ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసిన వాతావరణ శాఖ
ఏడు జిల్లాలకు భారీ వర్ష సూచన
ఏటూరు నాగారంలో 15.2 సెంటీమీటర్ల భారీ వర్షం
857 ప్రాంతాల్లో వర్షపాతం నమోదు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో గురువారం తొమ్మిది జిల్లాల్లో అతిభారీ వర్షాలు, ఎనిమిది జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అతిభారీ వర్షాలు ఆదిలాబాద్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పడే సూచనలున్న నేపథ్యంలో ఆ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్న నేపథ్యంలో ఆ జిల్లాలకు ఎల్లో హెచ్చరికను విడుదల చేసింది. బుధవారం ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రాష్ట్రంలో 857 రెయిన్‌గేజ్ సెంటర్ల పరిధిలో వర్షపాతం నమోదైంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 172 ప్రాంతాల్లో వర్షం కురిసింది. ములుగు జిల్లాలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. ఏటూరు నాగారంలో 15.2సెంటీమీటర్ల అతి భారీ వర్షం కురిసింది. ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, కరీంనగర్, నిర్మల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి.
అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలు
ఏటూరు నాగారం(ములుగు) 15.2 సెంటీమీటర్లు
వాజేడు(ములుగు) 14.0 సెంటీమీటర్లు
ధర్మవరం(ములుగు) 13.8 సెంటీమీటర్లు
కన్నాయిగూడెం(ములుగు) 13.0సెంటీమీటర్లు
వెంకటాపురం(ములుగు) 12.0 సెంటీమీటర్లు
మేడారం (ములుగు) 10.30 సెంటీమీటర్లు
ముత్తారం మహదేవపూర్(భూపాలపల్లి) 10.25 సెంటీమీటర్లు
సర్వాయిపేట్(జయశంకర్ భూపాలపల్లి) 10.20 సెంటీమీటర్లు
కూనారం(పెద్దపల్లి) 10.03 సెంటీమీటర్లు



