సిరిసిల్ల సాయుధ పోరాటం..

Sirisilla armed struggle..– బద్దం ఎల్లారెడ్డి నాయకత్వం
– పోరాట వీరుడు అమృతలాల్‌ శుక్లా నేతృత్వంలో గెరిల్లాదాడులు
– గాలిపెల్లిలో ఇండ్లు తగలబెట్టిన రజాకార్లు
– నిజాం తూటాలకు ప్రాణాలొదిలిన ఎందరో వీరులు
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడేందుకు సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో సిరిసిల్లది చెరగని ముద్ర. నిజాంకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు, ఆయుధ శిక్షణ క్యాంపులు ఈ జిల్లాలో సాగాయి. ముఖ్యంగా ఇల్లంత కుంట మండలం గాలిపెల్లికి చెందిన బద్దం ఎల్లారెడ్డి సహా సిరిసిల్లకు చెందిన అమృత్‌లాల్‌ శుక్లా, అనభేరి ప్రభాకర్‌రావు, చెన్న మనేని రాజేశ్వర్‌రావు, దామోదర్‌రావు, తిరుపతిరెడ్డి, భూపతిరెడ్డి, రాజారాం వంటి ఎందరో యోధులు అజ్ఞాతవాసంలో ఉంటూ చారిత్రాత్మక పోరాటాన్ని కొనసా గించారు. తెలంగాణ విముక్తి ఉద్యమం చురుకుగా సాగుతున్న దశలో మాడపాటి హన్మం తరావు అధ్యక్షతన సిరిసిల్లలో 4వ ఆంధ్రమహాసభ జరిగింది. ఈ సభలో తీసుకున్న కీలక నిర్ణయాలతో తెలంగాణ సాయుధ పోరాటం ఉవ్వెత్తున ఎగిసింది. సురవరం ప్రతాపరెడ్డి, రావినారాయణరెడ్డి, బూరుగుల రామకృష్ణా రావు, పివి.నర్సింహారావు, బద్దం ఎల్లారెడ్డి, కెవి. రంగారెడ్డి లాంటి వారితో జిల్లాలోని పలువురు నాయకులు ఈ సభలో పాల్గొన్నారు. గాలి పెల్లికి చెందిన బద్దం ఎల్లారెడ్డి తెలంగాణ విముక్తి ఉద్యమంలో ముందున్నారు. రుద్రంగి మండలం లోని మానాల అడవుల్లో క్యాంపు ఏర్పాటు చేసి గెరిల్లా దళాలకు శిక్షణ ఇస్తూ ఉద్యమానికి బాటలు వేశారు. పేదలను పీడిస్తున్న ఇల్లంతకుంట పోలీస్‌క్యాంపుపై 1948 మార్చి 12న సాయుధ ఉద్యమకారులు దాడి చేశారు. ఈ ఘటనలో అప్పటి సాయుధ దళ నేత అనభేరి ప్రభాకర్‌రావు దళం పాల్గొంది. గెరిల్లా తరహా దాడులు తెలంగాణ ఉద్యమకారులు చేయడం ఇదే మొదటిసారి. అనంతరం అదే దాడులను కొనసాగించారు. 1948మార్చి 14న అనభేరి ప్రభాకర్‌రావు దళం హుస్నాబాద్‌ మండలం మహమ్మాదాపూర్‌ గుట్టల్లో ఆశ్రమం పొందుతుండగా పోలీసులు దాడులు చేశారు. అనభేరి సహా సిరిసిల్ల జిల్లాలోని లక్ష్మిపూర్‌కు చెందిన సింగిరెడ్డి భూపతిరెడ్డి, దామోదర్‌రెడ్డి, నారాయణ, భూంరెడ్డి, పాపయ్య, మల్లారెడ్డి పోలీసుల తుటాలకు ప్రాణం వదిలారు. ఈ పరస్పర దాడుల్లో ఇద్దరు పోలీసులూ మరణించారు.
పోరాట వీరుడు
అమృతలాల్‌ శుక్లా నిజాంను ఎదురించిన వారిలో సిరిసిల్లకు చెందిన అమృత్‌లాల్‌ శుక్లా ప్రముఖుడు. 1950లో సిరిసిల్ల పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసి సంచలనం సృష్టించారు. నిజాం నవాబులను గడగడలాడించి గడీలను లూటీ చేసి పేదలకు పంచాడు. దీంతో శుక్లాను నిజాం పోలీసులు నిర్బంధించారు. 13ఏండ్లు జైలు శిక్ష విధించి కారాగారానికి తరలిస్తుండగా తప్పించుకున్నాడు. 1957లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలకు సేవలందించారు. 1991నవంబర్‌ 14న ఆయన మరణించారు.
త్యాగాలపెల్లి.. గాలిపెల్లి
ఇల్లంతకుంట మండలం గాలిపెల్లికి చెందిన కమ్యూనిష్టు యోధుడు బద్దం ఎల్లారెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశాడని, అది జీర్ణించుకోలేని నిజాం పోలీసులు ఉద్యమ కారులపై ఉక్కుపాదం మోపుతూ నిర్బంధాన్ని అమలు చేశారు. వారి ఇండ్లను తగలబెట్టారు. భయపడని ప్రజలు నిజాంకు వ్యతిరేకంగా కొడవళ్ళు, గొడ్డళ్ళు, బరిసెలు, గుళేర్లతో పోరు కొనసాగించారు. ఈ పోరులో గాలిపెల్లితో పాటు సమీప గ్రామాలకు చెందిన 11మంది ఒకే రోజు అమరులయ్యారు.

Spread the love