నిద్ర

sleep‘కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది… కుదుట పడ్డ మనసు మనిషి మాట వింటది’ అంటారు ఓ సినీ గేయ రచయిత. నిజమే కదా! సరైన నిద్ర లేని వ్యక్తి మెదడు సత్తువ కోల్పోతుంది. అలాంటప్పుడు నాణ్యమైన ఆలోచనలు ఎలా వస్తాయి? హాయిగా నిద్ర పోతే మనసు ప్రశాంతంగా ఉంటుంది. దాంతో మెదడు కూడా ఉత్సాహంగా ఉంటుంది. అప్పుడు ఆలోచనలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ‘ఆకలి రుచి ఎరుగదు… నిద్ర సుఖమెరుగదు’ అని కూడా అంటారు. అంతే కదా! కంటి నిండా నిద్రలేని కోటీశ్వరుడు చెట్టుకిందైనా ఆదమరచి నిద్రపోతాడు. నిద్రకున్న విలువ అలాంటిది మరీ. కానీ నిద్ర కరువౌతున్న రోజుల్లో మనం బతుకుతున్నాం.
నిద్ర శరీరానికి సంబంధించిన ఓ విశ్రాంతి స్థితి. అయితే ఇది మనుషులకు మాత్రమే కాదు జంతువులు, పక్షులు చివరకు మొక్కలకు కూడా చాలా అవసరం. ఏ జీవైనా ఆరోగ్యంగా ఉండాలన్నా, ఎదగాలన్నా నిద్ర చాలా అవసరం. అయితే మనిషికి నిద్ర అత్యంత ముఖ్యమైనదనీ, ఇది పౌరుల ప్రాథమిక హక్కని, ఆరోగ్య జీవనానికి, ఆలోచనలకు చాలా అవసరమైనదని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది. 2003లో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో జరిగిన పరిశోధనల ఫలితంగా 8 గంటల కంటే తక్కువ నిద్రపోయిన వారిలో శరీర సామర్థ్యం తగ్గినట్లుగా గుర్తించారు. ఎంత పరిశోధించినా నిద్ర ప్రాముఖ్యం గురించి పూర్తి స్థాయిలో కనుగొనలేకపోయారు. అందుకే ఇంకా విస్తృతమైన పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.
రోజూ తగినంత నిద్ర లేకపోతే చిరాకు, మతిమరుపు, డిప్రెషన్‌ వంటి పలు సమస్యలు తలెత్తుతాయి. మధుమేహం, స్థూలకాయం, రక్తపోటు, గుండె జబ్బులు వంటివి రోజూ తగినంత నిద్ర లేకపోవడం వల్లనే వస్తాయి. సరైన నిద్ర లేని వ్యక్తి ప్రశాంతమైన జీవితాన్ని గడపలేడు. అతని మనసంతా అల్లకల్లోలంగా ఉంటుంది. అలాంటి వారి నుండి చక్కటి పని తీరుని ఆశించలేం. కనుక మనిషికి గాఢమైన నిద్ర చాలా అవసరం. అలాంటి నిద్ర వల్ల మెదడుకు విశ్రాంతి దొరుకుతుంది. దానితో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని అభివృద్ధి చేస్తుంది. నాడీ వ్యవస్థ సరిగా పనిచేసేందుకు దోహదం చేస్తుంది. హార్మోన్ల ఉత్పత్తి, నియంత్రణ నిద్ర వల్ల సక్రమంగా జరుగుతుంది. చక్కటి నిద్ర ఒత్తిడి తగ్గించి మన రోజును తాజాగా ప్రారంభించడంలో సహాయపడుతుంది.
కాబట్టి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తగినంత నిద్ర అవసరం. అది కూడా రాత్రి వేళ త్వరగా నిద్రించి ఉదయం త్వరగా లేవడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. అందుకే ఎర్లీ టు బెడ్‌, ఎర్లీ టు రైజ్‌ అన్నారు. ఒకప్పుడైతే పగలంతా శ్రమించిన వ్యక్తి రాత్రి భోజనం పూర్తి చేసిన వెంటనే సాధారణంగా నిద్ర పట్టేసేది. అయితే ఈ ఆధునిక పోటీ ప్రపంచంలో బిజీగా వుంటూ ఎప్పుడు నిద్రపోతున్నామో, ఎప్పుడు తింటున్నామో తెలియని పరిస్థితి. సమయానికి నిద్రపోవడం అనేది చాలా వరకు మర్చిపోయాం. నిద్ర పట్టకపోవడానికి మారిపోయిన మన పని వేళలు కూడా ఓ కారణం. రాత్రి ఉద్యోగాలు సర్వసాధారణ మయ్యాయి. దాంతో నిద్ర వేళలు కూడా మారిపోయాయి. దాంతో నిద్ర అత్యంత అపురూపమైన కానుకయింది. డబ్బు లేని వారికన్నా నిద్ర లేని వారినే పేదవారిగా భావించే పరిస్థితి వచ్చింది. ఇంకా చెప్పాలంటే హాయిగా నిద్రపోయే వారిని చూసి అసూయ పడుతున్నాం. ఏది ఏమైనా మనం ఆరోగ్యంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండాలంటే నిద్ర చాలా అవసరం. అందుకే దాన్ని అశ్రద్ద చేయవద్దు.

Spread the love