్యానించారు: ఇదేమిటి? పౌరులంటే భారత ప్రభుత్వ బానిసలా? వారు నిరసనలు తెలపకూడదు. ఆందోళన చేయకూడదు. ఇదంతా ఏమిటి? ఇప్పుడు ఎన్నో ప్రశ్నా పత్రాలు లీకయ్యాయి. ప్రజలు నిరసన తెల్పితే మీరు కేసులు బనాయిస్తారు. పోలీసులటే ముఖ్యమంత్రి లేదా ప్రధాన మంత్రి బానిసలు కాదు. వారు ప్రజలకు సేవకులు. నేను ఆ అధికారులపై భారీ జరిమానాలు విధించ బోతున్నాను’’. యాదృచ్ఛికంగా ఇదే బాంబే హైకోర్టు…గాజా మారణకాండపై సిపిఎం నిరసన ప్రదర్శనను నిషేధించిన బాంబే పోలీసులను చర్యను… వెనక్కు తీసుకొనేట్టు చేసింది.

అంతకుముందు ‘సర్‌’ కింద ఓటు హక్కు కోల్పోయిన వారి ఫిర్యాదులను విచారించేందుకోసం సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారమే నియమితమైన 19 ట్రిబ్యునళ్లలో ఒకరైన జస్టిస్‌ టి.ఎస్‌.శివజ్ఞానం తాను ఆలకించిన 1777 ఫిర్యాదులలోనూ 1717 అన్యాయంగా తొలగించబడ్డాయని తేల్చారు. ఇది 96 శాతమన్నమాట. దీన్ని లెక్క కట్టి చూసినట్టయితే ఓట్లు కోల్పో యిన వారిని తొలగించడం పూర్తిగా తప్పుగానే జరిగిందని అర్థమవుతుంది. అది దాదాపు 25 లక్షల వరకూ వుంటుంది. అలాంటి వాటన్నిటినీ పరిష్కరించాలంటే దాదాపు 20 నుంచి 25 ఏళ్లు పడుతుంది. అయినా దురదృష్టవశాత్తూ అత్యున్నత న్యాయస్థానం ఇంత పచ్చి తప్పులతో జరిగినా ‘సర్‌’ రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనేనని చెప్పలేకపోయింది.

న్యాయం తోడుగావాలి!
మనం ఒక సంక్లిష్టమైన ఘట్టానికి చేరిపోయాము. చెలరేగిపోతున్న హిందూత్వ భావజాలం నేపథ్యంలోనే న్యాయ వ్యవస్థ పని చేస్తున్నది. శాసన వ్యవస్థ పాలనా వ్యవస్థ ద్వారా దానికి ఆయుధాలు చేకూర్చబడ్డాయి. ప్రజావరణం, ప్రజా నిరసనలు మాత్రమే ఈ సమయంలో ఒకే ఒక అర్థవంతమైన అంశాలుగా కనిపిస్తున్నాయి. ఆ విధంగానే రాజ్యాంగాన్ని కాపాడు కోవడం సాధ్యం. అయితే అలాంటి ప్రజా కార్యాచరణకు బాసటగా నిలవగల ధైర్యం న్యాయ వ్యవస్థ ప్రదర్శిస్తుందా? లేదా? అనేది అంతుపట్టని ప్రశ్న. జడ్జి ఖాన్‌, జస్టిస్ జామ్దార్‌, జస్టిస్ శివజ్ఞానం వంటి వారి ఉజ్వల ఉదాహరణలను అనుస రించవచ్చు. దాడులను తిప్పికొట్టి పౌరులకు ఉపశమనం కలిగించవచ్చు. న్యాయ వ్యవస్థ స్వతంత్రత విముక్తి పొందడానికి కూడా ఇదే మహత్తర పాత్ర వహిస్తుంది.
(జులై 8 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -