Thursday, July 30, 2026
E-PAPER
Homeజాతీయంసర్‌ తో ఓట్లు తొలగింపు

సర్‌ తో ఓట్లు తొలగింపు

- Advertisement -

బీజేపీ కుట్రను తిప్పి కొడదాం
పీసీపీ సమన్వయ కమిటీలో నిర్ణయం

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్(సర్‌) పేరుతో ఓట్లను తొలగించాలనే బీజేపీ కుట్రలను తిప్పి కొట్టాలని పీసీసీ సమన్వయ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. పూర్తి స్థాయిలో సర్ ప్రక్రియ ముగిసే వరకు పార్టీ ముఖ్య నేతలతో పాటు డీసీసీలు, మండల స్థాయి నేతలు, ప్రధానంగా బూత్ లెవల్ ఏజెంట్లు(బీఎల్ఏ) లు ఎలాంటి పనులు పెట్టుకోవద్దని ఆదేశించింది. ప్రతి ఓటు ప్రామాణికంగా తీసుకొని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు దక్కేలా పార్టీ బీఎల్ఏలు బాధ్యతలు తీసుకోవాలని స్పష్టం చేసింది. పీసీసీ సమన్వయ కమిటీ ఏర్పడిన సుమారు నాలుగు నెలల తర్వాత తొలిసారి ఈ కమిటీ భేటీ అయ్యింది. బుధవారం నాడిక్క‌డ‌ ఇందిరా భవన్‌లో పార్టీ రాష్ట్ర ఇన్‌‌చార్జి మీనాక్షి నటరాజన్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో సీఎం ఎ. రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్య‌క్షుడు మహేశ్‌ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, సీడబ్ల్యూసీ సభ్యులు మంత్రి దామోదర రాజా నర్సింహ, వంశీ చంద్‌లు పాల్గొన్నారు. దాదాపు గంటన్నరకు పాటు సాగిన ఈ భేటీలో కీలకంగా సర్‌ ప్రక్రియపై పార్టీ దృష్టి, రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. సర్‌‌లో అర్హులైన ఏ ఒక్క వ్యక్తి ఓటు కోల్పోకుండా పార్టీ బీఎల్ఏలు మరింత సమర్థవంతంగా పని చేయాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియలో బీఎల్ఏలకు మండల, జిల్లా నేతలతో పాటు ఎమ్మెల్యేలు తోడుగా ఉండాలని కమిటీ ఆదేశించింది. అలాగే ఖమ్మం-వరంగల్-నల్లగొండ, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

​ఓట్లు తొలగించే దురుద్దేశంతోనే సర్‌ : ‌పీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్
దేశంలో ఓట్లను తొలగించే దురుద్దేశంతో ‌సర్‌ ప్రక్రియ సాగుతోందని పీసీసీ అధ్య‌క్షుడు మహేశ్ కుమార్ గౌడ్ విమ‌ర్శించారు. స‌మావేశ‌ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ చేస్తోన్న ఓట్ల తొలగింపు కుట్రను నుంచి, ఓట్లను కాపాడే ఉద్దేశంతో చర్చ జరిగిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతోన్న ‌సర్‌ ప్రక్రియపై స‌మీక్షించామ‌ని ‌తెలిపారు. పార్టీ నుంచి దాదాపు 36 వేల మంది బూత్ లెవల్ ఏజెంట్లను(బీఎల్ఏ)లను నియమించినట్లు తెలిపారు. ఇప్పటికే 50-60 శాతం పూర్తయిందన్నారు. రెండూ మూడు రోజుల్లో 100 శాతం పూర్తవుతుందని తెలిపారు. అయితే అర్హతగల ఓటర్ల ఓటు హక్కు కాపాడటమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. అలాగే సంస్థాగత బలోపేతం..పార్టీ ప్రభుత్వ సమన్వయం పై చర్చించినట్లు చెప్పారు.

ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేర్చేలా యాక్షన్ ప్లాన్: డిప్యూటీ సీఎం భట్టి
ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అలాగే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎన్నికలపై జిల్లా ఇన్‌‌చార్జి, జిల్లా పీసీసీలతో చర్చించి, ముగ్గురు సభ్యులతో ప్యానల్ ఏర్పాటు చేసి నివేదిక అందించాల్సి ఉంటుందని తెలిపారు. దేశ పౌరులుగా ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండాలన్నారు. ఈ విషయంలో పార్టీ స్పష్టమైన వైఖరితో ఉందని చెప్పారు. పార్టీ ఏర్పాటు చేసిన బీఎల్ఏ లు క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా పని చేస్తోన్నారని అభినందించారు. మరింత వేగవంతంగా బీఎల్ఏలు పని చేయాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -