– క్రీడలు,హోం శాఖ మంత్రులను బర్తరఫ్ చేయాలి : బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హకీంపేట్ క్రీడల పాఠశాలలోని విద్యార్థినులపై జరిగిన లైంగిక వేధింపులపై సిట్ విచారణ జరపాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీ తరహాలో మన రాష్ట్రంలో కూడా బ్రిజ్ భూషణ్ లున్నారని విమర్శించారు. ఓ వెటర్నరీ డాక్టర్ హరికృష్ణకు హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ లో ఏలా స్పెషల్ ఆఫీసర్ గా నియమిస్తారనీ, పశుసంవర్థక శాఖ నుండి క్రీడా శాఖకు ఎలా బదిలీ చేశారని ప్రశ్నించారు. తెలంగాణ గెజిటేడ్ అధికారుల సంఘం నాయకుడనే ఒకే ఒక్క కారణంతో క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్ అతనికి డిప్యుటేషన్ ఇచ్చారని ఆరోపించారు. కీచకుడు డాక్టర్ హరికృష్ణ పై ప్రభుత్వం సిట్ వేసి స్పోర్ట్స్ స్కూల్ లో జరిగిన లైంగిక వేధింపులపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ పరిధిలోని జల్‌పల్లి మున్సిపాలిటీలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న పాత బస్తీకి చెందిన సామాజిక కార్యకర్త షేక్ సయీద్ బావజీర్‌ను బండ్లగూడలో హత్య చేయడం దారుణమన్నారు. హత్యకు ముందే హోంమంత్రి మహమూద్ అలీకి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినా ప్రాణాలు కాపాడలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలను రక్షించలేని హోంమంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల నిర్లక్ష్యంతోనే రామాయంపేటలో ఖదీర్‌ఖాన్‌ను లాకప్ డెత్ చేశారనీ, రాష్ట్రంలో గుండాయిజం పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలే హత్యలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ వెంకటేష్ చౌహన్, ముస్లిం యునైటెడ్ ఫ్రెండ్ ఫెడరేషన్. కన్వీనర్ కైరుద్దీన్ సుఫీ, హర్షద్ హుస్సేన్, మహ్మద్ షఫీ, అబ్రహర్ హుస్సేన్ బీఎస్పీ అధికార ప్రతినిధి అరుణ క్వీన్ తదితరులు పాల్గొన్నారు.